
Vande Mataram : జాతీయ గీతం వందేమాతరంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనగణమనకు ఏ స్థాయిలో అయితే చట్టపరమైన రక్షణ ఉందో, ఇప్పుడు వందేమాతరంకు కూడా అదే స్థాయి గౌరవం, రక్షణ కల్పించేలా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక కొత్త బిల్లును తీసుకురానున్నారు. నేటినుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజే, రాజ్యసభలో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్లు 2026ను ఆయన ప్రవేశపెట్టనున్నారు.
Also Read : ముంబై లోకల్ ట్రైన్లో రచ్చ రచ్చ.. యువకుడిపై హిజ్రాలు దాడి!
ప్రస్తుతం ఉన్న ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్, 1971 చట్టంలో ఈ మార్పులు చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఈ చట్టం జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతానికి మాత్రమే రక్షణ కల్పిస్తోంది. ఎవరైనా జాతీయ గీతాన్ని పాడకుండా అడ్డుకున్నా, పాడేటప్పుడు కావాలని గొడవ చేసినా వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఇదే తరహాలో వందేమాతరంను కూడా చేర్చుతున్నారు. అంటే, ఎవరైనా కావాలని అవమానించినా, పాడకుండా అడ్డుకున్నా, లేదా ఆ సమయంలో ఏదైనా అల్లరి చేసి అంతరాయం కలిగించినా, అది నేరంగా పరిగణించబడుతుంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఈ బిల్లును తీసుకురావడానికి కొన్ని రోజుల క్రితమే, జూలై 9న కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం, జనగణమన రెండింటినీ పాడినప్పుడు, ముందుగా వందేమాతరం పాడాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ బిల్లు ద్వారా జాతీయ గేయానికి మరింత చట్టబద్ధమైన హోదా లభిస్తుంది. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదం లభిస్తే, ఈ సవరణ చట్టం అమల్లోకి వస్తుంది. దీనివల్ల మన జాతీయ గేయం పట్ల గౌరవం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read : మలుపు తిప్పిన ఘటన: ఆస్తులున్నా.. రోజుకు 12 గంటలు క్యాబ్ నడుపుతున్న కోటీశ్వరుడు!









