
Daylight Saving Time : అమెరికా ప్రజలు దశాబ్దాలుగా పాటిస్తున్న కాలమాన మార్పుల విధానానికి త్వరలోనే తెరపడనుంది. దేశంలో ‘డేలైట్ సేవింగ్ టైమ్’ (DST) విధానాన్ని శాశ్వతం చేసే దిశగా అక్కడి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్’ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) తాజాగా ఆమోదం తెలిపింది. ఇకపై ఈ బిల్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు వెళ్లనుంది. ఆయన దీనిపై సంతకం చేయడంతోనే ఇది పూర్తిస్థాయి చట్టరూపం దాల్చి అధికారికంగా అమలులోకి రానుంది.
ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే అమెరికన్ల రోజువారీ జీవితాల్లో ఒక పెద్ద మార్పు రాబోతోంది. సాధారణంగా అమెరికాలో వేసవి కాలం రాగానే సహజమైన సూర్యకాంతిని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి గడియారాలను ఒక గంట ముందుకు జరుపుతారు (క్లాక్స్ ఫార్వర్డ్). మళ్లీ శీతాకాలం రాగానే ఆ ముళ్లను ఒక గంట వెనక్కి జరుపుతారు (క్లాక్స్ బ్యాక్). అయితే, తాజా బిల్లు ప్రకారం ఇకపై అమెరికన్లు ఏడాదికి రెండుసార్లు ఇలా తమ గడియారాలలో సమయాన్ని మార్చుకోవాల్సిన తలనొప్పి ఉండదు. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఒకే స్థిరమైన సమయం అమల్లో ఉంటుంది.
Also Read : POKలో హైటెన్షన్ : నేడు భారీ మార్చ్.. ముజఫరాబాద్‌కు లక్షలాది మంది నిరసనకారులు
ప్రస్తుతం మార్చి నుంచి నవంబర్ నెలల మధ్య అమెరికాలో అమలవుతున్న సమయాన్నే (డేలైట్ సేవింగ్ టైమ్) ఇకపై ఏడాది పొడవునా శాశ్వత ప్రామాణిక సమయం (పర్మనెంట్ స్టాండర్డ్ టైమ్)గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి అమెరికా పార్లమెంట్‌లో ఈ సమయ మార్పులపై చాలా ఏళ్లుగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. తాను రెండోసారి దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ప్రజలకు ఈ గడియారాల చింత లేకుండా చేస్తానని ఎన్నికల ప్రచార సమయంలోనే ట్రంప్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, హౌస్‌లో ఈ చట్టాన్ని ఆమోదింపజేయడానికి ఆయన ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది.
ఇంతకీ ఏమిటీ ‘డేలైట్ సేవింగ్ టైమ్’ అంటే.. వేసవి నెలల్లో సూర్యుడు చాలా త్వరగా ఉదయిస్తాడు. ఉదయం 4 లేదా 5 గంటలకే ఎండ వచ్చేస్తుంది. ఆ సమయంలో చాలామంది నిద్రపోతుండటం వల్ల సహజమైన వెలుతురు వృథా అవుతుంది. అందుకే గడియారాన్ని ఒక గంట ముందుకు జరపడం వల్ల, సాయంత్రం వేళల్లో చీకటి పడటం ఆలస్యమై సూర్యకాంతిని ఎక్కువ సమయం ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. అమెరికాలో దీనిని ‘స్ప్రింగ్ ఫార్వర్డ్’ అని, శీతాకాలంలో గడియారాన్ని వెనక్కి జరపడాన్ని ‘ఫాల్ బ్యాక్’ అని పిలుస్తారు. ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్, ఐరోపా దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70కి పైగా దేశాలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి.
ఈ విధానానికి చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అమెరికా తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో విద్యుత్‌ను, ఇంధనాన్ని ఆదా చేసే ప్రధాన ఉద్దేశంతో ఈ డేలైట్ సేవింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత యుద్ధం ముగియడంతో కొంతకాలం దీనిని రద్దు చేసినప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అవసరాల దృష్ట్యా మళ్లీ తీసుకువచ్చారు. చివరకు 1969లో దీనిని చట్టబద్ధం చేస్తూ దేశవ్యాప్తంగా ఒకే రకమైన ప్రామాణీకరణను తెచ్చారు. నాటి నుంచి నేటి వరకు అమెరికా ప్రజలు ఏటా రెండుసార్లు సమయాన్ని మార్చుకుంటూ వస్తున్నారు.
ఏడాదికి రెండుసార్లు ఇలా సమయాన్ని మార్చడం వల్ల ప్రజల జీవన శైలిపై, ముఖ్యంగా నిద్ర లేమి ,శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. అలాగే వ్యాపారాలు, రవాణా రంగాల సమయపాలనలో కూడా అయోమయం నెలకొంటోంది. ఈ ఇబ్బందులన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతూ, పగటి వెలుతురును పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకే ట్రంప్ ప్రభుత్వం ఈ కొత్త సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకువచ్చింది. ఇది చట్టంగా మారితే అమెరికా కాలమాన చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది.
Also Read : పహల్గామ్ ఉగ్రదాడి కేసు.. ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్‌కు బిగుస్తున్న ఉచ్చు









