
Nalgonda : వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గణపతి పూజలు నిర్వహిస్తున్న ఓ పూజారి.. మండపం దగ్గరే అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. అంతకుముందు పూజలు ఎక్కడ నిర్వహించాలనే విషయంలో కొందరితో గొడవ జరగడం, ఆ తర్వాతే పూజారి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం చింతలపాలెంలో ఈ ఘటన జరిగింది. నాగార్జునసాగర్‌కు చెందిన పూజారి ఉప్పల దత్తు ప్రసాద్ సోమవారం చింతలపాలెంలోని రామాలయం సమీపంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన గుండాల రవి, పున్నయ్య అక్కడికి వచ్చి పూజలను అడ్డుకున్నారు. ముందుగా తమ మండపం దగ్గర పూజలు నిర్వహించాలని పూజారితో గొడవకు దిగారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తర్వాత గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని పూజారికి నచ్చజెప్పారు. అనంతరం దత్తు ప్రసాద్‌ను గుండాల రవి గణేశ్ మండపం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పూజారి గణపతి పూజలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా స్పృహ తప్పి కిందపడిపోయారు. వెంటనే స్థానికులు ఆయన్ను సాగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దత్తు ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై దత్తు ప్రసాద్ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూజారి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పూజలు నిర్వహించే విషయంలో జరిగిన గొడవకు, పూజారి మృతికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.









