World War III
World War III

-RAVI PRAKASH

World War III : ఇరాన్ – అమెరికా యుద్ధంలోకి ఇప్పుడు రష్యా అఫీషియల్‌గా అడుగుపెట్టిందా? ఒకవేళ లేదు అనుకుంటే… రష్యాకు చెందిన ఆ టాప్ సీక్రెట్‌ Aircraft Doomsday అకస్మాత్తుగా ఇరాన్‌లో ఎందుకు ల్యాండ్ అయింది? నేషనల్ ఎమర్జెన్సీ, మహా యుద్ధాలు సంభవించినప్పుడు మాత్రమే యాక్టివేట్ అయ్యే విమానం ఇది! ఏ క్షణంలోనైనా సరే… దేశ అగ్రనాయకత్వం, మిలిటరీ కమాండర్లు గాల్లో నుంచే సైనిక చర్యలను, ప్రభుత్వాన్ని నడిపించగలిగే అత్యంత ఆధునిక కమాండ్ సెంటర్ ఇది! కాబట్టి ఇప్పుడు తలెత్తిన అసలైన ప్రశ్నేంటంటే… బెంజమిన్ నేతన్యాహు వెనుక డోనాల్డ్ ట్రంప్ బలంగా నిలబడినట్టే… ఇరాన్ సుప్రీం లీడర్ వెనుక ఇప్పుడు పుతిన్ వచ్చి నిలబడ్డారా? ఈ విమానం టెహ్రాన్‌లో దిగిన తర్వాత… డోనాల్డ్ ట్రంప్ ఏమన్నారు? ఆ వివరాల్లోకి కాసేపట్లో వెళ్దాం.

కానీ, అంతకంటే పెద్ద ప్రశ్న ఏంటంటే… ఇప్పటికే తమ తమ సొంత యుద్ధాలు చేస్తున్న ప్రపంచ దేశాల అధినేతలు… ఇప్పుడు ఇరాన్‌ను ఒక మహా ప్రపంచ యుద్ధ క్షేత్రంగా మార్చబోతున్నారా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఆ బలహీన స్థానం… ఇప్పుడు ఇరాన్ చేతుల్లోకి వెళ్లిపోయిందా? ఇరాన్‌ను దారిలోకి తెచ్చేందుకు ట్రంప్ వేసిన ప్లాన్లన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయా? ఈ వివాదం ఇప్పుడు ప్రపంచాన్ని ఒక ప్రమాదకరమైన యుద్ధ సుడిగుండంలోకి నెట్టేసిందా? ఒక ప్రతీకార వ్యూహం… ఎవరికీ బయటపడే దారి కనిపించని ఒక ఉచ్చులా మారిందా? ఇక అన్నిటికంటే పెద్ద ప్రశ్న… సడన్‌గా ఈ యుద్ధం మళ్లీ ఎందుకు మొదలైంది? అసలు Ceasefire ఎందుకు ఫెయిల్ అయింది? దీనివల్ల లాభపడుతోంది ఎవరు? నష్టపోతోంది ఎవరు? దీని పరిణామాలు ఎంతదూరం వెళ్తాయి? అసలు ఒకే ఒక్క ఇరుకైన సముద్ర మార్గం… కేవలం కొద్ది మైళ్ల వెడల్పు ఉన్న ఒక జలసంధి… ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద Geopolitical సంక్షోభానికి కేంద్ర బిందువుగా ఎలా మారింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం.

అంతేకాదు… Strait of Hormuzకు సంబంధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును నిర్ణయించబోయే ఆ సంచలన గణాంకాలేంటో కూడా స్పష్టంగా విశ్లేషిద్దాం! మన కథ ఒక మిస్టరీ రష్యన్ ఫ్లైట్‌తో మొదలవుతుంది! కానీ… ఇది ముగిసేది మాత్రం ఒకే ఒక్క ఇరుకైన సముద్ర మార్గం దగ్గర! కేవలం 21 మైళ్ల వెడల్పు ఉన్న ఆ డేంజర్ జోన్ దగ్గర! ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్‌పవర్ సైన్యాన్ని సైతం శాసించగల జలసంధి అది! ఎందుకంటే… ఇరాన్ ఆకాశంపై మాదే అల్టిమేట్ ఆధిపత్యం! అని అమెరికా జెండా పాతొచ్చు… ఇరాన్ నావికాదళాన్ని, వాళ్ల మిలిటరీ బేస్‌లను, టాప్ లీడర్ల టార్గెట్‌లను చిత్తు చేశాం! అని ప్రగల్భాలు పలుకవచ్చు… కానీ ఇరాన్ మాత్రం… వీటన్నింటినీ మించిన ఒక మాస్టర్ కార్డ్‌ను తన పిడికింట్లో బిగించింది! వాళ్లు టార్గెట్ చేసింది అమెరికా యుద్ధనౌకలను కాదు… వాళ్ల మిలిటరీ స్థావరాలను అసలే కాదు… సాక్షాత్తు గ్లోబల్ ఎకానమీనే! ఆ డెడ్లీ ప్రెజర్ పాయింట్ పేరే… స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్! కానీ, ఈ చిన్న సముద్ర మార్గం ఈ మహా సంగ్రామానికి మైండ్-బ్లోయింగ్ ఎపిసెంటర్‌గా ఎలా మారిందో క్లియర్‌గా తెలవాలంటే… మనం ముందుగా ఆ రహస్య రష్యన్ విమానం మిస్టరీని ఛేదించాలి! ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న ఆ డూమ్స్‌డే సీక్రెట్ ఏంటో చూడాలి! గ్లోబల్ ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ ‘FlightRadar24’ ఇచ్చిన షాకింగ్ డేటా ప్రకారం… RA-64531 అనే రిజిస్ట్రేషన్ కోడ్‌తో… రష్యాకు చెందిన TU-214PU రాకెట్ వేగంతో మాస్కో నుంచి టేకాఫ్ అయి… టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సైలెంట్‌గా ల్యాండ్ అయింది! ఇది మామూలు విమానం అనుకుంటే పొరపాటే! TU-214PU అనేది రష్యా సైన్యానికే అత్యంత వ్యూహాత్మకమైన ‘ఎయిర్‌బోర్న్ కమాండ్ సెంటర్’! గాల్లో ప్రయాణిస్తూనే ప్రపంచాన్ని శాసించగల ఒక ఎన్‌క్రిప్టెడ్ మిలిటరీ నెట్‌వర్క్!

