
Dengue Vaccine: దేశంలో దశాబ్దాలుగా చాపకింద నీరులా వ్యాపిస్తూ వేలాది మందిని భయపెడుతున్న డెంగ్యూ రక్కసికి ఎట్టకేలకు చెక్ పడనుంది. జపాన్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ‘టకేడా బయోఫార్మాస్యూటికల్స్’ అభివృద్ధి చేసిన ‘క్యుడెంగా’ (QDENGA / TAK-003) వ్యాక్సిన్ వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO/DCGI) అధికారిక అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటివరకు కేవలం దోమల నివారణ, ముందస్తు నిర్ధారణ ,సహాయక చికిత్సలకే పరిమితమైన డెంగ్యూ పోరాటంలో ఈ వ్యాక్సిన్ రాక ఒక కీలక మలుపుగా మారనుంది. భారతదేశంలో ఆమోదం పొందిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న డెంగ్యూ కేసుల్లో దాదాపు మూడోవంతు ఒక్క భారతదేశంలోనే నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గడచిన రెండు దశాబ్దాల్లో దేశంలో డెంగ్యూ కేసులు దాదాపు 11 రెట్లు పెరగ్గా, ఒక్క 2025లోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వ్యాధి ఉధృతి పెరిగి ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టీకా అందుబాటులోకి రావడం వల్ల బాధితులు ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఏకంగా 84.1 శాతం వరకు తగ్గుతుందని క్లినికల్ ట్రయల్స్ స్పష్టం చేయడంతో ప్రజారోగ్య వ్యవస్థకు పెద్ద ఊరట లభించినట్లయింది.
‘క్యుడెంగా’ అనేది డెంగ్యూకు కారణమయ్యే నాలుగు రకాల వైరస్ సీరోటైప్ల (DENV 1, 2, 3, 4) నుంచి రక్షణ కల్పించే టెట్రావాలెంట్ లైవ్-అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్‌ను 4 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఎవరైనా తీసుకోవచ్చు. డెంగ్యూ ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో 6 నుండి 16 ఏళ్ల పిల్లలకు దీని వినియోగాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే ప్రత్యేకంగా సిఫార్సు చేసింది. ఆసియాలోని 43 దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 32 మిలియన్లకు పైగా ఈ డోసులను పంపిణీ చేశారు.
Also Read : ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: పార్లమెంట్ ముట్టడికి ‘సీజేపీ’ పిలుపు.. సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కేఅరెస్ట్
ఈ వ్యాక్సిన్ యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని తీసుకునే ముందు గతంలో డెంగ్యూ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఎలాంటి రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ముందస్తు పరీక్షలతో సంబంధం లేకుండా ఎవరైనా సురక్షితంగా ఈ టీకాను వేసుకోవచ్చు. చర్మం కింద 0.5 ఎంఎల్ (0.5 ml) పరిమాణంలో, మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. భారత జనాభాపై నిర్వహించిన ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్, అంతర్జాతీయ పరిశోధనల ఆధారంగా నిపుణుల కమిటీ ఈ ఆమోదాన్ని తెలిపింది.
దేశంలో వ్యాక్సిన్ కొరత లేకుండా వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు టకేడా సంస్థ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ‘బయోలాజికల్-ఈ’ (Biological E) సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఏటా 50 మిలియన్ (5 కోట్లు) డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని భారత్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఇది భారతీయ ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా, ప్రపంచవ్యాప్త సరఫరాకు కూడా భారతదేశాన్ని ఒక ప్రధాన కేంద్రంగా మార్చనుంది.
అయితే డ్రగ్ కంట్రోలర్ నుంచి నియంత్రణ ఆమోదం లభించినప్పటికీ, మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ధర ఎంత ఉండాలి, జాతీయ టీకా కార్యక్రమంలో దీనిని ఎప్పుడు చేర్చాలి, ప్రారంభంలో ఏ వయస్సు వారికి ప్రాధాన్యత ఇవ్వాలి,ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తారా లేదా అనే అంశాలపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది. ఏది ఏమైనప్పటికీ, క్యుడెంగా వ్యాక్సిన్‌కు అనుమతి లభించడం డెంగ్యూపై భారతదేశం సాధించిన చారిత్రాత్మక విజయంగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు.
Also Read : ఢిల్లీలో హైఅలర్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సీజేపీ నేతలు అరెస్ట్!









