
Iran Former President : ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రకటిస్తున్నప్పటికీ, టెహ్రాన్‌లోని ఇస్లామిక్ ప్రభుత్వాన్ని రాజకీయంగా, సైనిక పరంగా పూర్తిగా అణచివేయడమే ఆ దేశ అసలు ఉద్దేశమని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్‌లో ప్రస్తుతం ఉన్న పాలకులను గద్దె దించి, తమకు అనుకూలమైన వ్యక్తిని అధికారంలో కూర్చోబెట్టేందుకు ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొస్సాద్’ (Mossad) కొన్నేళ్లుగా ఒక భారీ రహస్య ఆపరేషన్ నిర్వహించింది. ఈ సంచలనాత్మక కుట్రకు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించడంతో ప్రపంచవ్యాప్తంగా పెను కలకలం రేగింది.
Also Read : పాకిస్థాన్‌కు చెక్! ఆఫ్ఘన్ శరణార్థులకు అభయమిచ్చిన ఇండియా..
ఎరగా మారిన కరడుగట్టిన పాత శత్రువు
ఈ రహస్య ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ ఎంచుకున్న వ్యక్తి మరెవరో కాదు.. ఒకప్పుడు ఇజ్రాయెల్‌ను ప్రపంచ పటం నుంచి నామరూపాల్లేకుండా చేస్తానంటూ నిప్పులు చెరిగిన ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీనెజాద్. 2005 నుండి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో పాశ్చాత్య దేశాలకు సవాలు విసిరిన ఈ కరడుగట్టిన నేతను తమవైపు తిప్పుకుని, ప్రస్తుత ఇస్లామిక్ వ్యవస్థ కుప్పకూలితే ఆయనను ఇరాన్ నూతన అధినేతగా ప్రతిష్టించాలని మొస్సాద్ పక్కా ప్రణాళిక రచించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఖమేనీతో విభేదాలు.. మారిన గొంతుక
అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత అహ్మదీనెజాద్ ప్రవర్తనలో భారీగా మార్పులు వచ్చాయి. ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీతో వచ్చిన విభేదాలు, ఇరాన్ ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతిపై ఆయన గొంతు విప్పడం ప్రారంభించారు. ఒకప్పుడు ఇజ్రాయెల్ వ్యతిరేకిగా ఉన్న ఆయన, క్రమంగా తన వైఖరిని మార్చుకుంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సౌదీ యువరాజులకు లేఖలు రాయడం ఇరాన్ ఇంటెలిజెన్స్ దృష్టికి వచ్చింది. ఇజ్రాయెల్‌తో ‘అబ్రహం ఒప్పందాల’ తరహాలోనే సంబంధాలను సాధారణ స్థితికి తెస్తానని కూడా ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
2023లోనే పడిన మొదటి విత్తనం
అహ్మదీనెజాద్‌లోని ఈ అసంతృప్తిని ఆసరాగా చేసుకున్న మొస్సాద్, ఆయనను ట్రాప్ చేసేందుకు 2023 నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2023లో అహ్మదీనెజాద్ గ్వాటెమాలా పర్యటనకు వెళ్లిన సమయంలో తొలిసారిగా మొస్సాద్ ప్రతినిధులు ఆయనను రహస్యంగా కలిశారని సమాచారం. ఆ తర్వాత నుండి ఇజ్రాయెల్ నిఘా వర్గాలతో ఆయన నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు తన భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి కొన్ని గంటల పాటు అదృశ్యమయ్యేవారని ఇరాన్ అధికారులు గుర్తించారు.
హంగేరీ వేదికగా మొస్సాద్ చీఫ్‌తో భేటీ
ఈ కుట్రలో అత్యంత కీలక ఘట్టం 2024లో చోటుచేసుకుంది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లోని లుడోవికా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక పర్యావరణ సదస్సుకు అహ్మదీనెజాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సదస్సు ముసుగులో అప్పటి మొస్సాద్ చీఫ్ డేవిడ్ బార్నియా నేరుగా అహ్మదీనెజాద్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అహ్మదీనెజాద్ విదేశీ ప్రయాణాలు, వసతి ఖర్చులను కూడా ఇజ్రాయెలే భరించిందని, ఈ కీలక పరిణామాన్ని మొస్సాద్ అమెరికా గూఢచారి సంస్థ సిఐఎ (CIA)కి సైతం తెలియజేసిందని కథనాలు వెల్లడించాయి.
ఐఆర్‌జీసీ కన్నుగప్పి రెండోసారి భేటీ
అక్కడితో ఆగకుండా 2025 జూన్‌లోనూ బుడాపెస్ట్ వేదికగానే మరోసారి రహస్య సమావేశం జరిగింది. ఈ పర్యటనలో అహ్మదీనెజాద్ తన సొంత భద్రతా దళమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కళ్ళు గప్పి మొస్సాద్ ఏజెంట్లతో చర్చలు జరిపారు. 2026 ఫిబ్రవరిలో ఇరాన్‌పై దాడులు ప్రారంభమవడానికి కేవలం ఐదు రోజుల ముందు కూడా ఆయన హంగేరీలోనే పర్యటించడం, అక్కడ ఇజ్రాయెల్ ప్రతినిధులతో మాట్లాడడం ఈ ఆపరేషన్‌లోని తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది.
