
China News: చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలను, జీడీపీ గణాంకాలను బహిరంగంగా ప్రశ్నిస్తూ వచ్చిన ప్రముఖ చైనీస్ అర్థశాస్త్రవేత్త గావో షాన్వెన్ (Gao Shanwen – 55) హఠాన్మరణం చెందారు. చైనాలో ప్రభుత్వంపై, వారి గణాంకాలపై విమర్శలు చేసిన అనేకమంది ప్రముఖులు అనుమానాస్పద రీతిలో మరణించిన దాఖలాలు గతంలోనూ (లియు షియావోబో, లీ వాంగ్‌యాంగ్ వంటివారు) ఉన్నాయి. ఆ జాబితాలోకి ఇప్పుడు గావో షాన్వెన్ పేరు కూడా చేరడం పట్ల అంతర్జాతీయంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గావో షాన్వెన్ చైనా క్యాపిటల్ మార్కెట్, ఆర్థిక వ్యవస్థపై ఎంతో పట్టున్న అత్యంత ప్రభావవంతమైన స్థూల అర్థశాస్త్రవేత్తలలో (Macro-economists) ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ ‘SDIC సెక్యూరిటీస్’ మాజీ చీఫ్ ఎకనామిస్ట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. కాగా, తీవ్ర అనారోగ్యం కారణంగానే గావో మరణించినట్లు చైనా ప్రభుత్వ అధికారిక మీడియా ‘షాంఘై సెక్యూరిటీస్ న్యూస్’ ప్రకటించింది. అయితే ఆయనకు ఉన్న అనారోగ్యం ఏంటి, మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఏంటనే విషయాలపై చైనా మీడియా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
గతంలో గావో షాన్వెన్ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలే ఆయన మరణం చుట్టూ అనుమానాలు కలగడానికి ప్రధాన కారణమయ్యాయి. వాషింగ్టన్ డీసీలోని ‘పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్’ మరియు ఒక చైనీస్ థింక్ ట్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో గావో పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. 2021 నుండి 2023 మధ్య కాలంలో చైనా ప్రభుత్వం ప్రకటించిన సగటు జీడీపీ వృద్ధి రేటు 5 శాతం కాదని, వాస్తవానికి చైనా అసలు జీడీపీ వృద్ధి సగటున కేవలం 2 శాతం మాత్రమే ఉండి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ అధికారిక లెక్కల్లో లోపాలు ఉన్నాయని గావో గట్టిగా వాదించారు. ఉద్యోగాలు, వినియోగం (Consumption), మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాస్తవ నివేదికలను ఆధారంగా చూపిస్తూ చైనా ప్రభుత్వం గణాంకాలను పెంచి చూపుతోందని ఆధారాలతో సహా పేర్కొన్నారు. అంతేకాకుండా, చైనాలో యువతలో రోజురోజుకూ పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై చైనా ఆర్థిక వ్యవస్థ అసలు రంగును బయటపెట్టడం బీజింగ్ పాలకులకు మింగుడుపడలేదు.
ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి గురైన చైనా ప్రభుత్వం ఆయనపై వెంటనే కఠిన చర్యలు చేపట్టింది. గావో బహిరంగంగా మాట్లాడకుండా నిషేధం విధించింది. ఆయన రాసిన వ్యాసాలు, సోషల్ మీడియా ఖాతాలు మరియు వీడియోలను చైనా సెన్సార్ షిప్ విభాగం తొలగించింది. ‘సెక్యూరిటీస్ అసోసియేషన్ ఆఫ్ చైనా’ ఆయనకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తూ, ప్రభుత్వ విధానాలకు సానుకూలంగా మాత్రమే ప్రచారం చేయాలని, ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది.
ప్రభుత్వ వేధింపులు అంతటితో ఆగలేదు. ఆ తర్వాత ఆయనను ‘SDIC సెక్యూరిటీస్’ ఉద్యోగం నుంచి తొలగించారు. హాంకాంగ్‌లో ఆయనకు ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ లైసెన్స్ కూడా గడువు ముగిసిపోవడంతో ఆయన ఆర్థికంగా, వృత్తిపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిణామాలన్నీ జరిగిన కొద్ది రోజులకే ఆయన అకస్మాత్తుగా అనారోగ్యంతో మరణించారని వార్త రావడం, చైనాలో ప్రభుత్వంపై నోరెత్తిన వారి గొంతును ఎలా నొక్కుతారో అనడానికి మరో ఉదాహరణగా నిలిచింది.