ఒకవేళ భూగోళంపై థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయినా, లేదా దేశంపై అటాక్ జరిగినా… రష్యా అధ్యక్షుడు, సైనికాధిపతులు గాల్లో నుంచే సైనిక బలగాలను నేరుగా ఆపరేట్ చేసే అల్టిమేట్ అడ్వాన్స్‌డ్ సెటప్ ఇది! అందుకే ప్రపంచం దీనికి పెట్టిన భయంకరమైన పేరు… ‌Doomsday Plane! మరి అలాంటి డేంజరస్ ప్లేన్… ఉన్నపళంగా టెహ్రాన్‌లో వాలిపోవడం వెనుక ఉన్న అసలు మాస్టర్‌ప్లాన్ ఏంటి? ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలను వెంటాడుతున్న అసలైన క్వశ్చన్! ఇరాన్‌పై ఊహించని రీతిలో ఏదైనా బిగ్ అటాక్ జరిగితే… దాన్ని కౌంటర్ చేయడానికి రష్యా ఏమైనా సీక్రెట్ వార్ ప్లాన్స్ రెడీ చేస్తోందా? లేక ఒకవేళ ఫుల్-స్కేల్ వార్ మొదలైతే… ఇరాన్ కమాండ్ సిస్టమ్‌ను మాస్కోనే స్వయంగా గాల్లో నుంచి టేకోవర్ చేయబోతోందా? ఒకవేళ ఇదే నిజమైతే… రష్యా కేవలం ఇరాన్‌కు ఆయుధాలిచ్చే ఫ్రెండ్ మాత్రమే కాదు… ఇరాన్ టాప్ లీడర్‌షిప్‌కే షీల్డ్‌లా నిలబడటానికి నేరుగా ఫీల్డ్‌లోకి దిగినట్టే లెక్క! ఒకవేళ ఈ సీన్ కనుక నడుస్తుంటే… రాబోయే రోజుల్లో ప్రపంచ పొలిటికల్ మ్యాప్‌లో ఎలాంటి ఊచకోత సీన్లు చూస్తామో ఊహించడానికే ఒళ్ళు గగుర్పొడుస్తోంది! అసలు ఈ రష్యన్ విమానం ల్యాండింగ్ ఇంతటి అంతర్జాతీయ సంచలనానికి ఎందుకు దారితీసిందో అర్థం కావాలంటే… మనం కొద్ది నెలలు వెనక్కి వెళ్లాలి! 2025లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ కలసి ఒక చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. అదే… ‌Russia-Iran Comprehensive Strategic Partnership Treaty! ఇది కేవలం ఒక సాధారణ దౌత్యపరమైన ఒప్పందం కాదు.

Also Read : బలూచిస్తాన్ విలీనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ, ప్రస్తుత పరిణామాలు

ఇది ప్రపంచానికి పంపిన ఒక శక్తివంతమైన వ్యూహాత్మక హెచ్చరిక! ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలలో ఒకటి… ఈ ప్రాంతంలో ‘మూడో శక్తి’ ప్రమేయాన్ని కలసికట్టుగా అడ్డుకోవడం! ఇక్కడ ‘మూడో శక్తి’ అని అధికారులు అన్నప్పుడు… వారి Target ఎవరనేది లోకమంతా తెలిసిన విషయం. సాక్షాత్తు… యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా! ఇప్పుడు ఒక్కసారి వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనించండి… ఇరాన్, అమెరికాల మధ్య ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ ఉన్నట్టుండి ఫెయిల్ అయింది! సైనిక దాడులు మళ్లీ ముమ్మరమయ్యాయి! హోర్మూజ్‌ జలసంధి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది! ఇరాన్ అగ్రనాయకత్వం ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది! సరిగ్గా ఇలాంటి పీక్‌ టైమ్‌లోనే… రష్యాకు చెందిన ఆ అత్యంత రహస్య, గగనతల కమాండ్ విమానం టెహ్రాన్ గడ్డపై ల్యాండ్ అయింది! దాంతో సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించే ప్రశ్నలు మొదలయ్యాయి.

ఒకవేళ ఈ యుద్ధం మరింత విస్తరిస్తే… ఇరాన్‌కు రష్యా నేరుగా గ్రౌండ్‌ లెవల్‌ నుంచి సైనిక సహకారాన్ని అందించబోతోందా? యుద్ధంలోకి నేరుగా దిగకుండానే… మాస్కో వెనకుండి ఇరాన్‌ను బలోపేతం చేయబోతోందా? యూక్రైన్‌ యుద్ధంలో అమెరికా తనను ఎలాగైతే ఇరికించాలని చూసిందో… అదే పద్ధతిలో డోనాల్డ్ ట్రంప్‌ను ఈ తీవ్రమైన యుద్దంలోకి లాగేందుకు వ్లాదిమిర్ పుతిన్ చక్రం తిప్పుతున్నారా? ఇవి ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్నలే! కానీ… ఈ ఫేజ్‌లో… వీటికి ఖచ్చితమైన సమాధానాలు లేవు. ఆ రష్యన్ విమానం రాక, ఒక డేంజర్‌ బెల్‌ మాత్రమే! అంతేకానీ, ఒక మిలిటరీ కూటమి నేరుగా యుద్ధరంగంలోకి అడుగుపెట్టినట్టు దానికి బలమైన ఆధారాలు లేవు! ఈ తేడాను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే… ఊహాగానాలను ఎప్పటికీ ప్రూవ్డ్‌ ఎవిడెన్స్‌గా భావించలేం! ఇక ఇక్కడ మరొక అత్యంత ఆసక్తికరమైన పరిణామం ఉంది! ఆ విమానం టెహ్రాన్‌లో దిగిందన్న వార్తలు బయటకు వచ్చిన వెంటనే… డోనాల్డ్ ట్రంప్ ఒక మీడియా ఇంటర్వ్యూలో సంచలన ప్రకటన చేశారు! హార్ముజ్ జలసంధిపై పూర్తి కంట్రోల్‌ అమెరికానే నిర్వహిస్తుందని ట్రంప్‌ తేల్చి చెప్పారు! ఆ సముద్ర మార్గం గుండా షిప్పుల రాకపోకలను వాషింగ్టనే చూసుకుంటుందని చెప్పారు. ఏ ఓడలు వెళ్లాలో, ఏవి వెళ్లకూడదో తామే నిర్ణయిస్తామని ఖరాకండీగా చెప్పేశారు. ఆఖరికి ఆ మార్గం గుండా వెళ్లే నౌకల నుంచి పన్నులు కూడా వసూలు చేస్తామని ప్రకటించారు! వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య Tensions మళ్లీ పతాక స్థాయికి చేరిన సమయంలోనే ట్రంప్ నుంచి ఈ సంచలన వ్యాఖ్యలు వచ్చాయి!