సినిమాటిక్ తరహాలో దాడి నుంచి రక్షణ
ఈ ఏడాది ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ప్రారంభమైనప్పుడు మొస్సాద్ ఆపరేషన్ పతాక స్థాయికి చేరింది. దాడుల సమయంలో అహ్మదీనెజాద్ నివసిస్తున్న కాంపౌండ్‌పై కూడా బాంబులు పడ్డాయి. ఆ దాడిలో ఆయన చనిపోయారని ప్రపంచం భావించినప్పటికీ, ఒక ‘ప్యుజో’ కారులో వచ్చిన మొస్సాద్ ఏజెంట్లు ఆయనను సురక్షితంగా రక్షించి, ఇరాన్ లోపలే ఉన్న ఒక రహస్య ‘సేఫ్ హౌస్’కు తరలించారు. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని కూల్చాక ఆయనను అధికారంలోకి తీసుకురావడమే ఈ రక్షణ చర్య ముఖ్య ఉద్దేశం.
బెడిసికొట్టిన నమ్మకం.. సేఫ్ హౌస్ నుండి ఎస్కేప్
అయితే, ఇజ్రాయెల్ వ్యూహం అనుకున్నట్లుగా సాగలేదు. తనను కాపాడటానికి ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ శైలిపై, అలాగే ఇజ్రాయెల్ తనను నిజంగానే మళ్లీ ఇరాన్ అధికార పీఠంపై కూర్చోబెడుతుందా అనే విషయంలో అహ్మదీనెజాద్‌కు తీవ్ర అనుమానాలు \విభేదాలు వచ్చాయి. దీంతో ఇజ్రాయెల్ ప్లాన్ పట్ల నమ్మకం సడలిన మాజీ అధ్యక్షుడు, కొన్ని రోజులకే మొస్సాద్ ఏర్పాటు చేసిన రహస్య సేఫ్ హౌస్ నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చేశారు.
అంత్యక్రియల్లో అకస్మాత్ ప్రత్యక్షం
సేఫ్ హౌస్ నుంచి బయటపడిన తర్వాత చాలా రోజుల పాటు ఆయన బయటి ప్రపంచానికి ఎక్కడా కనిపించలేదు. అయితే, ఇటీవల ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఆయన అకస్మాత్తుగా ప్రత్యక్షమవడంతో ఇరాన్ పాలక వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆ కార్యక్రమానికి హాజరైనప్పటికీ అహ్మదీనెజాద్ ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండడం గమనార్హం.
కుట్రను పసిగట్టిన ఇరాన్ నిఘా వర్గాలు
అహ్మదీనెజాద్ కదలికలపై కొన్నేళ్లుగా నిఘా ఉంచిన ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు, విదేశీ పర్యటనల వివరాలు మొస్సాద్‌తో ఆయన జరిపిన రహస్య కమ్యూనికేషన్ పక్కా ఆధారాలను సేకరించాయి. ఇజ్రాయెల్ భరిస్తున్న ఆర్థిక సాయం, దాడుల సమయంలో ఆయన సురక్షితంగా బయటపడడం వెనుక ఉన్న వ్యూహాన్ని పూర్తిగా ఛేదించిన ఇరాన్ భద్రతా దళాలు, ఆయన చర్యలు దేశద్రోహం కిందకే వస్తాయని నిర్ధారించుకున్నాయి.
ప్రస్తుతం ఐఆర్‌జీసీ గృహనిర్బంధంలో..
ఇజ్రాయెల్ ప్లాన్ పూర్తిగా విఫలమవడంతో, ప్రస్తుతం మహ్మూద్ అహ్మదీనెజాద్‌ను ఇరాన్ పవర్ ఫుల్ మిలిటరీ విభాగమైన ఐఆర్‌జీసీ (IRGC) కస్టడీలోకి తీసుకుంది. ఆయనను ప్రస్తుతం తీవ్ర భద్రత నడుమ గృహనిర్బంధంలో ఉంచినట్లు ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ అధ్యక్షుడే శత్రుదేశమైన ఇజ్రాయెల్‌తో చేతులు కలిపారనే వార్త ఇరాన్ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Also Read : ట్రంప్ సంచలనం : నౌకలపై 20% టోల్ బాదుడు.. ఇరాన్ ఫైర్!
అంతర్జాతీయంగా నిశ్శబ్దం
ఈ సంచలనాత్మక కుట్రకు సంబంధించి ‘న్యూయార్క్ టైమ్స్’ నివేదిక ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నప్పటికీ, అటు ఇరాన్ ప్రభుత్వం కానీ, ఇటు ఇజ్రాయెల్ అధికారిక యంత్రాంగం కానీ దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య, ఇరాన్ మాజీ అధ్యక్షుడిని ఎరగా చూపి పాలకులను మార్చాలని చూసిన మొస్సాద్ ప్లాన్ చివరకు బెడిసికొట్టడం గూఢచార ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.









