
India Helps Afghanistan: భారతదేశం తన మిత్రదేశాలకు ఆపద వచ్చిన ప్రతిసారీ ముందుండి ఆదుకోవడంలో ఎప్పుడూ వెనుకంజ వేయదు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం తమ దేశంలో ఉంటున్న ఆఫ్ఘన్ శరణార్థులను నిర్దాక్షిణ్యంగా తరిమివేస్తుండటంతో, వారిని ఆదుకోవడానికి భారత్ మరోసారి ముందుకు వచ్చింది. పాక్ చర్య వల్ల నిరాశ్రయులైన వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులకు మానవీయ దృక్పథంతో సహాయ సామాగ్రిని అందిస్తూ ఆసరాగా నిలిచింది. మానవతా సహాయంలో భాగంగా భారత్ పంపిన ‘ఫ్యామిలీ టెంట్లను’ ఆఫ్ఘనిస్థాన్‌లోని ‘శరణార్థుల, పునరావాస మంత్రిత్వ శాఖ’ (MoRR)కి అధికారికంగా అంద చేశారు. పాకిస్థాన్ నుండి బలవంతంగా తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ కుటుంబాలు తాత్కాలికంగా తలదాచుకోవడానికి, వారు తిరిగి స్థిరపడటానికి ఈ టెంట్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.
పాకిస్థాన్‌లో సరైన వీసా లేదా అధికారిక పత్రాలు లేకుండా నివసిస్తున్న ఆఫ్ఘన్ పౌరులు జులై 10వ తేదీలోగా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లాలని పాక్ ప్రభుత్వం గడువు విధించింది. ఈ గడువు ముగియడంతో పాకిస్థాన్ పరిపాలనా యంత్రాంగం వారిని వెనక్కి పంపే ప్రక్రియను తీవ్రతరం చేసింది. దీనితో వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు అర్ధాంతరంగా తమ నివాసాలను ఖాళీ చేసి సొంత దేశానికి పయనమవ్వాల్సి వస్తోంది. విశ్వసనీయ నివేదికల ప్రకారం, ప్రతిరోజూ వేలాది మంది ఆఫ్ఘన్లు పాకిస్థాన్ సరిహద్దు దాటి తమ స్వదేశానికి చేరుకుంటున్నారు. ‘అమూ టీవీ’ కథనం ప్రకారం, కేవలం ఒకే ఒక్క రోజు వ్యవధిలోనే 4,000 మందికి పైగా ఆఫ్ఘన్ పౌరులు సరిహద్దు గుండా వెనక్కి వచ్చారు. మరోవైపు, లాండీ కోటల్ వద్ద ఉన్న హంజా బాబా ట్రాన్సిట్ పాయింట్ వద్ద తిరిగి వచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, ప్రస్తుతం రోజుకు 10,000 మందికి పైగా ఆఫ్ఘన్లు సరిహద్దు దాటుతున్నారని పాకిస్థాన్ పత్రిక ‘డాన్’ పేర్కొంది.
ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన
పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం (UNHCR) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. UNHCR ప్రతినిధి ఖైసర్ ఖాన్ ఆఫ్రిది మాట్లాడుతూ.. ముఖ్యంగా మహిళలు, బాలికల భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నామని చెప్పారు. మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలిగే వాతావరణం ఉన్న ప్రాంతాలకు వారిని బలవంతంగా పంపడం సరికాదని అభిప్రాయపడ్డారు. శరణార్థుల పునరాగమనం పూర్తి స్వచ్ఛందంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా జరగాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
చారిత్రాత్మకంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య ఉన్న స్నేహసంబంధాలు పాకిస్థాన్‌కు ఎప్పుడూ మింగుడుపడవు. ఆఫ్ఘన్ పౌరులకు రవాణా, విద్య వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆహార ధాన్యాలు, మందులను భారత్ నిరంతరం అందిస్తూనే ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ వారిని నెట్టివేస్తున్న వేళ, భారత్ వారికి నీడను కల్పించేందుకు టెంట్లను పంపి ఆదుకోవడం భారత్ యొక్క మానవతా దృక్పథాన్ని, అంతర్జాతీయ బాధ్యతను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.