ఒకవైపు అమెరికా-ఇరాన్‌లు పరస్పరం మిస్సైల్‌ అటాక్స్‌ చేసుకుంటున్నాయి. మరోవైపు హార్ముజ్ జలసంధికి సంబంధించిన చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. తమ టాప్ కమాండర్లపై దాడులు జరిగాక… ఇరాన్ నాయకత్వం ప్రతీకారం తీర్చుకుంటామని బహిరంగంగా ప్రకటించింది. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్‌లో… రష్యాకు చెందిన అత్యంత సీక్రెట్‌ కమాండ్ విమానం టెహ్రాన్‌లో దిగడం ప్రపంచ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది! ఒకవేళ పెద్ద ఎత్తున సైనిక ఘర్షణే వస్తే… ఇరాన్‌కు సహాయం చేయడానికి రష్యా ముందస్తుగా పావులు కదుపుతోందా? రష్యన్ దళాలను నేరుగా పంపకుండానే… అమెరికాను మరో దీర్ఘకాల ప్రాంతీయ యుద్ధంలోకి నెట్టడం ద్వారా ఇరాన్‌ను బలోపేతం చేయడమే పుతిన్ మాస్టర్ ప్లానా? ఇక్కడ మరొక కీలకమైన Geopolitical కోణాన్ని మనం అస్సలు విస్మరించలేం! గడిచిన కొన్ని నెలలుగా… యూక్రైన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి ట్రంప్‌ బాగా దగ్గరవుతూ వస్తున్నారు. దానికి జవాబుగా… తమకు కూడా ప్రపంచంలో ఇతర చోట్ల బలమైన వ్యూహాత్మక స్నేహాలు ఉన్నాయని రష్యా ఈ రూపంలో హెచ్చరిస్తోందా? వాషింగ్టన్ చర్యలకు మాస్కో చేస్తోన్న సవాల్ ఇదేనా? లేక మిడిలా‌ ఈస్ట్‌లో  ఏ చిన్న నిర్ణయమైనా సరే… కేవలం వాషింగ్టన్, టెల్ అవీవ్‌లు మాత్రమే తీసుకోలేవని రష్యా పంపిన బలమైన సందేశమా? ప్రస్తుతానికి… ఈ ప్రశ్నలకు ఎవరూ ఖచ్చితమైన సమాధానం చెప్పలేరు!

కానీ… ఈ కథనానికి మరో కోణం కూడా ఉంది! ఇప్పటివరకు ప్రపంచ దృష్టి పెద్దగా పడని ఒక కీలకమైన కోణం! అదేంటో తెలుసా… ఉక్రెయిన్! కొద్ది నెలల కిందట… ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ సహా పలు గల్ఫ్ దేశాల్లో పర్యటించారు. కానీ… ఇవి కేవలం Diplomatic Visits మాత్రమే కావు! ఉక్రెయిన్ ఒక వ్యూహాత్మక ఆఫర్‌ను ఈ దేశాల ముందు ఉంచింది! యుద్ధరంగంలో డ్రోన్లను ఎదుర్కోవడంలో తమ అనుభవాన్ని ఆయా దేశాలకు అందించడానికి యూక్రైన్‌ ముందుకొచ్చింది. ఇంటర్‌సెప్టర్ డ్రోన్ టెక్నాలజీని ప్రతిపాదించింది. ఉమ్మడి రక్షణ ఉత్పత్తిని ఆఫర్ చేసింది. ఇప్పటికే దీనిపై పలు కీలక ఒప్పందాలపై సంతకాలు కూడా పూర్తయినట్లు సమాచారం! అంతేకాదు… వందలాది మంది యూక్రైన్‌ డిఫెన్స్ టెక్నీషియన్ ఎక్స్‌పర్ట్స్‌ ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో ల్యాండ్ అయ్యారు! దానికి ప్రతిఫలంగా… యూక్రైన్‌ అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను… ఇంధన రంగానికి సంబంధించిన సహకారాన్ని… Huge Financial Supportను కోరింది!

Also Read : పర్షియన్‌ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు: చిక్కుకున్న భారత నౌకలు

ఇప్పుడు ఈ మొత్తం pictureను ఒకసారి స్పష్టంగా గమనించండి… రష్యా..ఇరాన్‌కు దగ్గరవుతుంటే… ఇరాన్‌ను చూసి భయపడుతున్న గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ చేరువవుతోంది! ఒకవైపు రష్యా ఒక వర్గాన్ని బలోపేతం చేస్తుంటే… మరోవైపు ఉక్రెయిన్ ఇంకో వర్గానికి కొండంత ధైర్యాన్ని అందిస్తోంది! ఇది ఈ ప్రపంచ యుద్ధ వాతావరణాన్ని మరింత గందరగోళంగా… అత్యంత ప్రమాదకరంగా మార్చేస్తోంది! ఇటు రష్యా చేస్తోన్న యుద్ధం కానీ… అటు యూక్రైన్‌ పోరాడుతోన్న యుద్ధం కానీ… ఇంకా ముగియలేదు! అయినప్పటికీ… ఈ రెండు దేశాలు ఇప్పుడు పూర్తిగా వేరొక భౌగోళిక రాజకీయ రణరంగంలో కీ రోల్‌ పోషిస్తున్నాయి! చాలా కోణాల్లో చూస్తే… మిడిల్ ఈస్ట్‌ అనేది ఇప్పుడు కేవలం War Zone మాత్రమే కాదు. అది ఒక వ్యాపార కేంద్రంగా… ఒక యుద్ధానికి అవసరమయ్యే మిస్సైల్‌ మార్కెట్‌గా మారుతోంది! మిలిటరీ టెక్నాలజీ… డ్రోన్ వార్‌ఫేర్… మిసైల్ డిఫెన్స్… ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్… ఇలా ప్రతీదీ War Hardware Marketకు ఒక అంతర్జాతీయ వేదికగా మిడిల్‌ ఈస్ట్‌ మారిపోయింది! ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో కూడా మనం సరిగ్గా ఇలాంటి సీన్‌నే చూశాం! ఆధునిక యుగంలో యుద్ధాలు అనేది కేవలం శత్రువును ఓడించడానికి మాత్రమే జరగడం లేదు! అవి తమ సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఎగ్జిబిషన్‌లుగా మారిపోయాయి! ప్రతీ యుద్ధభూమి ఇప్పుడు ఒక కార్పొరేట్ షోరూమ్‌లా మారుతోంది! ప్రతీ మిస్సైల్‌ ప్రయోగం… ప్రతీ డ్రోన్ దాడి… ప్రతీ ఇంటర్‌ సెప్టర్… ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి! ఎందుకంటే… నేటి యుద్ధాలే, రేపటి Defence Exhibitions! ఈ అంశంపై మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ… దాని గురించి మరో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం…

