
Mudragada Padmanabham : గత ఎన్నికల ముందు ముద్రగడను జనసేనలోకి ఆహ్వానించిన సమయంలో, ఆయన లాంటి సీనియర్ నాయకుడికి కూటమి ప్రభుత్వంలో ‘గవర్నర్’ పదవి దక్కేలా చూసే బాధ్యతను జనసేన తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ నాడు హామీ ఇచ్చారని,జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ అన్నారు.కైకలూరులో నిర్వహించిన ‘జనసేన చర్చా వేదిక’ కార్యక్రమంలో సంచలన విషయాలు వెల్లడించారు. అనంతరం కన్నుమూసిన మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. ముద్రగడ మరణవార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించుకుని అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారని తెలిపారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం శ్రమించిన క్షేత్రస్థాయి కార్యకర్తల సమస్యలను నేరుగా విని, వాటిని పరిష్కరించేందుకు మరియు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే నాయకులు స్వయంగా కార్యకర్తల వద్దకు వెళ్లి సమస్యలు వినడం ఇదే ప్రథమమని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని స్పష్టం చేశారు.పార్టీ అంతర్గత పరిణామాలపై మాట్లాడుతూ, జనసేనలో ఎలాంటి గ్రూపు రాజకీయాలకు తావులేదని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. పార్టీలో ఉన్నదల్లా ఒకే ఒక్క వర్గమని, అది శ్రీ పవన్ కళ్యాణ్ వర్గం మాత్రమేనని స్పష్టం చేశారు. అధినేత సిద్ధాంతాలు, ఆశయాలే ప్రతి సైనికుడికి మార్గదర్శకాలని, స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరైనా విడిగా గ్రూపులు కడితే వాటిని ప్రారంభంలోనే తుంచివేయాలని పిలుపునిచ్చారు. తాము ఏ కార్యక్రమంలో పాల్గొన్నా పవన్ కళ్యాణ్ ప్రతినిధులుగానే వ్యవహరిస్తామని, నాయకులంతా అధినేత లైన్‌కు కట్టుబడి పనిచేయాలని ఆదేశించారు.
Also Read : మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ: రెబల్ తృణమూల్ వర్గంలో చేరిన సీనియర్ నేత మదన్ మిత్ర!
జనసేన సాధించిన ప్రగతిని వివరిస్తూ, కేవలం 60 వేల క్రియాశీలక సభ్యత్వంతో ప్రారంభమైన పార్టీ, నేడు రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల మార్కుకు చేరిందని హర్షం వ్యక్తం చేశారు. గత 12 ఏళ్ల ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలు, త్యాగాలను భరించారని గుర్తుచేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాటకు కట్టుబడి, పార్టీకి బలం ఉన్న చోట కూడా ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని సీట్లను వదులుకుని కూటమిని ఏర్పాటు చేశారని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలంగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ జనసేన అభ్యర్థులు ఖచ్చితంగా పోటీ చేస్తారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయని నాదెండ్ల విమర్శించారు. నాడు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు జనసేన తరఫున రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందించేందుకు వెళ్తే, జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో సైతం పోలీసులు, అధికార యంత్రాంగంతో బెదిరింపులకు దిగారని ఆరోపించారు. అన్ని అడ్డంకులను అధిగమించి, పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది కౌలు రైతు కుటుంబాలను ఆదుకున్నారని, కొల్లేరు అంశంలో పవన్ కళ్యాణ్‌పై కావాలనే కొందరు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమం ముగింపులో నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ విప్ హరిప్రసాద్ మరియు ఇతర ముఖ్య నేతలు ప్రతి కార్యకర్త వద్దకు స్వయంగా వెళ్లారు. వారి వ్యక్తిగత వివరాలు, పార్టీ సేవల కాలం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఫీడ్‌బ్యాక్ సేకరిస్తూ స్వయంగా నోట్ చేసుకున్నారు. తమ సమస్యలను వినేందుకు అగ్ర నాయకత్వమే నేరుగా రావడం పట్ల జనసైనికులు, వీరమహిళలు సంతోషం వ్యక్తం చేయగా, కార్యకర్తలు తెలిపిన ప్రతి సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
Also Read : ఏఓ శ్రీహరి హత్య కేసులో బిగ్ ట్విస్ట్: నిందితుడు హరికృష్ణ కుటుంబం ఆత్మహత్య!









