పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ వార్ ముదురుతోంది. ఇరు దేశాల మధ్య దాడులు మునుపెన్నడూ లేనంత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై హఠాత్తుగా బాంబుల వర్షం అమెరికా కురిపించింది. దీంతో మళ్లీ ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు చేపట్టాయి. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న దాదాపు 90 వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. బుషెహర్‌లో ఉన్న ఇరాన్ ఏకైక ప్రతిష్టాత్మక అణు విద్యుత్తు కేంద్రంపై అమెరికా బాంబులు వేసిందని ఇరాన్ ఆరోపించింది.

ఈ దాడులకు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ వీడియోలను కూడా అమెరికా విడుదల చేసింది. అందులో రన్‌వేలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు ధ్వంసమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం సైనిక స్థావరాలే కాకుండా ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేలా రష్యా, చైనాలతో కనెక్ట్ చేసే కీలకమైన ‘అఖ్ తాఖే ఖాన్’ రైల్వే వంతెనను కూడా అమెరికా పేల్చివేసింది. దీనివల్ల టెహ్రాన్-మషాద్ మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సముద్ర మార్గంలో అంతర్జాతీయ నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్‌కు బుద్ధి చెప్పడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

Also Read : ఫైటర్ జెట్ల పహారాలో ఖమేనీ అంతిమయాత్ర: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ద మేఘాలు!

ఈ భీకర దాడుల్లో ఇప్పటివరకు 14 మంది ఇరాన్ సైనికులు మరణించగా, 78 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ యుద్ధ ప్రభావం భారత్‌పై కూడా గట్టిగానే పడింది. ఇరాన్‌లో భారత్ భారీ పెట్టుబడులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న వ్యూహాత్మక ‘చాబహార్ పోర్టు’పై అమెరికా దళాలు బాంబుల దాడికి దిగాయి. ఈ దాడిలో పోర్టుకు అత్యంత కీలకమైన ‘మారిటైమ్ కంట్రోల్ టవర్’ తీవ్రంగా దెబ్బతింది. పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు సముద్ర మార్గం ద్వారా వ్యాపార రవాణా సాగించడానికి భారత్‌కు ఈ పోర్టు బాగా ఉపయోగపడుతుంది.

ఇప్పుడు ఈ ఆర్థిక కారిడార్‌పై దాడి జరగడం భారతదేశ దౌత్య, ఆర్థిక వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికా దాడులకు ఇరాన్ అంతే వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వందలాది క్షిపణులు, డ్రోన్లతో ఎదురుదాడికి దిగింది. ముఖ్యంగా బహ్రెయిన్‌లోని అమెరికా నావికాదళ 5వ ఫ్లీట్ స్థావరంపై ఇరాన్ కనీసం మూడుసార్లు దాడులు చేయడంతో యుద్ధ సైరన్లు మోగాయి.

Also Read : చైనా జీడీపీ డేటాను ప్రశ్నించిన ప్రముఖ అర్థశాస్త్రవేత్త గావో షాన్వెన్ అనుమానాస్పద మృతి