ప్రస్తుతానికి… గడిచిన 24 గంటల్లో జరిగిన పరిణామాల్లోకి మళ్లీ వద్దాం! ఎందుకంటే… ఈ యుద్ధం ఎంతటి  ప్రమాదకరమైన సిచ్యువేషన్‌లోకి అడుగుపెట్టిందో మనకు స్పష్టంగా తెలుస్తోంది. చర్చలు విఫలమైన మరుక్షణమే… అమెరికా ఏకంగా 140కి పైగా ఇరాన్ సైనిక లక్ష్యాలపై విరుచుకుపడింది! దాంతో ఇరాన్ కూడా వెనక్కి తగ్గలేదు… వెంటనే ప్రతిదాడికి దిగింది! బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఒమాన్‌లలో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది! అదే సమయంలో… హోర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది! అయితే డోనాల్డ్ ట్రంప్ ఆ ప్రకటనను కొట్టిపడేశాడు! హోర్మూజ్ జలసంధి ఇప్పటికీ తెరిచే ఉందంటూ ట్రంప్‌ చెప్తున్నాడు! కానీ… ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే… ఇరాన్ ఏం చెప్తోంది? అన్నది కాదు! డోనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడు అన్నది అసలే కాదు! అసలైన ప్రశ్న ఏంటంటే… వార్‌ మధ్యలో ఆ నౌకలు ఏం చేస్తున్నాయి? ఎందుకంటే… అసలైన నిజం దాగుందిక్కడే! షిప్పింగ్ డేటా ప్రకారం చూస్తే… ఆదివారం రోజున హోర్మూజ్‌ గుండా ప్రయాణించిన కార్గో షిప్స్‌ సంఖ్య కేవలం ఆరు మాత్రమే! మరి నిన్నమొన్నటి వరకు పరిస్థితి ఏంటి? రోజుకు వందకు పైగా భారీ షిప్‌లు ప్రయాణించే అత్యంత బిజీ మార్గం అది! అంటే… హోర్మూజ్‌లో ప్రస్తుతం ఓడల రాకపోకలు అంత ఈజీగా సాగడం లేదనేది ఇట్టే అర్థమవుతోంది. ఇక్కడ మరొక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది! ఈ ప్రాంతం గుండా వెళ్లేటప్పుడు పలు వ్యాపార నౌకలు తమ ‌Tracking Transpondersను స్విచ్ ఆఫ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి! దీనివల్ల ఓడల ఖచ్చితమైన లొకేషన్ గుర్తించడం అత్యంత కష్టంగా మారిపోయింది. ఇది మనకు ఒక అత్యంత కీలకమైన విషయాన్ని తెలియజేస్తోంది… కాగితాల మీద… హోర్మూజ్ జలసంధి ఇప్పటికీ తెరిచే ఉండవచ్చు! డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్టుల్లో అది తెరిచే ఉండవచ్చు! పెంటగాన్ ప్రెస్ మీట్లలో కూడా అది తెరిచే కనిపించవచ్చు! కానీ… షిప్‌ ఓనర్స్ భయపడుతుంటే… ఇన్స్యూరెన్స్ కంపెనీలు బీమా కవరేజ్ ఇవ్వడానికి వెనుకంజ వేస్తుంటే… సరుకు రవాణాదారులు తమ షిప్‌మెంట్లను నిలిపివేస్తుంటే… వాణిజ్య పరంగా చూస్తే మాత్రం… హోర్మూజ్ జలసంధి ఇప్పటికే సగానికి పైగా మూతపడినట్లే లెక్క! ఇ

ది మొత్తం గ్లోబల్‌ సిచ్యువేషన్‌నే మార్చేస్తోంది! ఒక సముద్ర మార్గాన్ని పూర్తిగా మూసేయడానికి… వెళ్లే ప్రతీ ఓడను ముంచేయాల్సిన అవసరం లేదు! కొన్నిసార్లు… ఆ దారిలోకి వెళ్లాలంటేనే భయపడేంత వాతావరణం క్రియేట్ చేస్తే చాలు! ఏ షిప్పింగ్ కంపెనీ కూడా ఆ మార్గంలో ఓడలను పంపడానికి సాహసించదు! ఇప్పుడు ఇరాన్ కూడా సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. టెహ్రాన్‌కు… ఇది కేవలం తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను తొలగించుకోవడానికి మాత్రమే చేస్తున్న పోరాటం కాదు! హోర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతీ నౌకా ఏదో ఒక రూపంలో తమ అనుమతి తీసుకోవాల్సి వస్తే.. ప్రపంచ వాణిజ్యం తమ కంట్రోల్లోకి వస్తుందని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ పార్లమెంట్ National Security కమిటీ ఛైర్మన్ ఇబ్రహీం అజీజీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు! ఆయన చెప్పేదాని ప్రకారం.. హార్ముజ్ జలసంధి తెరుచుకోవడమంటూ జరిగితే… అది కేవలం ఇరాన్ షరతుల ప్రకారమే జరుగుతుంది! అంతే తప్ప అమెరికా బెదిరింపులకు భయపడి కాదు! ఇరాన్ అగ్రనాయకత్వంలో… ఒక బలమైన నమ్మకం రోజురోజుకూ పెరుగుతోంది… అదేంటంటే, అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ అనుకున్న ప్రధాన సైనిక లక్ష్యాలను సాధించలేకపోయాయని! దానికి భిన్నంగా… ఈ యుద్ధం వల్ల గల్ఫ్ ప్రాంతంలో ఒక మహా శక్తిగా తమ ప్రాబల్యం మరింత పెరిగిందని ఇరాన్ భావిస్తోంది! ఈ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ ఒక శక్తివంతమైన రాజకీయాధిపత్యాన్ని సాధించాలని చూస్తోందని పలువురు అమెరికా Defence Experts విశ్లేషిస్తున్నారు.

