POK పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాలకు, అణచివేతకు వ్యతిరేకంగా అవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది మంది ప్రజలు రోడ్ల పైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ మార్చ్‌ను అడ్డుకోవడానికి పాకిస్థాన్ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. శాంతియుత నిరసనలను విచ్ఛిన్నం చేసేందుకు సుమారు 4,000 మంది సైనికులను, ఏడు రేంజర్ వింగ్‌లను రంగంలోకి దించింది. రావల్‌కోట్ బస్టాండ్ వద్ద నిరసనకారులపై పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇప్పటికే ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

Also Read : పాకిస్థాన్కు బిగ్ షాక్.. స్వతంత్ర దేశంగా బలూచిస్థాన్!

పాకిస్థాన్‌లోని పంజాబ్, సింధ్ వంటి ప్రాంతాల నుండి వచ్చిన శరణార్థుల కోసం పీవోకే అసెంబ్లీలో కేటాయించిన 12 సీట్లను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ భూమిపై బయటి వ్యక్తుల పెత్తనం చెల్లదని, ఆ 12 సీట్లను స్థానికులకే కేటాయించాలని వారు కోరుతున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రజలు పప్పులు, గోధుమల వంటి నిత్యావసర సరుకులను తక్కువ ధరకు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. గతేడాది జూన్‌లో శాంతియుత ప్రదర్శనలపై సైన్యం జరిపిన కాల్పుల్లో 20 నుండి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని నిరసనకారులు పట్టుబడుతున్నారు.

కాగా జూలై 14న పాకిస్థాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో 9 మంది పౌరులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన రావల్‌కోట్ , పూంచ్ సెక్టార్‌లలో చోటుచేసుకుంది. జూన్ నుంచి జరుగుతున్న ఈ ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య సుమారు 30కి పైగా ఉంటుందని అంచనా. పీవోకేలో జరుగుతున్న ఆందోళనలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పాకిస్థాన్ దశాబ్దాలుగా చేస్తున్న దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ , పరిపాలనాపరమైన అణచివేత వల్లనే ఈ నిరసనలు వెల్లువెత్తుతున్నాయని భారత్ పేర్కొంది.

Also Read : పాకిస్థాన్‌కు చెక్! ఆఫ్ఘన్ శరణార్థులకు అభయమిచ్చిన ఇండియా..

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.