ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనను దోషిగా తేల్చిన న్యాయస్థానం, ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షల భారీ జరిమానా విధిస్తూ బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. అంతేకాకుండా, ఫిర్యాదుదారుడికి అయిన లీగల్ ఖర్చులను కూడా బండ్ల గణేశ్ భరించాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఆయనకు నెల రోజుల గడువు ఇచ్చింది.

అసలు కేసు ఏంటంటే?
2018లో ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు గ్రామానికి చెందిన జానకి రామయ్య వద్ద బండ్ల గణేశ్ రూ. 95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. జానకి రామయ్య మరణాంతరం, ఆ డబ్బు చెల్లింపు నిమిత్తం ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వరరావుకు తన ‘పరమేశ్వర ఆర్ట్స్’ బ్యానర్ పేరుతో గణేశ్ రూ. 95 లక్షల చెక్ ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్‌లో సరైన బ్యాలెన్స్ లేక ఆ చెక్ బౌన్స్ కావడంతో, వెంకటేశ్వరరావు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. 2024లో కింది కోర్టు విధించిన శిక్షను తాజాగా పైకోర్టు కూడా సమర్థించింది.

కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వేదికగా స్పందించారు. “భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పోలీసులపై నాకు అపారమైన గౌరవం ఉంది. మన డెమోక్రసీలో ప్రతి వ్యవస్థకు ఒక ప్రత్యేక బాధ్యత ఉంటుంది. జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయం పొందే అవకాశం రాజ్యాంగం కల్పించింది. చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే నా నమ్మకం” అని ట్వీట్ చేశారు.

బండ్ల గణేశ్‌కు ఇలాంటి లీగల్ చిక్కులు కొత్తేమీ కాదు. 2017లో ‘టెంపర్’ సినిమా రైటర్ వక్కంతం వంశీకి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ విషయంలో చెక్ బౌన్స్ కావడంతో ఎర్రమంజిల్ కోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్ష, రూ. 15.86 లక్షల ఫైన్ వేసింది. అలాగే 2019లో కడపకు చెందిన మహేశ్ వద్ద రూ. 13 కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవ్వడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య సెటిల్‌మెంట్ జరగడంతో బెయిల్‌పై బయటకు వచ్చారు.