తన చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలు తన ఆధిపత్యాన్ని… తన సైనిక బలాన్ని… తన వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తించాలని ఇరాన్ కోరుకుంటోంది. సరిగ్గా… పుతిన్ నాయకత్వంలోని రష్యా తన పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించడానికి ఎలా చూస్తోందో… తరచుగా అమెరికా Dominance గురించి ట్రంప్‌ ఎలా మాట్లాడతారో… ఇదీ అంతే! ఇప్పుడు మరొక కీలకమైన పరిణామం వైపు వెళ్దాం… జూలై 11న… ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఒమాన్ రాజధాని మస్కట్‌కు వెళ్లారు. అక్కడ… ఒమాన్ అధికారులతో పాటు… ఖతార్ రాయబారులు… అమెరికా పంపిన ఒక ప్రతిపాదనను ఇరాన్ ముందుంచారు! హోర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచే ఉంచుతామని… వ్యాపార నౌకలపై ఎలాంటి దాడులు చేయమని ఇరాన్ బహిరంగంగా హామీ ఇవ్వాలని వాషింగ్టన్ కోరింది. కానీ… ఆ చర్చలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి! ఎలాంటి ఒప్పందం కుదరలేదు. చర్చల ప్రక్రియ ఆగిపోయింది! వాషింగ్టన్ ఇచ్చిన గడువు ముగియడానికి ముందే… ఇరాన్ ఒక కార్గో షిప్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి! దాంతో అమెరికా మళ్లీ కొత్తగా సైనిక దాడులు చేసింది. దానికి ప్రతిగా ఇరాన్… ఖతార్, ఒమాన్‌లలో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులతో విరుచుకుపడింది! కానీ, ఈ సైనిక దాడులను దాటి కొంచెం లోతుగా ఆలోచిస్తే… ఇరాన్ అసలు మాస్టర్ ప్లాన్ ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతుంది! ఇరాన్ కేవలం నౌకల రాకపోకలను పర్యవేక్షించడమే పనిగా పెట్టుకోలేదు! హోర్మూజ్‌ జలసంధిలోకి అడుగుపెట్టే ప్రతీ Ship కెప్టెన్‌కు ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తు చేయాలనుకుంటోంది… హోర్మూజ్‌ మార్గానికి అసలైన తాళంచెవి టెహ్రాన్ చేతుల్లోనే ఉందని ! ఆ తాళం ఎప్పుడు తెరవాలో, ఎప్పుడు మూయాలో నిర్ణయించే అధికారం కేవలం తమకే ఉందనే విషయాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటోంది! ఈ లక్ష్యాన్ని సాధించడానికి… ఆ సముద్ర మార్గం చట్టబద్ధంగా ఇరాన్ సొంతం కానక్కర్లేదు! తమ అనుమతి లేకుండా… ఆ దారిలో ప్రయాణం అస్సలు సురక్షితం కాదనే భయాన్ని ప్రపంచంలో నింపితే చాలు!

దీన్ని ఒక చిన్న పాయింట్‌తో అర్థం చేసుకుందాం… ఒక రహదారి చట్టబద్ధంగా ప్రభుత్వానిదే కావచ్చు! కానీ ఒక తుపాకీ పట్టుకున్న ముఠా ఆ రోడ్డు మధ్యలో నిలబడి… వెళ్లే ప్రతీ వాహనాన్ని ఆపి… అందరినీ తనిఖీ చేస్తూ… డబ్బులు వసూలు చేస్తోందనుకోండి! అప్పుడు కాగితాల మీద రోడ్డు ఎవరిదైనా… నిజమైన ఆధిపత్యం మాత్రం ఆ తుపాకీ పట్టుకున్న వాడిదే అవుతుంది! ఇప్పుడు హోర్మూజ్ జలసంధి విషయంలో కూడా… ఇరాన్ సాధించాలనుకుంటున్న వ్యూహాత్మక ఆధిపత్యం సరిగ్గా ఇలాంటిదే! ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ ఒక బాంబ్ పేల్చారు! ఈ హోర్మూజ్ జలసంధి అనేది ఇకపై కేవలం ఇరాన్ అనుకున్నట్టు మాత్రమే పనిచేస్తుందని గాలిబాఫ్‌ తెగేసి చెప్పారు! ఈ హోర్మూజ్ తాళంచెవిని తన చేతుల్లో ఉంచుకోవడం ద్వారా… గల్ఫ్ లోని ప్రతీ దేశానికి ఇరాన్‌ ఒక పవర్‌ఫుల్ మెసేజ్ పంపుతోంది!

అదేంటంటే… ఈ ప్రాంతంలో ఇకపై అతిపెద్ద శక్తి అమెరికా కాదు! కేవలం ఇరాన్ మాత్రమే! బహుశా గాలిబాఫ్‌ పంపిన ఘాటైన హెచ్చరిక మాత్రం సౌదీ అరేబియాకే తగిలింది! ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియలకు సౌదీ ప్రతినిధి బృందం హాజరైనప్పుడే ఆ విషయం స్పష్టంగా అర్థమైంది. ఆ నివాళుల సమయంలో… ఖురాన్‌లోని సూరా ఆల్-ఇమ్రాన్ 13వ వచనాన్ని చదివారు. ఆ వచనం బద్ర్ యుద్ధం గురించి చెప్తుంది… ఒకవైపు దేవుడి పేరు మీద పోరాడిన వాళ్లు ఉంటే… మరొకవైపు వారికి వ్యతిరేకంగా నిలబడిన వాళ్లు ఉన్నారు! ఆ సంకేతం వెనుక ఉన్న అర్థం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది! ఒకవేళ ఇరాన్‌పై మిలిటరీ దాడుల సమయంలో సౌదీ అరేబియా కనుక అమెరికా పక్కన నిలబడితే… టెహ్రాన్ దానిని కేవలం ఒక పొలిటికల్‌ ఇష్యూగా చూడదు! దాన్ని ఒక ఐడియాలిజికల్‌ డిఫరెన్సెస్‌గా చూస్తుంది! అది మొత్తం మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంత రాజకీయ రూపురేఖలనే మార్చేస్తుంది! కానీ ఇరాన్ ఆలోచనలు అంతటితో ఆగిపోలేదు. రాబోయే రోజుల్లో మొత్తం గల్ఫ్ ప్రాంతానికి తనే సెక్యూరిటీ మేనేజర్‌గా మారాలని టెహ్రాన్ భావిస్తోంది! గల్ఫ్‌ రక్షణనే కాకుండా… వ్యాపారం, సముద్ర మార్గాల్లో ప్రయాణాలకు సంబంధించి కొత్త రూల్స్ శాసించే డిక్టేటర్‌గా మారాలని చూస్తోంది!

