Asim Munir : పాకిస్తాన్‌లో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం ఫజల్ (JUI-F) అధినేత మౌలానా ఫజలూర్ రెహ్మాన్ ఆ దేశ సైనిక బలగాల అధిపతి (ఆర్మీ చీఫ్) జనరల్ ఆసిమ్ మునీర్‌కు నేరుగా ఘాటైన సవాల్ విసిరారు. ఆర్మీ చీఫ్ గనుక రాజకీయాలు చేయాలనుకుంటే, ముందుగా తన సైనిక యూనిఫాంను విప్పేసి, సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక బహిరంగ సభలో మాట్లాడిన రెహ్మాన్.. దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలి, ఏ ప్రభుత్వం పడిపోవాలి అనేది నిర్ణయించడం సైన్యం పని కాదని, దేశ సరిహద్దుల భద్రతను చూసుకోవడమే సైన్యం యొక్క ప్రాథమిక విధి అని తేల్చి చెప్పారు.

Also Read : సముద్రగర్భంలో అపార బంగారు నిక్షేపాలు: రాళ్లల్లో దాగున్న పసిడిని చూసి శాస్త్రవేత్తలే షాక్!

ఈ సందర్భంగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, పఖ్తూన్ఖ్వా (పష్తూన్) ప్రాంతాలలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై మౌలానా ఫజలూర్ రెహ్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాలపై పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. కేవలం గత రెండు మూడు రోజుల్లోనే ఆ ప్రాంతాల నుండి 50 కి పైగా మృతదేహాలు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలు తమ ఇళ్లలో కూడా సురక్షితంగా లేరని, పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని, కనీసం కూలీలు కూడా పనుల కోసం బయటకు రాలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలకు ఇప్పుడు తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియల కోసం కఫన్ (శవ వస్త్రం) కొనడం, వారిని పూడ్చిపెట్టడం మినహా మరో పని లేకుండా పోయిందని ఆయన దుయ్యబట్టారు.

ఇదే సమయంలో తీవ్రవాదాన్ని అణచివేయడం అనే నెపంతో సాధారణ పౌరుల చేతుల్లోకి ఆయుధాలు ఇవ్వాలని లేదా ప్రత్యేక మిలీషియాలను (సరిహద్దు సాయుధ బలగాలు) ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్లను ఆయన పూర్తిగా తిరస్కరించారు. పౌరుల చేతుల్లోకి ఆయుధాలు వస్తే భవిష్యత్తులో దేశంలో మరింత రక్తపాతం, వ్యక్తిగత ముఠా కక్షలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను దేశ జనాభా నియంత్రణ , అభివృద్ధికి సంబంధించిన ఒక కీలక పౌర కమిటీలో సభ్యునిగా పాకిస్తాన్ ప్రభుత్వం చేర్చిన నేపథ్యంలో మౌలానా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రక్షణ రంగానికే పరిమితం కావలసిన సైనిక అధిపతి, పౌర పరిపాలన విషయాల్లో జోక్యం చేసుకోవడంపై పాకిస్తాన్‌లో ఇప్పటికే తీవ్ర చర్చ నడుస్తుండగా, మౌలానా చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Also Read : అమెరికాలో మారనున్న కాలమానం: ‘డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌’ను శాశ్వతం చేస్తూ బిల్లుకు ఆమోదం!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.