
Balochistan : ఇటీవలి కాలంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), పాకిస్తాన్ సైన్యానికి మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బలూచిస్తాన్ ఒక పెద్ద భూభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకుని, ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ పేరుతో తనను తాను ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా, బలూచ్ దళాలు అక్కడ స్వంత జెండా, కరెన్సీ , పరిపాలనా వ్యవస్థను కూడా అమలు చేశాయని ఆ పోస్టులలో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ, అసలు గతంలో స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో ఎలా భాగమైందనే చరిత్రను తెలుసుకోవడం చాలా ఆసక్తికరం.
భారత్-పాక్ విభజన సమయంలో బలూచిస్తాన్ ప్రాంతంలో కలాత్, మక్రాన్, లాస్ బేలా, ఖారన్ అనే నాలుగు పెద్ద సంస్థానాలు (రియాసత్‌లు) ఉండేవి. వీటిలో అన్నింటికంటే కలాత్ అత్యంత పెద్దది , శక్తివంతమైనది. 1947 ఆగస్టు 11న కలాత్ పాలకుడైన ఖాన్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ కలాత్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు. అప్పటి బ్రిటిష్ అధికారులు సైతం కలాత్‌తో ఉన్న ప్రత్యేక ఒప్పందాలను గుర్తించడంతో, ఈ సంస్థానం భారతదేశం,పాకిస్తాన్ రెండింటికీ భిన్నంగా తన ఉనికిని చాటుకుంది.
Also Read : ముద్రగడకు గవర్నర్ పోస్ట్.. సంచలన విషయాలు చెప్పిన నాదెండ్ల!
అయితే, 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పాటైన తర్వాత, ఆ దేశ నాయకత్వం కలాత్‌ను తమ దేశంలో విలీనం చేయడానికి చర్చలు ప్రారంభించింది. కలాత్ పాలకుడు మొదట తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలని గట్టిగా ప్రయత్నించినప్పటికీ, భౌగోళిక, రక్షణ కారణాల రీత్యా పాకిస్తాన్‌కు కలాత్ విలీనం అత్యంత వ్యూహాత్మకమైనదని పాక్ వాదించింది. ఈ క్రమంలో కలాత్ చుట్టూ ఉన్న మక్రాన్, లాస్ బేలా, ఖారన్ సంస్థానాలను పాకిస్తాన్ మొదట తనలో విలీనం చేసుకుంది. దీంతో కలాత్ భౌగోళికంగా ఒంటరిదైపోయి, దానిపై రాజకీయ, వ్యూహాత్మక ఒత్తిడి విపరీతంగా పెరిగింది.
ఆ క్లిష్ట సమయంలో కలాత్ సంస్థానం భారతదేశ మద్దతును పొందేందుకు లేదా భారత్‌లో విలీనమయ్యేందుకు కొన్ని ప్రయత్నాలు, చర్చలు జరిపినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కానీ, భౌగోళిక దూరం, సరిహద్దు ఇబ్బందులు, నాటి రాజకీయ పరిస్థితుల కారణంగా అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ ప్రతిపాదనపై ముందుకు వెళ్ళలేదని చారిత్రక రికార్డులు పేర్కొంటున్నాయి. దీంతో భారతదేశం నుండి ఎలాంటి మద్దతు లభించక కలాత్ మరింత బలహీనపడింది.
చివరకు 1948 మార్చి నాటికి ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో పాకిస్తాన్ సైన్యం కలాత్‌లోకి ప్రవేశించింది. ఈ సైనిక ఒత్తిడి , అనివార్య పరిస్థితుల నడుమ 1948 మార్చి 27-28 తేదీల్లో కలాత్ ఖాన్ విలీన పత్రాలపై సంతకం చేయాల్సి వచ్చింది. ఆ విధంగా కలాత్ అధికారికంగా పాకిస్తాన్‌లో భాగమైంది. ఈ విలీనం చట్టబద్ధంగానే జరిగిందని పాకిస్తాన్ ఎల్లప్పుడూ వాదిస్తున్నప్పటికీ, బలూచ్ జాతీయవాద సంస్థలు మాత్రం ఇది సైనిక బలవంతంతో జరిగిన విలీనమని, దీనికి చట్టబద్ధత లేదని కొట్టిపారేస్తున్నాయి. నాటి నుండి నేటి వరకు బలూచిస్తాన్‌లో స్వతంత్ర పోరాటం మరియు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read : ‘యూనిఫాం విప్పేసి, పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయండి’ – పాక్ ఆర్మీ చీఫ్ కు మౌలానా ఫజలూర్ బహిరంగ సవాల్









