Skyroot Aerospace : భారత అంతరిక్ష రంగంలో సరికొత్త ప్రైవేట్ విప్లవానికి తెరలేచింది. ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌ (Skyroot Aerospace)’ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తొలి ఆర్బిటాల్‌ క్లాస్‌ రాకెట్‌ ‘విక్రమ్‌-1 (Vikram-1)’ శనివారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రైవేట్ రంగంలో దేశీయంగా రూపొందించి, ప్రయోగించిన తొలి ఆర్బిటాల్ రాకెట్‌గా విక్రమ్-1 చరిత్ర సృష్టించడంతో భారత అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త మైలురాయి నమోదైంది.

Also Read : ఏపీలో కరోనా కలకలం: నెల రోజుల్లోనే 4 మరణాలు, 12 పాజిటివ్ కేసులు

వాస్తవానికి ఈ ప్రయోగం ఉదయం 11.30 గంటలకే జరగాల్సి ఉంది. అయితే కౌంట్‌డౌన్ ముగిసే సమయానికి ఇంధన ప్రక్రియలో స్వల్ప సాంకేతిక లోపం తలెత్తినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, స్కైరూట్, ఇస్రో సాంకేతిక బృందాలు యుద్ధప్రాతిపదికన పరిశీలనలు జరిపాయి. లోపాన్ని వేగంగా సరిదిద్దిన అనంతరం, నిర్దేశిత సమయం కంటే 35 నిమిషాల ఆలస్యంగా రాకెట్ గాల్లోకి లేచింది. ప్రయోగం ప్రారంభమైన దాదాపు 20 నిమిషాల వ్యవధిలోనే రాకెట్ విజయవంతంగా ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

స్కైరూట్ సంస్థ ఈ ప్రయోగానికి ‘మిషన్‌ ఆగమన్‌’ అని నామకరణం చేసింది. భారత ప్రైవేట్‌ అంతరిక్ష రంగం కక్ష్యల ప్రయోగాల (Orbital Launches) యుగంలోకి అధికారికంగా అడుగుపెడుతున్న సందర్భంగా ఈ పేరును ఎంచుకున్నారు. సుమారు ఏడు అంతస్తుల భవనం ఎత్తు (20 మీటర్లు) ఉండే ఈ రాకెట్‌ను పూర్తిగా తేలికపాటి, అత్యంత బలమైన ‘కార్బన్ కాంపోజిట్’ నిర్మాణంతో తయారు చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 3డీ ప్రింటెడ్‌ లిక్విడ్ ఇంజిన్లు, ఘన ఇంధన బూస్టర్లతో పనిచేసే ఈ రాకెట్.. 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ (LEO) లోకి చేరవేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ మిషన్ ద్వారా కేవలం సాంకేతిక ఉపగ్రహాలనే కాకుండా దేశం గర్వించే పలు ప్రత్యేక గుర్తులను కూడా అంతరిక్షంలోకి పంపారు. ఇందులో అత్యంత ప్రధానమైనది ప్రధాని నరేంద్ర మోదీ స్వహస్తాలతో ‘వందేమాతరం’ అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్‌కార్డు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అగ్ని కణాలను రగిల్చిన వందేమాతరం గేయం 150 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మోదీ ఈ సందేశాన్ని రాశారు. రాకెట్ విజయవంతంగా కక్ష్యకు చేరుకున్న తరుణంలో.. “వందేమాతరం అంతరిక్ష కక్ష్యలోకి విజయవంతంగా చేరింది” అని స్కైరూట్ బృందం ప్రకటించింది.

ప్రధాని మోదీ సందేశంతో పాటు, ప్రముఖ సంస్థ ‘కాస్మోస్ డైమండ్స్’ రూపొందించిన ‘కాస్మిక్ బ్లూమ్’ ఆర్ట్‌వర్క్‌ను, విక్రమ్-1 రాకెట్ సూక్ష్మ ప్రతిరూపాన్ని కూడా రోదసిలోకి పంపారు. ఈ నమూనాపై భారతదేశ కీర్తి కిరీటాలైన సర్ సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ చిత్రాలను అద్భుతంగా చెక్కారు. వీటితో పాటు, ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇస్రో మాజీ ఛైర్మన్లు, సీనియర్ శాస్త్రవేత్తలు, భారతీయ వ్యోమగాములు, స్కైరూట్ సభ్యులు రాసిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్ట్‌కార్డులను కూడా ఒక ప్రత్యేక పేలోడ్ బాక్స్‌లో భద్రపరిచి అంతరిక్షంలోకి పంపడం విశేషం.

Also Read : తెలంగాణలో పోక్సో చట్టం పటిష్ఠ అమలు: సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ

విక్రమ్-1 ద్వారా గ్రహాస్పేస్, కాస్మోసెర్వ్, డీక్యూబ్డ్‌ వంటి ప్రముఖ స్పేస్‌టెక్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ పేలోడ్లతో పాటు, స్కైరూట్‌కు చెందిన సొంత పేలోడ్ ‘స్కోప్‌ (SCOPE)’ ను రోదసిలోకి చేర్చారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్‌లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ డేటా ఆధారంగా భవిష్యత్తులో వాణిజ్యపరంగా గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్‌ను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా స్కైరూట్ అడుగులు వేస్తోంది.

ప్రయోగం విజయవంతమైన వెంటనే స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్‌కుమార్ చందన, నాగ్‌ భరత్‌లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ వారిని అభినందిస్తూ.. “అనుకున్న సమయానికంటే ముందుగానే లక్ష్యాలను సాధించారు. ఈ మిషన్ మొదటి అడుగు మాత్రమే, దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలి” అని ఆకాంక్షించారు. ఈ లాంచ్‌ను తాను కూడా వీక్షించానని, భారత యువత కలలకు ఈ విజయం కొత్త రెక్కలు తొడిగిందని ప్రశంసించారు. తమ బృందంలో అత్యధికులు యువకులేనని, వారి సగటు వయసు కేవలం 28 ఏళ్లేనని పవన్ కుమార్ ప్రధానికి వివరించారు.

ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు దేవాంశ్‌తో కలిసి శ్రీహరికోటలోని ఇస్రో గ్యాలరీ నుండి ప్రత్యక్షంగా వీక్షించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి ఈ విజయం సరికొత్త దారులను చూపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2022లో ‘విక్రమ్-ఎస్‌’ ద్వారా దేశంలోనే తొలి ప్రైవేట్ సబ్-ఆర్బిటాల్ రాకెట్‌ను ప్రయోగించిన స్కైరూట్.. ఇప్పుడు ‘విక్రమ్-1’ తో పూర్తి స్థాయి ఆర్బిటాల్ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసి అంతరిక్ష వాణిజ్యంలో సరికొత్త రికార్డులను సృష్టించింది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.