
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు ‘లిమిట్లెస్ డెలివరీ’ (Limitless Delivery) పేరుతో సరికొత్త సేవను ప్రారంభించింది. దీని సహాయంతో కస్టమర్లు ఏకంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెస్టారెంట్ల నుండి కూడా తమకు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు జొమాటో యాప్‌లో వినియోగదారులు.. తమ డెలివరీ అడ్రస్‌కు దగ్గరగా ఉన్న రెస్టారెంట్లను మాత్రమే చూడగలిగేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ ‘లిమిట్లెస్ డెలివరీ’ ఫీచర్ రాకతో ఆ సమస్యకు చెక్ పడింది.
ఇకపై దూరంతో సంబంధం లేకుండా నగరంలోని ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్న తమ ఫేవరెట్ రెస్టారెంట్ల నుండి ఫుడ్‌ను ఇంటి వద్దకే తెప్పించుకొని తినవచ్చు.
ఎలా ఉపయోగించుకోవాలి?
ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించడం చాలా ఈజీ. దీనికోసం జొమాటో తన యాప్ హోమ్ స్క్రీన్‌లోని Explore More విభాగంలో ఒక స్పెషల్ క్విక్ లింక్‌ను అందించింది. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే.. ఈ సేవ కింద అందుబాటులో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ల లిస్ట్ కనిపిస్తుంది. అక్కడి నుండి నేరుగా నచ్చిన రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే యాప్‌లోని సెర్చ్ బార్లో సెర్చ్ చేసి ఇష్టమైన రెస్టారెంట్ నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు.
ప్రస్తుతం జొమాటో ఈ సేవను దేశంలోని ఏడు నగరాల్లో మాత్రమే ప్రారంభించింది. అందులో హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పూణే నగరాల్లో ఈ సేవ అందుబాటులో ఉంది. అయితే 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెస్టారెంట్ల నుండి ఆర్డర్ చేసినప్పుడు ఎక్స్ట్రా డెలివరీ ఛార్జీలు ఉంటాయా లేదా అనే దాని గురించి జొమాటో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఆహారాన్ని డెలివరీ చేయడానికి ఎంత సమయం పడుతుందనే వివరాలను కూడా కంపెనీ వెల్లడించలేదు.









