
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి వాతావరణం కనిపించడం లేదు. రోజురోజుకు యుద్ధం ముదురుతోంది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోని రహస్యమైన ‘సిచువేషన్ రూమ్’ లో రక్షణ రంగ ఉన్నతాధికారులతో అత్యవసర, ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరాన్ ఉనికిని శాసించే రెండు ప్రధాన ప్రాంతాలపై దాడులు చేయాలని ట్రంప్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో మొదటిది ఇరాన్ ఆర్థిక రథచక్రమైన ‘ఖర్గ్ ద్వీపం’. ఇరాన్ దేశానికి వచ్చే మొత్తం చమురు ఆదాయంలో ఎక్కువ భాగం ఈ ద్వీపం నుంచే వస్తుంది. ఒకవేళ అమెరికా సైన్యం ఖర్గ్ ద్వీపాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటే.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. అయితే ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అంత ఈజీ కాదు. దీని కోసం అమెరికా నేరుగా యుద్ధానికి దిగాల్సి ఉంటుంది. అదే కనుక జరిగితే అమెరికా సైన్యానికి కూడా భారీగా ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : చరిత్రలో తొలిసారి.. అమెరికా బంగారు నాణెంపై ట్రంప్ బొమ్మ.. ఫస్ట్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!
దీంతో పాటు అంతర్జాతీయ నౌకాయానానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి సమీపంలో ఉన్న ఇరాన్ ఆధీనంలోని అబూముసా, గ్రేటర్ టన్‌బ్, లెస్సర్ టన్‌బ్ వంటి కీలక ద్వీపాలను కూడా తమ కబ్జాలోకి తీసుకోవాలని అగ్రరాజ్యం భావిస్తోంది. అలాగే ‘పికాక్స్ పర్వతం’ కింద భూగర్భంలో ఇరాన్ రహస్య అణు స్థావరాన్ని నిర్మించిందని అమెరికా గట్టిగా అనుమానిస్తోంది. ఇరాన్ తన అణుబాంబు తయారీకి కావాల్సిన అత్యంత నాణ్యమైన, శుద్ధి చేసిన యురేనియాన్ని ఇక్కడే దాచి ఉంచిందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పికాక్స్ పర్వత భూగర్భ స్థావరాన్ని పేల్చివేయడం ద్వారా ఇరాన్ అణు కలలను శాశ్వతంగా సమాధి చేయవచ్చని అమెరికా ప్లాన్లు వేస్తోంది. ఇప్పటికే ఇరాన్‌కు చెందిన పలు అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఉమ్మడిగా దాడులు చేశాయి. అయితే కొండల కింద వందల అడుగుల లోతులో ఉన్న ఈ పికాక్స్ భూగర్భ కేంద్రాన్ని సాధారణ క్షిపణులతో ధ్వంసం చేయడం అసాధ్యమని కూడా భావిస్తున్నాయి.
Also Read : ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభమా?









