Crime News : నల్లగొండ  పట్టణాన్ని తీవ్రంగా కుదిపేసిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. తొలుత ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో సాగిన పోలీసుల దర్యాప్తులో.. ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన ఘోరమైన “సుపారీ హత్య”గా తేలింది. సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో ఈనెల 22న (శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత) జరిగిన ఈ దారుణ ఉదంతం వెనుక ఉన్న భయానక నిజాలు వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ కిరాతక దాడిలో నల్లగొండలోని ప్రకాశం బజారులో బ్యాగుల వ్యాపారం చేసే మహ్మద్‌ సుల్తాన్‌ (45), స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అతని భార్య హసీనా (40), ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కుమారుడు మహ్మద్ ముజమ్మిల్ (20), ఏడో తరగతి చదువుతున్న కుమార్తె అక్సరా అలియాస్ అప్సరా (11) దారుణంగా హత్యకు గురయ్యారు. దాదాపు మూడు రోజుల పాటు మృతదేహాలు ఇట్లోనే ఉండిపోవడంతో అవి కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి.

పోలీసుల లోతైన దర్యాప్తులో హత్యకు గల అసలు కారణం ఆస్తి తగాదాలేనని నిర్ధారణ అయింది. మృతురాలు హసీనాకు గతంలో రెండు వివాహాలు జరగ్గా.. నల్లగొండకు చెందిన మహ్మద్ సుల్తాన్‌ను ఆమె మూడో వివాహం చేసుకుంది. సుల్తాన్‌కు కూడా గతంలో రెండు పెళ్లిళ్లు కాగా.. మొదటి భార్య మరణించడంతో హసీనాతో రెండో వివాహం జరిగింది. ప్రస్తుత పిల్లలిద్దరూ (ముజమ్మిల్, అక్సరా) సుల్తాన్ మొదటి భార్య పిల్లలే. ప్రస్తుతం హసీనా పేరు మీద దాదాపు కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇండ్లు ఉన్నాయి.

హసీనా పేరుపై ఉన్న ఆస్తులను తన మూడో భర్త పిల్లలైన ముజమ్మిల్, అక్సరాల పేరిట వీలునామా రాస్తున్నట్లు ఆమె ప్రకటించింది. ఈ విషయం హసీనా మొదటి భర్త కూతురైన బుషా బుటానీకి తెలిసింది. కోటి రూపాయల విలువైన ఆస్తితో పాటు బంగారం తమకు దక్కకుండా పోతుందనే కక్షతో.. కన్నతల్లి హసీనా కుటుంబాన్ని పూర్తిగా మట్టుబెట్టాలని బుషా బుటానీ, ఆమె భర్త (అల్లుడు) కలిసి అత్యంత క్రూరమైన స్కెచ్ వేశారు.

హైదరాబాద్‌కు చెందిన ఒక ఆటో డ్రైవర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న బుషా బుటానీ.. ఈ హత్యల కోసం హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఒక ప్రమాదకరమైన సుపారీ గ్యాంగ్‌ను ఆశ్రయించింది. భారీ మొత్తంలో డబ్బులు ఆశజూపి పాతబస్తీ రౌడీషీటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం ప్రకారం.. హసీనా కుటుంబ సభ్యుల కదలికలు, ఇంటి లోపలికి వెళ్లే మార్గాలను గమనిస్తూ నిందితులు కొన్ని రోజుల ముందే ఆ ప్రాంతంలో పక్కాగా “రెక్కీ” నిర్వహించారు.

పథకం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత సుపారీ గ్యాంగ్ రంగంలోకి దిగింది. నిందితులు తెలంగాణ కాలనీలోని సుల్తాన్ ఇంటి తలుపు తట్టి, హసీనాను బయటకు రప్పించారు. ఆమె తలుపు తీసిన వెంటనే పదునైన ఆయుధాలు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ సమయంలో ఆమెను కాపాడేందుకు అడ్డువచ్చిన కుమారుడు ముజమ్మిల్‌పై మరింత కిరాతకంగా దాడి చేసి, గొంతు కోసి హతమార్చారు.

ఇంట్లో జరుగుతున్న అలజడికి మేల్కొన్న సుల్తాన్‌పై కూడా దుండగులు మారణాయుధాలతో విరుచుకుపడి అక్కడికక్కడే నరికి చంపారు. ఆ సమయంలో తీవ్ర భయాందోళనలకు గురైన 11 ఏళ్ల చిన్నారి అక్సరా ప్రాణాలు కాపాడుకోవడానికి బెడ్ కింద దాక్కుంది. అయినప్పటికీ కనికరం లేని ఆ రాక్షసులు చిన్నారిని బయటకు లాగి, తలను గోడకేసి బలంగా బాది, ఆపై కత్తులతో పొడిచి అత్యంత అమానుషంగా ప్రాణాలు తీశారు.

ఈ ఘాతుకం ఎంత క్రూరంగా జరిగిందో ఫోరెన్సిక్ ,పోస్టుమార్టం నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిందితులు విచక్షణా రహితంగా జరిపిన దాడిలో సుల్తాన్ మృతదేహంపై 6 చోట్ల, హసీనా శరీరంపై 7 చోట్ల, చిన్నారి అక్సరకు 9 చోట్ల కత్తిగాయాలు కాగా.. తమను ఎదురించిన కుమారుడు ముజమ్మిల్ శరీరంపై ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఘటనా స్థలంలో ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించకపోయినప్పటికీ, పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలు, స్థానిక సీసీటీవీ ఫుటేజీలు, మృతుల , అనుమానితుల కాల్ డేటా, ఫోన్ లొకేషన్ల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును ఛేదించారు. ఈ ఘోర కుట్రలో సుపారీ గ్యాంగ్, ప్రధాన సూత్రధారులతో కలిపి మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నట్లు గుర్తించారు.

ప్రస్తుతం ప్రధాన నిందితురాలైన కూతురు బుషా బుటానీ, ఆమె భర్తతో పాటు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఆరుగురు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల్లో సోదాలు ముమ్మరం చేశారు. ఈ సుపారీ వ్యవహారం వెనుక ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోందని, పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.