
Ali Khamenei Funeral :ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన తూర్పు పవిత్ర నగరం మష్హద్‌లో అత్యంత ఘనంగా ముగిశాయి. ఇరాన్, ఇరాక్ దేశాల గుండా గత ఆరు రోజులుగా కొనసాగిన సుదీర్ఘ అంతిమయాత్ర గురువారం సాయంత్రం ముగిసింది. ఖమేనీ శవపేటికను మోసుకెళ్తున్న విమానానికి ఇరాన్ వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన ఫైటర్ జెట్లు గాల్లో రక్షణగా (Escort) పహారా కాస్తూ మష్హద్ నగరానికి చేర్చాయి. సుప్రీం లీడర్ అధికారిక వెబ్‌సైట్ విడుదల చేసిన దృశ్యాల్లో యుద్ధ విమానాల నీడలో సాగిన ఈ చారిత్రాత్మక ఊరేగింపు పశ్చిమాసియా రాజకీయాల్ని ప్రతిబింబించింది.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు జరిపిన ఉమ్మడి వైమానిక దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో జూలై 4న ప్రారంభమైన ఈ సుదీర్ఘ అంతిమయాత్రలో భాగంగా ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్, మత కేంద్రమైన ఖోమ్ నగరాలతో పాటు ఇరాక్‌లోని షియా పవిత్ర క్షేత్రాలైన నజాఫ్, కర్బలాల గుండా ఊరేగించారు. దాడుల్లో మరణించిన ఖమేనీ కుమార్తె, అల్లుడు, పసి మనవరాలు , ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ భార్య జహ్రా హద్దాద్ అడెల్‌ల శవపేటికలను కూడా ఖమేనీ శవపేటిక పక్కనే ఉంచి ఉమ్మడిగా ఈ యాత్రను నిర్వహించగా, లక్షలాది మంది ప్రజలు కంటినీటితో నివాళులర్పించారు.
మష్హద్ నగరంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన షియా పవిత్ర క్షేత్రం ‘ఇమామ్ రెజా ష్రైన్’ (Shrine of Imam Reza) వద్ద ఖమేనీ అంతిమ సంస్కారాలు జరిగాయి. షియా విశ్వాసాలలో అత్యంత పవిత్రంగా భావించే 12 మంది ఇమామ్‌లలో ఇరాన్ గడ్డపై సమాధి చేయబడిన ఏకైక ఇమామ్ ‘రెజా’ కావడం గమనార్హం. గతంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు పూర్వపు ఇరాన్ రాజుల (షా) సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఖమేనీ చివరి కోరిక మేరకు ఆయనను స్వస్థలంలోనే ఖననం చేసినట్లు ఇరాన్ స్టేట్ టీవీ వెల్లడించింది. 101 ఏళ్ల వయోవృద్ధ ప్రముఖ అయాతొల్లా హుస్సేన్ నూరి హమేదానీ ఈ అంతిమ ప్రార్థనలకు నాయకత్వం వహించారు.
ఒకవైపు ఆరు రోజుల సుదీర్ఘ అంత్యక్రియలు జరుగుతున్న వేళ, మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. రెండు దేశాలు ఒకరిపై ఒకరు క్షిపణి వర్షం కురిపించుకున్నాయి. బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తాము ప్రతీకార దాడులను మరింత తీవ్రతరం చేశామని ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది.
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (Strait of Hormuz) సముద్ర జలాల్లో ఈ సైనిక ఘర్షణలు చోటుచేసుకోవడంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పక్క తమ సుప్రీం లీడర్‌కు వీడ్కోలు పలుకుతూనే, మరోపక్క అమెరికా-ఇజ్రాయెల్ కూటమిని ఢీకొట్టేందుకు ఇరాన్ బలగాలు సరిహద్దుల్లో భారీగా క్షిపణులను సిద్ధం చేయడం వల్ల పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధ భయాలు కమ్ముకున్నాయి.