వాషింగ్టన్ కాదు! వేరే ఎవరూ కాదు! ఎందుకంటే ఇరాన్‌లోని చాలామంది దృష్టిలో… తమ దేశం ఈ యుద్ధంలో కేవలం తట్టుకుని నిలబడటమే కాదు! పూర్తిగా గెలిచింది! ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే… ఇజ్రాయెల్‌ పౌరులు చాలామంది కూడా ఈ యుద్ధంలో అతిపెద్ద వ్యూహాత్మక విజేత అమెరికా కాదని… ఇజ్రాయెల్ అంతకంటే కాదని… కేవలం ఇరాన్ మాత్రమేనని నమ్ముతున్నారు! ఒక్కసారి అసలు ఈ యుద్ధం ఏ లక్ష్యాలతో మొదలైందో ఆలోచించండి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పాలక వ్యవస్థను పూర్తిగా పడగొట్టాలని అనుకున్నారు. కానీ అది జరగనే లేదు! ఒక నాయకత్వంపై దాడి జరగ్గానే… వెంటనే ఇంకొకరు ఆ స్థానంలోకి వచ్చేశారు. ఇరాన్ మిసైల్ బలం ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. దానికి తోడుగా ఉన్న ప్రాక్సీ గ్రూప్స్‌ కూడా పూర్తిగా నాశనం కాలేదు. అన్నిటికంటే ముఖ్యంగా… ఈ హోర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా దారిలోకి తెచ్చుకోవచ్చో ఇరాన్ ఒక కొత్త దారిని కనుక్కుంది! ఇరాన్ ఈ యుద్ధం కోసం ప్లాన్ చేసుకున్న విధానం కూడా చాలా వేరుగా ఉంది. తన సైనిక కమాండ్ నెట్‌వర్క్‌ను వేర్వేరు స్థాయిల్లోకి విభజించి, పక్కాగా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంది! ఎవరి తర్వాత ఎవరు నాయకత్వం వహించాలో ఒక స్పష్టమైన లైన్ తయారు చేసుకుంది. ఒకేసారి తన దగ్గరున్న మిస్సైల్స్‌ అన్నీ ప్రయోగించకుండా… వారం వారం కొద్దికొద్దిగా దాడులు చేస్తూ వచ్చింది. దీనివల్ల వచ్చిన ఫలితం చాలా పెద్దది! తమ టాప్ కమాండర్లు చనిపోయినప్పటికీ… ఆదేశాలు ఇచ్చే మెయిన్ సిస్టమ్ మాత్రం ఆగకుండా పనిచేస్తూనే వచ్చింది! ఆ వ్యవస్థ కూలిపోలేదు! దానివల్ల ప్రపంచంపై ఆర్థిక ఒత్తిడిని చాలా ఎక్కువ కాలం కొనసాగించడం ఇరాన్‌కు సాధ్యమైంది!

కానీ అమెరికా వేసిన అంచనాలు పూర్తిగా వేరు! వాషింగ్టన్ Short Sightedగా ఆలోచించింది… ఒకే దెబ్బతో యుద్ధాన్ని ముగించేద్దామని అనుకుంది! భారీ సైనిక దాడులు చేస్తే ఇరాన్ నాయకత్వం కూలిపోతుందని… తమ కండీషన్లకు  లొంగిపోతుందని యూఎస్‌ అనుకుంది. కానీ అది ఏ మాత్రం జరగలేదు! ఆ ప్లాన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో… అమెరికా ఒక పెద్ద చిక్కుల్లో పడిపోయింది! దాడి చేయడానికి అమెరికా దగ్గర సైనిక లక్ష్యాలైతే చాలా ఉన్నాయి… కానీ ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలో స్పష్టమైన దారి మాత్రం లేదు! సైనిక బలానికి… వ్యూహాత్మక పట్టుకు మధ్య ఉన్న తేడా ఏంటో సరిగ్గా ఇక్కడే బయటపడింది! అమెరికా దగ్గర భారీ యుద్ధ విమానాలు ఉన్నాయి… బాంబర్లు ఉన్నాయి… మిసైళ్లు ఉన్నాయి… అంతులేని భారీ సైనిక బలం ఉంది! కానీ ఇరాన్ దగ్గర ఉన్నది ఒకే ఒక్క ఇరుకైన సముద్ర మార్గం! అయినప్పటికీ… ఆ ఇరుకైన సముద్ర మార్గమే వందలాది క్షిపణులు కూడా ఇవ్వలేనంత తీవ్రమైన ఒత్తిడిని ప్రపంచంపై నెట్టింది!

ఇది వింటుంటే, నార్మల్‌గానే మన మనస్సులో ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది… అసలు ఈ హోర్మూజ్ జలసంధిపై నిజమైన ఆధిపత్యం ఎవరిది అని.. హోర్మూజ్ జలసంధి… అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం ఇది. దీని వెడల్పు దాదాపు 21 మైళ్ళు! దీనికి ఉత్తరం వైపున ఇరాన్ ఉంటే… దక్షిణం వైపున ఒమాన్ ఉంది! అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం… సముద్ర తీరం ఉన్న ప్రతీ దేశానికి, తమ తీరం నుంచి 12 నాటికల్ మైళ్ళ వరకు… అంటే దాదాపు 22 కిలోమీటర్ల వరకు ఉన్న జలాలపై పూర్తి అధికారాలు ఉంటాయి! దీనర్ధం ఏంటంటే… ఈ జలసంధిలో చాలా పెద్ద భాగం ఇరాన్, ఒమాన్  సముద్ర సరిహద్దు పరిధిలోకి వస్తుంది! కానీ అంతమాత్రాన… ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ సముద్ర మార్గాన్ని తమకు తోచినప్పుడు ఆపేసే హక్కు ఇరాన్‌, ఒమాన్‌కు లేదు! ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందంలోని ఆర్టికల్ 38 ప్రకారం… ప్రపంచ వాణిజ్యానికి ఉపయోగపడే అంతర్జాతీయ జలసంధుల గుండా ప్రయాణించే ప్రతీ నౌకకూ Right of Transit Passage ఉంటుంది!

