
Balochistan : పాకిస్థాన్ నుండి విడిపోయి బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుందా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ప్రముఖంగా సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతోంది. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్ పేరుతో బయటకు వచ్చిన ఈ లేఖ, పాక్ ప్రభుత్వం, అక్కడి సైన్యంలో కలకలం రేపింది. బలూచిస్థాన్‌లోని 85 శాతం భూభాగం ఇప్పుడు తమ నియంత్రణలో ఉందని, తమకంటూ ప్రత్యేక జెండా, కరెన్సీని కూడా సిద్ధం చేసుకున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. కానీ, ఈ వార్త మాత్రం బలూచిస్థాన్ ప్రజల సుదీర్ఘ పోరాటాన్ని మరోసారి ప్రపంచం ముందు నిలబెట్టింది.
ఆ వైరల్ లేఖ ప్రకారం, బలూచిస్థాన్ ఇకపై స్వతంత్ర దేశమని, దీనికి రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్ అని పేరు పెట్టామని ఉంది. అంతేకాకుండా, మా చుకెన్ బలోచానిని తమ జాతీయ గీతంగా, బలూచీ ఫాలుస్ ను తమ కొత్త కరెన్సీగా ప్రకటించుకున్నారు. బలూచిస్థాన్‌లోని ఖనిజాలు, సహజ వాయువు, బొగ్గు గనులన్నీ ఇప్పుడు స్థానిక బలూచ్ పరిపాలన కిందే ఉన్నాయని, ముఖ్యంగా బంగారం, రాగి గనులను తామే చూసుకుంటున్నామని వారు చెబుతున్నారు. 150కి పైగా గ్యాస్ ఫీల్డ్స్, 1200కు పైగా బొగ్గు గనులు తమ ఆధీనంలో ఉన్నాయని, అందుకే ప్రపంచ దేశాలు తమను ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : ఇరాన్లో ఇజ్రాయెల్ ‘మాస్టర్ ప్లాన్’: మాజీ అధ్యక్షుడికి ఎర.. వెలుగులోకి మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్!
ఈ లేఖలో మరో షాకింగ్ విషయం ఏంటంటే, పాకిస్థాన్ భద్రతా దళాలకు చెందిన చాలా మంది జవాన్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, బలూచ్ తిరుగుబాటుదారులకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. తమ దగ్గర యుద్ధ విమానాలు, మిస్సైళ్లు లేకపోయినా, తమ భూభాగంపై తమకు పూర్తి పట్టు ఉందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బలూచిస్థాన్ మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ , సివిల్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిపి సుమారు 5 లక్షల మందితో సైన్యాన్ని సిద్ధం చేశామని, 2026 చివరి నాటికి పాక్ సైన్యాన్ని పూర్తిగా తరిమికొడతామని వారు సవాల్ విసురుతున్నారు. పాకిస్థాన్ అణ్వాయుధాలతో చేసే బ్లాక్ మెయిల్, ఉగ్రవాద చర్యలు బలూచిస్థాన్ స్వతంత్రంతో అంతమవుతాయని వారు నమ్ముతున్నారు.
ఈ పరిస్థితిపై బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ స్పందిస్తూ, బలూచిస్థాన్‌లో పరిస్థితి మెల్లగా తమ చేతుల్లోకి వస్తోందని చెప్పారు. పాక్ సైన్యం భూమిపై తమ పట్టు కోల్పోయిందని, ఇప్పుడు వారు కేవలం విమానాల ద్వారా దాడులు చేయడానికే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. గతంలో కేవలం ఆయుధాలు ఉన్నవారే పోరాడేవారని, కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి పాక్ సైన్యాన్ని వెనక్కి వెళ్ళిపోమని కోరుతున్నారని ఆయన తెలిపారు.
బలూచిస్థాన్‌లో చాలా ఏళ్లుగా అశాంతి నెలకొంది. అక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వం, సైన్యంపై నిరంతరం నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఒకవేళ ఈ స్వతంత్ర ప్రకటన నిజమైతే, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఇది పెద్ద తలనొప్పిగా మారనుంది. అయితే, ఈ వైరల్ లేఖపై పాకిస్థాన్ ప్రభుత్వం గానీ, అక్కడి సైన్యం గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read : నేపాల్ సరిహద్దులో అమెరికన్ కలకలం: పాస్‌పోర్ట్ లేకుండా ఏడు నెలలుగా ఇండియాలో!









