
సాధారణంగా చాలామంది నెలకు మంచి ఆదాయం లేదా కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ఏం చేస్తారు?.. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు? లేదా ఒక మంచి బిజినెస్ పెట్టుకుంటారు. హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. అంతేకానీ ఎవ్వరూ కూడా రాత్రింబవళ్లు కష్టపడాలని అనుకోరు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నం. అతడికి రూ.80 లక్షల విలువ చేసే రెండు ఫ్లాట్‌లు ఉన్నాయి. వాటి ద్వారా నెలకు భారీగా అద్దె డబ్బులు వస్తాయి. కానీ అతడు ప్రతి రోజూ 12 గంటలు కష్టపడుతున్నాడు. రోజూ ఊబర్ నడుపుతూ నెలకు వేలల్లో సంపాదిస్తున్నాడు. అయితే దానికీ ఓ బలమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీలో ఆస్థా సేథ్ అనే మహిళ ఒక ఉబర్ క్యాబ్ ఎక్కారు. అనంతరం కారులో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్‌తో కేవలం 5 నిమిషాలు మాట్లాడారు. ఆ కొద్ది సమయంలోనే ఆ డ్రైవర్ పంచుకున్న తన జీవిత విశేషాలు ఆమెను ఎంతగానో ఆలోచింపజేశాయి. ఆయన చెప్పే విషయాలు ఆమెకు ఎంతో సర్‌ప్రైజింగ్‌గా అనిపించాయి. అతని పట్టుదల ఆమెను ఆకట్టుకోవడంతో.. క్యాబ్ డ్రైవర్ స్టోరీని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఆ పోస్టు ప్రకారం.. ఆ క్యాబ్ డ్రైవర్ స్వస్థలం బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా. ఉపాధి కోసం ఢిల్లీ వచ్చాడు. అక్కడ తన బంధువులకు చెందిన ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అలా మంచి ఆదాయంతో సాఫీగా సాగిపోతున్న అతడి జీవితంలో ఊహించని పరిణామం ఎదురైంది. గత ఏడాది ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. ఆ తర్వాత ప్రాణాలతో బయటపడినప్పటికీ.. గతంలోలా శారీరక పనులు చేయలేకపోయేవాడు.
ఆ సమయంలో అతడికి అండగా ఉండాల్సిన బంధువులు.. అవమానించారు. ‘‘నువ్వు ఇక దేనికీ పనికిరావు.. చాలా శక్తిహీనుడువి’’ అంటూ ఘోరంగా తిట్టేవారు. ఆ మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన.. తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీ ఉద్యోగానికి రిజైన్ చేశాడు. అనంతరం ఏ మాత్రం వారి మాటలకు నిరాశ చెందకుండా.. తనను తాను నిరూపించుకోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. నిజానికి ఆ డ్రైవర్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు.
నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ పరిసరాల్లో అతడికి రెండు సొంత ఫ్లాట్లు ఉన్నాయి. వాటి విలువ దాదాపు రూ.80లక్షల పైనే ఉంటుంది. వాటి ద్వారా నెలకు అద్దె రూ.80వేల వరకు వస్తుంది. స్వంత ఊరిలో కూడా ఆస్తులు బాగానే ఉన్నాయి. ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ.. విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. రోజూ ఉబర్ క్యాబ్ డ్రైవింగ్‌ను ఉదయం 10 గంటలకు మొదలు పెట్టి రాత్రి 10 గంటల వరకు సుమారు 12 గంటలు కష్టపడుతున్నాడు. దీని ద్వారా నెలకు రూ.50000 వరకు సంపాదిస్తున్నాడు. ఇలా అద్దె, క్యాబ్ సంపాదన ద్వారా నెలకు రూ.1.30లక్షల వరకు ఆందాయం పొందుతున్నాడు.
ఇక తనకున్న రెండు ఫ్లాట్‌లను తన ఇద్దరి కూతుళ్ల పేరున రాసేశాడు. వారి భవిష్యత్తు.. పెళ్లి లేదా చదువుల కోసం వాటిని కేటాయించాడు. ఇలా వాటి జోలుకువెళ్లకుండా.. కేవలం తన ఖర్చుల కోసం మాత్రమే కష్టపడాలని నిర్ణయించుకున్నాడు.