ఆర్టికల్ 44 ఇంకాస్త ముందుకు వెళ్లి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తోంది… తీర ప్రాంత దేశాలేవీ నౌకల ప్రయాణ హక్కును రద్దు చేయడంగానీ, అడ్డుకోవడంగానీ చేయకూడదు! ఇరాన్, ఒమాన్ దేశాలు భద్రతా నియమాలను రూపొందించుకోవచ్చు! అంతర్జాతీయ సముద్ర సంస్థ IMOతో కలసి నౌకలు వెళ్ళే మార్గాలను నిర్ధారించవచ్చు! ప్రయాణ నిబంధనలను… పర్యావరణ ప్రమాణాలను… సముద్ర భద్రతా పద్ధతులను అమలు చేయవచ్చు! కానీ… కేవలం రాజకీయ విభేదాల కారణంతో నౌకల రాకపోకలను అడ్డుకునేలా కొత్త నిబంధనలు సృష్టించలేవు! అంతేకాదు… ఏదైనా ప్రత్యేక సేవలు అందిస్తే తప్ప, కేవలం ఆ దారి గుండా వెళ్తున్నందుకు నౌకలపై పన్నులు వసూలు చేయలేవు! అందుకే… హోర్మూజ్ జలసంధి గుండా వెళ్ళే నౌకల రాకపోకలను నియంత్రించే ఆఖరి అధికారం తమదేనన్న ఇరాన్ వాదనను అంగీకరించవద్దని International Maritime Organization తన సభ్య దేశాలను కోరింది! ఒక్క మాటలో చెప్పాలంటే… చట్టం చెప్తున్నది ఇదే ! సముద్రం మీది కావచ్చు… కానీ ప్రపంచం వెళ్లే దారి మాత్రం మీది కాదు! అయితే… ఈ అంతర్జాతీయ చట్టాలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి! చట్టం ఒక నౌకకు కాగితాల మీద హక్కులు ఇవ్వగలదు… కానీ ఆ నౌకకు పూర్తి భద్రతను ఇవ్వలేదు! క్షిపణులు దూసుకొస్తుంటే… పైన డ్రోన్లు చక్కర్లు కొడుతుంటే… సముద్రంలోని మైన్స్ షిప్‌లు వెళ్లే రూట్స్‌కు ముప్పుగా మారితే… ఏ ఓడ కెప్టెన్ కూడా కేవలం కాగితాల మీద ఉన్న చట్టాలను నమ్ముకుని ప్రయాణం చేయడు!

సరిగ్గా రెండు రోజుల కిందట సైప్రస్ జెండాతో వెళ్తున్న ఒక వ్యాపార నౌకపై ఈ ప్రాంతంలోనే దాడి జరిగినప్పుడు ఏమైందో మనమంతా చూశాం! అంతర్జాతీయ చట్టాలు ఎలా ఉన్నప్పటికీ… అంతకుముందు అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల తనకు పెద్ద వ్యూహాత్మక ప్రయోజనం దక్కిందని ఇరాన్ నమ్ముతోంది! దీని గురించి ముందు వీడియోలో మనం వివరంగా మాట్లాడుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే… ఖచ్చితంగా చూడండి! ఆ ఒప్పందంలోని ఒక ప్రత్యేకమైన నిబంధన…  ఈ దారి గుండా వెళ్లే నౌకల భద్రతా బాధ్యతను ఇరాన్ చూసుకుంటుందని చెప్తోంది! టెహ్రాన్ చెబుతున్నదాని ప్రకారం… ఆ ఒక్క నిబంధన వల్ల హోర్మూజ్ నిర్వహణ నియంత్రణ దాదాపుగా ఇరాన్ చేతుల్లోకి వచ్చేసింది! ఇరాన్ వ్యూహాత్మక ఆలోచనల్లో… ఇప్పుడు హోర్మూజ్ జలసంధి అనేది తమ అణు కార్యక్రమం కంటే అత్యంత విలువైనదిగా మారిపోయింది! ఇది అస్సలు అతిశయోక్తి కాదు! ఇరాన్ సుప్రీం లీడర్ ముఖ్య సలహాదారుల్లో ఒకరైన మొహసేన్ రెజాయ్ ఇటీవల ఒక మాట అన్నారు… వ్యూహాత్మకంగా చూస్తే… హోర్మూజ్ జలసంధి విలువ పదుల సంఖ్యలో ఉన్న అణు బాంబుల కంటే చాలా ఎక్కువ అని! ఇది నిజంగా ఒక సంచలన ప్రకటన! ఎందుకంటే దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా ఈ విజయం తమకు ఎంతో పెద్దదని ఇరాన్ ఎలా అయితే భావిస్తుందో ఇది స్పష్టంగా చెప్తోంది! అంతేకాదు… ఇప్పుడు దక్కించుకున్న ఈ పట్టును ఏ మూల్యం చెల్లించైనా సరే కాపాడుకోవాలని టెహ్రాన్ ఎందుకు పట్టుదలతో ఉందో కూడా దీని ద్వారా అర్థమవుతోంది!

