
Hyderabad : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(బన్నీ) మామపై క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది. భూ కబ్జా కేసులో కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ప్రధాన పాత్రధారి అని బాధితులు ఆరోపించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐటీ కంపెనీలు కొలువైన తమ భవనంలోనికి చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన మనుషులు అక్రమంగా ప్రవేశించారని మంత్రి కాస్మోస్ భవనం ఓనర్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అక్రమంగా ప్రవేశించడమే కాకుండా కబ్జాకు యత్నించారని ఆరోపించారు. చంద్రశేఖర్‌రెడ్డి మనుషులు వస్తూనే విధ్వంసానికి పాల్పడ్డారని, భవనం ఆవరణలో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ భవనంలో వివిధ ఆఫీసుల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు నిందితుల చర్యలతో భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు. విధ్వంసంతో ఆగకుండా భవనం బయట ఉన్న స్థలంలో రేకుల షీట్లు పాతి కబ్జాకు ప్రయత్నించారని ఆరోపించారు. భవనంలో నిందితులు పాల్పడిన చర్యలకు సంబంధించిన సీసీకెమెరా ఫుటేజిని కూడా బాధితులు పోలీసులకు ఇచ్చారు. దీంతో బన్నీ మామా చంద్రశేఖర్‌రెడ్డితో సహా ఆయన అనుచరులపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Also Read : వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి.. పూజారి మృతి!
గచ్చిబౌలిలోని ప్రముఖ ఐటీ భవనం ‘మంత్రి కాస్మోస్’ ప్రాంగణంలోకి కొందరు అపరిచిత వ్యక్తులు అక్రమంగా చొరబడి విధ్వంసానికి పాల్పడటంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నానక్‌రామ్‌గూడ సర్వే నెంబర్ 130లో ఉన్న ‘మంత్రి కాస్మోస్’ భవనంలో గత 11 ఏళ్లుగా పలు అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు ఇక్కడ ఐటీ సేవలు అందిస్తున్నాయి. సుమారు 5,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈనెల 13న ఉదయం మురళీధర్ రెడ్డి, గడ్డం రవిల నేతృత్వంలో వచ్చిన ఒక గుంపు హీరో అల్లుఅర్జున్ మామా కె.చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని భవనం నైరుతి మూల గేటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించింది. కాంపౌండ్ గోడ లోపలి నిర్మాణాలను ధ్వంసం చేసి, ఒక వాహనంలో తెచ్చిన రేకులను (టిన్ షీట్లు) పాతి స్థలాన్ని ఆక్రమించేందుకు వారు యత్నించారు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిని తోసివేసి చంపేస్తామని బెదిరింపులకు దిగారు. సమాచారం అందుకున్న నిర్వహణ ఏజెన్సీ ప్రతినిధి రవీందర్ నాయక్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆక్రమణదారులను నిలదీశారు. ఈ వ్యవహారం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వగా సంబంధిత ఫుటేజీని పోలీసులకు అందించినట్టు తెలిపారు. ఈ ఘటనపై మంత్రి కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ మేనేజర్ రవిరెడ్డి రాజు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పెద్దిరాజులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 329(3), 324(2), 351(2) రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, మంత్రి కాస్మోస్ యాజమాన్యానికి చెందిన 1.0504 హెక్టార్ల భూమిని ఆక్రమించేందుకు కబ్జాదారులు ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు భవన అత్యవసర సేవలకు తీవ్ర విఘాతం కలిగించేలా వ్యవహారించారని, విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు, వ్యర్థాల నిర్వహణ షెడ్‌తోపాటు వాటర్ ట్యాంకర్లు, చెత్త వాహనాలు, అత్యవసర సమయాల్లో వినియోగించే ఫైరింజన్లు వెళ్లేందుకు కీలకమైన మార్గాన్ని బ్లాక్ చేశారని బాధితులు ఆక్షేపించారు. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలలో సుమారు ఐదు వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారని, అత్యవసర మార్గాన్ని ఆక్రమించడం వల్ల భద్రతకు ముప్పు వాటిటిల్లుతుందని ఉద్యోగులు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారని వారు పేర్కొన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి విషయంలో గతంలోనూ చంద్రశేఖర్ రెడ్డి వార్తల్లో నిలిచారు. తాను ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపైనే ఆయన హైకోర్టుకు వెళ్లారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటిని కూల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులకు సిద్ధం కాగా విస్తరణలో తన ఇంటిని కూల్చొద్దని విజ్ఞప్తి చేశారు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాల విషయంపై జీహెచ్ఎంసీ అధికారులు మరోసారి ఆలోచన చేయాలని కోరారు. తాను గత 25 ఏండ్లుగా అక్కడ నివాసం ఉంటున్నానని, ఒక్కసారిగా ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజా కబ్జా వ్యవహారంలో చంద్రశేఖర్‌రెడ్డి పేరు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.
Also Read : అమెరికాలో దారుణం.. భారత సంతతి మహిళను కాల్చిచంపిన మరో ఇండియన్









