
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి చేసిన విధ్వంసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఐర్లాండ్‌లోని షానన్ ఎయిర్‌పోర్టులో పార్క్ చేసి ఉన్న అమెరికా సైన్యానికి చెందిన భారీ రవాణా విమానం ‘సీ-130 హెర్క్యూలస్’పై ఓ దుండగుడు దాడి చేసి పూర్తిగా పనికిరాకుండా చేశాడు. నవంబర్ 11న జరిగిన ఈ షాకింగ్ ఇన్సిడెంట్‌కు సంబంధించి డైథీ ఓకొర్రిన్ (48) అనే వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అరెస్ట్ చేశారు.
ఫేక్ ఐడీతో ఎంట్రీ.. పక్కా ప్లాన్‌తో అటాక్!
అమెరికా మిలిటరీకి కీలకమైన ట్రాన్స్ అట్లాంటిక్ హబ్‌గా ఈ ఎయిర్‌పోర్టుకు పేరుంది. అయితే నిందితుడు డైథీ ఓకొర్రిన్ ‘డేవిడ్ కరన్’ అనే ఫేక్ నేమ్‌తో ఎయిర్‌పోర్టు సెక్యూరిటీని బురిడీ కొట్టించి, నేరుగా ట్యాక్సీవేపై ఉన్న విమానం వద్దకు చేరుకున్నాడు. అనంతరం తన వద్ద ఉన్న గొడ్డలి, ఇతర బలమైన పనిముట్లతో విమానం వెనుక డోర్ లాక్స్ బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు.
విమానంలోని కీలక భాగాలైన వైర్ బండిల్స్, హైడ్రాలిక్ లైన్లు, కాక్‌పిట్ గేజ్‌లు, ఎయిర్ డక్ట్‌లను నిందితుడు పూర్తిగా ధ్వంసం చేశాడు. అంతేకాకుండా, విమాన బాడీ తయారీలో వాడే అల్యూమినియాన్ని నిమిషాల్లో తినేసే ‘గాలియం’ అనే ప్రమాదకర లిక్విడ్‌ను విమానంపై చల్లాడు. ఆ తర్వాత రూఫ్ హాచ్ ద్వారా పైకి వచ్చి విమాన కవచాన్ని దెబ్బతీయడమే కాకుండా, ఫ్యూయల్ ట్యాంక్ లాక్స్ ఓపెన్ చేసి అందులో బాల్బేరింగ్స్ వేశాడు. గమనించిన భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించి విమానం పైకప్పు మీదే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
రూ. 560 కోట్ల నష్టం..
ఈ దాడి వల్ల సుమారు 60 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 560 కోట్లు) విలువైన ఈ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ఏమాత్రం రిపేర్ చేయలేని విధంగా తుక్కుతుక్కు అయిపోయిందని నిపుణులు చెబుతున్నారు. నిందితుడికి విమాన కంట్రోల్ వైర్లు, ఆక్సిజన్ సిస్టమ్స్‌పై పూర్తి అవగాహన ఉందని, ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మరీ గాలియం క్యాప్సుల్స్ ఆర్డర్ చేశాడని అధికారులు గుర్తించారు. హై-సెక్యూరిటీ జోన్లో ఇంత పెద్ద భద్రతా వైఫల్యం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.