అదే సమయంలో… ఇరాన్ ప్లాన్ కేవలం ఒక పూర్తిస్థాయి యుద్ధాన్ని తీసుకురావడం మాత్రమే కాదు! ఇరాన్‌ వ్యూహం చాలా తెలివైనది… పక్కా లెక్కలతో కూడుకున్నది! గ్లోబల్ మార్కెట్లు భయంతో వణికిపోయేంత ఒత్తిడిని మాత్రమే సృష్టించాలనుకుంటోంది! అలా అని… అమెరికా నేరుగా సైన్యాన్ని దించి పూర్తిస్థాయి దాడికి దిగేంత ఛాన్స్ మాత్రం ఇవ్వడం లేదు! సరుకు రవాణాను దెబ్బతీసి… చమురు ధరలు ఆకాశాన్ని తాకేలా చేయాలనుకుంటోంది! అలా అని అన్ని ఓడలనూ ఆపేయకుండా కొన్నిటిని పోనిస్తోంది… ఎందుకంటే జలసంధిని తాము పూర్తిగా మూసేయలేదని ప్రపంచానికి చెప్పుకోవడానికి! చర్చలకు రాక తప్పని వాతావరణాన్ని సృష్టించాలనుకుంటోంది… కానీ తమ చేతిలో ఉన్న వ్యూహాత్మక పట్టు చేజారిపోనంత వరకు మాత్రమే! సరిగ్గా ఇక్కడే అమెరికాకు ఒక అతిపెద్ద డౌట్‌ మొదలవుతుంది! వాషింగ్టన్ లక్ష్యాలు చాలా పెద్దవి! కానీ వాటిని సాధించడానికి చెల్లించాల్సిన అసలైన మూల్యాన్ని ఇచ్చేందుకు అమెరికా సిద్ధంగా లేదు! తన సొంత దళాలను నేరుగా రంగంలోకి దించకుండానే… ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరచాలని అనుకుంటోంది! ప్రతీ వ్యాపార నౌకకూ రక్షణగా నిలిచే భారీ ఖర్చును మోయకుండానే… హోర్మూజ్ మార్గం సురక్షితంగా ఉండాలని ఆశిస్తోంది! మరో సుదీర్ఘమైన యుద్ధంలో ఇరుక్కుపోకుండానే… ఇరాన్ క్షిపణి బలాన్ని తుడిచిపెట్టాలని చూస్తోంది! అంటే ఒక్క మాటలో చెప్పాలంటే… అమెరికా ఆశయాలు కొండంత! దానికోసం పెట్టే పెట్టుబడి మాత్రం చాలా చిన్నది! అందుకే ఈ వివాదం ఇప్పుడు ఎటూ తేలకుండా పోయింది…

ఒకవైపు కాల్పుల విరమణ… మరోవైపు మహా యుద్ధం! ఒకవైపు దౌత్య చర్చలు… ఇంకోవైపు మితిమీరిన దాడులు! ఇదొక ప్రమాదకరమైన సుడిగుండంగా మారిపోయింది… ఇందులోంచి బయటపడలేక ప్రపంచం మొత్తం నలిగిపోతోంది. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ విశ్లేషణ ప్రకారం… హోర్మూజ్ జలసంధిలో ఇలాంటి గందరగోళం ఊహించని పరిణామం కాదు! కొన్ని దశాబ్దాలుగా… అమెరికా నిఘా సంస్థలు, మిలిటరీ ప్లానర్లు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు… ఒకవేళ ఇరాన్‌తో యుద్ధమే వస్తే… టెహ్రాన్ ఇచ్చే అత్యంత శక్తివంతమైన కౌంటర్ హోర్మూజ్ జలసంధిని మూసేయడమేనని! అన్ని హెచ్చరికలు ముందునుంచీ చేస్తున్నా… వైట్ హౌస్ మాత్రం ఈ పరిస్థితులను అంచనా వేయడంలో పూర్తిగా ఫెయిల్‌ అయింది! ఈరోజు హోర్మూజ్ తెచ్చే ముప్పు కేవలం పెట్రోల్ ధరలతోనే ఆగిపోదు! ఈ మార్గం గుండా కేవలం ముడి చమురు, గ్యాస్ మాత్రమే కాదు… భారీ ఎత్తున ఎరువులు… రసాయనాలు… పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులు… ఇతర నిత్యావసరాలు సరఫరా అవుతుంటాయి! ఎరువుల ధరలు పెరిగినప్పుడు… ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పేద రైతు… తన పంటలకు తక్కువ ఎరువులు వేస్తాడు. దానివల్ల దిగుబడి తగ్గిపోతుంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న దేశాలు… మరింత ఘోరమైన సంక్షోభంలోకి కూరుకుపోతాయి!

ది గార్డియన్ పత్రిక కథనం ప్రకారం… ఈ యుద్ధం కారణంగా… వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈ ఏడాది దాదాపు 15 లక్షల మందికి ఆహారాన్ని అందించలేకపోతోంది! సోమాలియాలో దాదాపు 25 లక్షల మంది… అఫ్గానిస్తాన్‌లో 23 లక్షల మంది… ఒక్క పూట తిండి కోసం, తీవ్రంగా పోరాడాల్సిన దుస్థితి వస్తుందని అంచనా వేస్తున్నారు! గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వలస కూలీల ఆదాయం కూడా పడిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల… వారి స్వదేశాలకు పంపే డబ్బు తగ్గిపోతుంది… అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల విదేశీ మార్పిడి నిల్వలు పడిపోతాయి! చివరగా… అన్నిటికంటే పెద్ద ప్రశ్న! ఈ యుద్ధంలో అత్యంత దారుణంగా ఓడిపోతోంది ఎవరు? F-35 లాంటి అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు ఉన్న దేశమా? హోర్మూజ్ జలసంధిని తన గుప్పెట్లో ఉంచుకున్న దేశమా? లేక తన ‘డూమ్స్‌డే’ విమానాన్ని టెహ్రాన్‌లో దించిన దేశమా? కానే కాదు! ఈ యుద్ధంలో పెద్ద బాధితుడు… వీటిలో ఏ ఒక్కటీ లేని ఒక సామాన్యుడు! సోమాలియాలోని ఒక పేద కుటుంబం… అఫ్గానిస్తాన్‌లోని ఒక చిన్నారి… గల్ఫ్‌లోని సరుకు రవాణా ఓడలో చిక్కుకున్న ఒక వలస కూలీ! తమకు ఏమాత్రం సంబంధం లేని ఒక జియోపొలిటికల్‌ ప్లేలో … వీళ్లే అత్యంత భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారు! ఇదీ… ఈ Long Lasting War వెనుక ఉన్న అసలైన వాస్తవం! బాధాకరం ఏంటంటే… యుద్ధం వల్ల సర్వస్వం కోల్పోతున్నది మాత్రం… పూటగడవని అమాయకులు మాత్రమే!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.