
SIR : తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR )ప్రక్రియ ఈ రోజు నుంచే మొదలైంది. భవిష్యత్తులో మీరు మీ ఓటు హక్కును వాడుకోవాలంటే కచ్చితంగా ఈ ప్రక్రియలో భాగం కావాల్సిందే. అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు వారు అడిగే గుర్తింపు పత్రాలను చూపించి, మీ ఓటును కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోయినా లేదా తగిన ఆధారాలు చూపించకపోయినా మీ ఓటు లిస్టులో నుంచి తొలగించబడే ప్రమాదం ఉంది. అందుకే బూత్ లెవెల్ అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రశాంతంగా వారికి సహకరించి, వివరాలు అందజేయడం మంచిదని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,228 మంది ఓటర్ల డేటాను సరిచేసే భారీ పనిని అధికారులు చేపట్టారు. కేవలం ఓటరు కార్డు ఉండటమే కాదు.. అందులో మీ పేరు, ఫోటో, ఇంటి అడ్రస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోతారు.
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ రోజు నుండి జులై 24 వరకు అంటే నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ మెగా సర్వే సాగుతుంది. ఈ పనిలో దాదాపు 36 వేల మంది బీఎల్‌వోలు పాల్గొంటున్నారు. ప్రతి అధికారి తన పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఓటర్లకు రెండు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. వీరు ప్రతి ఇంటిని మూడు సార్లు విజిట్ చేస్తారు. హైదరాబాద్ లోని ఇళ్లలో ఈ ఫారాలు ఇంగ్లీష్‌లో, మిగిలిన అన్ని జిల్లాల్లో తెలుగులో ఇస్తారు. మీరు పూర్తి చేసిన రెండు ఫారాలలో ఒకదాన్ని బీఎల్‌వో తీసుకుంటారు, రెండోదాన్ని మీకు రసీదుగా ఇస్తారు. భవిష్యత్ అవసరాల కోసం ఆ రసీదును జాగ్రత్తగా దాచుకోవాలి.
మీరు ఉద్యోగాలు, ఆఫీసు పనుల వల్ల బిజీగా ఉండి.. బీఎల్‌వోల కోసం ఇంట్లో ఎదురుచూసే టైం లేకపోతే, మీకోసం ఎన్నికల సంఘం ఒక ఈజీ ఆప్షన్ తెచ్చింది. మీరు నేరుగా http://voters.eci.gov.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనే మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్, ఓటరు కార్డు నెంబర్ ఉపయోగించి ఇందులో లాగిన్ అవ్వాలి. మీ ఓటరు కార్డులోని వివరాలు, ప్రభుత్వ గుర్తింపు కార్డులోని వివరాలు సరిపోలితేనే ఈ డిజిటల్ సదుపాయం పనిచేస్తుంది. మొబైల్‌లోనే పని ముగించుకునే ఈ స్మార్ట్ పద్ధతిని వీలైనంత ఎక్కువ మంది వాడుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Also Read : నల్లగొండ నలుగురి హత్య…కన్నకూతురే కర్కోటకురాలు?
1950 టోల్‌ఫ్రీ నెంబర్
చాలా మంది ఓటర్లకు వచ్చే పెద్ద డౌట్ ఇదే. బీఎల్‌వోలు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఓటు ఆ ఇంటి నెంబర్‌కు మ్యాపింగ్ అయిందా లేదా అన్ మ్యాపింగ్ అయిందా అనే లిస్ట్ వారి దగ్గర ఉంటుంది. ఒకవేళ మీ వివరాలు తప్పుగా ఉన్నా లేదా మీరు ఇల్లు మారినా.. ఆ ఫారాలు ఎలా నింపాలో బీఎల్‌వోలు మీకు వివరంగా చెబుతారు. ఒకవేళ మీ ఇంటికి బీఎల్‌వో రాకపోయినా, లేదా మీకు ఏదైనా సందేహం ఉన్నా వెంటనే 1950 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
Also Read : కాంట్రవర్సీలతోనే కాసుల వర్షం: ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ ద్వారా లక్షలు ఆర్జిస్తున్న విష్ణుప్రియ..









