
Persian Gulf : పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు అలముకోవడంతో వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ జెండాతో ప్రయాణిస్తున్న 7 నౌకలు, వాటిలోని 148 మంది భారతీయ సిబ్బంది పర్షియన్ గల్ఫ్‌లోనే చిక్కుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనికి తోడు భారత్‌కు ఎరువులు, ఇతర నిత్యావసర సరుకులతో వస్తున్న మరో 11 విదేశీ నౌకలను సురక్షితంగా బయటకు తరలించేందుకు (ఎవాక్యుయేషన్) కేంద్రం తగిన ఏర్పాట్లు చేస్తోంది. గల్ఫ్ రీజియన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుల భద్రతను పర్యవేక్షిస్తూ, వారిని సురక్షితంగా రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత నౌకాదళంతో (ఇండియన్ నేవీ) నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.
ఇటీవల ఇరాన్-అమెరికాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రద్దు కావడం గల్ఫ్ ప్రాంతంలో దాడుల తీవ్రతను మరింత పెంచింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కు చెందిన ‘మొంబాసా’, ‘అల్ బహియా’ అనే రెండు ఆయిల్ ట్యాంకర్లపై ఇటీవల మిస్సైల్ దాడులు జరిగాయి. ఈ దారుణ ఘటనలో ఒక భారతీయ నావికుడు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమ హెచ్చరికలను లెక్కచేయకుండా ప్రయాణించడం వల్లే ఈ దాడులు జరిపినట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బహిరంగంగా ప్రకటించింది. ఈ తాజా ప్రమాదంతో కలిపి, ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియాలో సాగుతున్న ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ నావికుల సంఖ్య ఇప్పటివరకు 14కు చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ ప్రాంతంలో నౌకల రాకపోకల మార్గాలపై అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. హర్మూజ్ జలసంధిని దాటేందుకు రెండు మార్గాలు ఉండగా.. ఒమన్ సరిహద్దుల గుండా వెళ్లే దక్షిణ మార్గాన్ని అమెరికా, అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (IMO) సమర్థిస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం తమ ప్రాదేశిక జలాల గుండా వెళ్లే ఉత్తర మార్గాన్నే వాడాలని పట్టుబడుతోంది. ఇరాన్ వైపు నుంచి క్షిపణి దాడుల భయం ఉండటంతో దక్షిణ మార్గంలో నౌకల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దాడుల నుంచి తప్పించుకునేందుకు కొన్ని నౌకలు తమ లొకేషన్ ట్రాకర్లను (ట్రాన్స్‌పాండర్లు) నిలిపివేసి రహస్యంగా ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
మరోవైపు ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. హర్మూజ్ జలసంధి ఎప్పటికీ తెరిచే ఉంటుందని, దానికి అమెరికా సైన్యమే సంరక్షకుడిగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అయితే, ఈ మార్గం గుండా వెళ్లే అన్ని రకాల సరుకు రవాణా నౌకలపై 20 శాతం భద్రతా రుసుము (ఛార్జీ) వసూలు చేస్తామని ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా పెద్ద సంచలనం సృష్టిస్తోంది. అమెరికా ప్రతిపాదించిన ఈ భద్రతా రుసుమును అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (IMO) తో పాటు ఇరాన్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న ఈ సంక్షోభం ఎటు దారితీస్తుందోనని అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన చెందుతోంది.









