
AO Murder Case: ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయ అధికారి (ఏఓ) ఎన్. శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుడుముల హరికృష్ణ, తన భార్య ,ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రోజున సింగరాయకొండ రైల్వే స్టేషన్ రెండవ నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద గూడ్స్ రైలు కింద నలుగురూ ఒక్కసారిగా దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు మృతులను గుర్తించారు.
ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు హరికృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్న తరుణంలో, కుటుంబంతో సహా అతడు బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో ఏఓ శ్రీహరి హత్య కేసు విచారణలో సరికొత్త మలుపు తిరిగింది.
హత్య నేపథ్యం: గుండెపోటుగా చిత్రీకరణ
గత నెల జూన్ 15న ఏఓ శ్రీహరిని ఆయన సొంత బావమరిది అయిన హరికృష్ణ దైవదర్శనం పేరుతో నమ్మించి కారులో పెంచలకోనకు తీసుకెళ్లాడు. తిరిగి వస్తున్న మార్గమధ్యంలో చేజర్ల సమీపంలో కారును నిలిపివేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్కడ మాటువేసిన రవీంద్ర, యానాది అనే ఇద్దరు వ్యక్తులు శ్రీహరిని గట్టిగా పట్టుకోగా, హరికృష్ణ కుక్కలను చంపేందుకు ఉపయోగించే విషపూరితమైన రెండు ఇంజెక్షన్లను బావ శ్రీహరికి గుచ్చాడు. దాని ప్రభావంతో శ్రీహరి కారులోనే మృతి చెందగా, సాధారణ గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.
మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానం రాకుండా ఉండేందుకు, వారి సంప్రదాయం ప్రకారం ఖననం చేయాల్సిన శ్రీహరి మృతదేహాన్ని హరికృష్ణ తొందరపడి దహనం చేయించాడు. శ్రీహరి వద్ద ఉన్న కోట్ల విలువైన ఆస్తులు, అప్పుగా ఇచ్చిన పెద్ద మొత్తంలో డబ్బులను తిరిగి అడగడమే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తన ఇల్లు కట్టుకోవడానికి శ్రీహరి ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడంతో, ఆస్తిని కాజేసేందుకే హరికృష్ణ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.
బావను హతమార్చిన తర్వాత కూడా హరికృష్ణ ఆగలేదు. శ్రీహరికి చెందిన మిగిలిన ఆస్తులను కూడా తన పేరిట రాయాలని శ్రీహరి భార్య లావణ్యపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన లావణ్య జులై 6న నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లకు పీజీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు చేపట్టిన విచారణలో.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి శ్రీహరిని బావమరిదే హత్య చేసినట్లు పక్కా ఆధారాలతో వెలుగు చూసింది.
ఈ కేసు ప్రారంభంలో బుచ్చిరెడ్డిపాలెం పోలీసుల ప్రవర్తన తీవ్ర వివాదాస్పదమైంది. మృతుడి బంధువులు శ్రీహరి శరీరంపై గాయాలున్నాయని చెప్పినా అప్పటి సీఐ మాతంగి శ్రీనివాసరావు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈ నిర్లక్ష్యంపై తీవ్రంగా పరిగణించిన నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల, బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్‌కు చెందిన 23 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సదరు సీఐని విఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీహరి హత్యకు సహకరించిన రవీంద్ర, యానాది అనే ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారి హరికృష్ణ మాత్రం పరారీలో ఉన్నాడు. పోలీసు బృందాలు అతని కోసం నాలుగు రోజులుగా తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే పోలీసుల దర్యాప్తు తీవ్రతరం కావడంతో అరెస్టు భయం, పరువు పోతుందనే మనస్తాపంతో హరికృష్ణ పరారీలోనే ఉన్నాడు. ఆత్మహత్యకు రెండు రోజుల ముందు హరికృష్ణ ఒక వీడియోను విడుదల చేయడం సంచలనం సృష్టించింది. తనపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, శ్రీహరి హత్యలో తనకు ఎలాంటి పాత్ర లేదని అందులో పేర్కొన్నాడు. అంతేకాకుండా, తనపై వస్తున్న నిందలు తట్టుకోలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఆ వీడియోలోనే హెచ్చరించాడు. ఆ వీడియో వెలువడిన కొద్ది రోజులకే అతడు చెప్పినట్లే ఘాతుకానికి ఒడిగట్టాడు.
కుటుంబంతో సహా బలవన్మరణం
హరికృష్ణ తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి అతని భార్య, ఇద్దరు అమాయక చిన్నారులు బలయ్యారు. పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునే క్రమంలో, కుటుంబంతో కలిసి రైలు కిందపడి ప్రాణాలు తీసుకోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఒక ఆస్తి వివాదం, దానిని కప్పిపుచ్చేందుకు చేసిన హత్య.. చివరికి రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.ప్రధాన నిందితుడు హరికృష్ణ కూడా మృతి చెందడంతో శ్రీహరి హత్య కేసు దర్యాప్తులో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటన స్థలంలో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హత్య వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? లేదా హరికృష్ణ ఆత్మహత్యకు మరేవైనా ఇతర ఒత్తిళ్లు కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.









