POCSO : తెలంగాణలో బాలలపై లైంగిక దాడుల నిరోధక చట్టాన్ని (పోక్సో – POCSO) మరింత సమర్థవంతంగా, పటిష్ఠంగా అమలు చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ బుధవారం (జూలై 15, 2026న) ఒక లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ పరిధిలో జరిగిన దారుణ హత్యల ఉదంతాన్ని ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. చిన్నారుల రక్షణ కేవలం ఒక చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 39ల ప్రకారం అది ఒక అత్యున్నత రాజ్యాంగ బాధ్యత అని గుర్తుచేశారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా కేవలం పరిపాలనాపరమైన సంస్కరణల కోసమే ఈ లేఖ రాస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇటీవల షాబాద్‌లో జరిగిన ఆరు హత్యల కేసులో బాధితులను కాపాడటంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పవన్ కల్యాణ్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిపై గతంలోనే పోక్సో కేసు నమోదై ఉన్నప్పటికీ, అతనికి సులభంగా బెయిల్ లభించడం పోలీసుల వైఫల్యమేనని దుయ్యబట్టారు. పోక్సో కేసులకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, నిందితులకు బెయిల్ రాకుండా సాక్ష్యాధారాలను పటిష్ఠంగా కోర్టు ముందు ఉంచాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసినా, ఈ ఘటనలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. నిందితుల నుంచి బాధితులకు ఎదురయ్యే ముప్పును నివారించడంలో వ్యవస్థలు విఫలమయ్యాయని పేర్కొన్నారు.

ఈ తరహా సున్నితమైన కేసులలో విచారణ ప్రక్రియకు నిర్దిష్ట గడువును విధించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పోక్సో కేసుల దర్యాప్తును ఎట్టిపరిస్థితుల్లోనూ 60 నుండి 90 రోజులలోపు పూర్తి చేసేలా కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు ఎలాంటి ఆలస్యం లేకుండా 24 గంటల లోపు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఫోరెన్సిక్ , డీఎన్‌ఏ (DNA) ఆధారాలను అత్యంత వేగంగా సేకరించి భద్రపరచాలని సూచించారు. సాక్ష్యాధారాలు ఏమాత్రం మాయం కాకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయగలమని స్పష్టం చేశారు.

చిన్నారుల భద్రత కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఒక ‘పోక్సో మానిటరింగ్ సెల్’ (POCSO Monitoring Cell) ను ఏర్పాటు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు. ఈ కేసుల పురోగతిపై జిల్లా ,రాష్ట్ర స్థాయిలలో ప్రతి నెలా ఉన్నతాధికారులతో సమీక్షలు జరపాలని కోరారు. విచారణలో ఉద్దేశపూర్వకంగా అలసత్వం ప్రదర్శించే లేదా బాధితులకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

బాలలపై అకృత్యాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్, హాస్టళ్లు, ప్రార్థనా స్థలాలలో తప్పనిసరి రిపోర్టింగ్ విధానాన్ని (Mandatory Reporting System) ప్రవేశపెట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు. చిన్న పిల్లలపై ఎలాంటి అనుమానాస్పద వేధింపులు జరిగినా తక్షణమే ప్రాథమిక విచారణతో సంబంధం లేకుండా నిమిషాల వ్యవధిలో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసేలా ఆదేశాలు ఉండాలన్నారు. బాధితులకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు నిందితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచే బలమైన నిఘా వ్యవస్థను నెలకొల్పాలని పేర్కొన్నారు.

రాజకీయ ప్రయోజనాలకు తావులేకుండా కేవలం ప్రజా ప్రయోజనాలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా పవన్ కల్యాణ్ ఈ లేఖ రాయడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డీజీపీ (DGP) లకు కూడా ఆయన లేఖలు రాయడం గమనార్హం. ఈ పరిపాలనాపరమైన సూచనల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.