Private Hostels : హైదరాబాద్‌ నగరంలో బతకడానికి వచ్చినవారికి, ఉద్యోగస్తులకు, బ్యాచిలర్స్‌కు ఉండడానికి వసతి కల్పిస్తున్నాయి ప్రైవేట్‌ హాస్టల్స్. అయితే వారి అవసరాన్ని ఆసరా తీసుకుని పలు హాస్టళ్ల నిర్వహకులు పెద్ద మొత్తంలో ఫీజూ తీసుకుంటున్నప్పటికీ సరైన వసతులు కల్పించడం లేదన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు కాసుల కక్కుర్తితో రక్షణ లేని గదుల్లో హాస్టల్స్ నిర్వహిస్తూ మనుషుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారనే అపవాదు ఉండనే ఉంది. అనుమతి లేని భవనాల్లో, కాలపరిమితి దాటిన లేదా నిర్మాణపరంగా బలహీనంగా ఉన్న భవనాల్లో హాస్టళ్ల నిర్వహిస్తూ పలువురి ప్రాణాలు తీస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు హాస్టల్స్ పై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఇటీవల గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో అనుమతి లేని హాస్టల్‌ భవనం కూలి ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ప్రమాదకరంగా ఉన్న ఆరు భవనాలను హైడ్రా తొలగించింది. కేవలం 50 గజాల స్థలంలో ఏడు అంతస్తుల భవనాల నిర్మాణం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయ. ఈ తరుణంలో హైడ్రా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా హాస్టళ్ల కోసం భవనాలను అద్దెకు ఇచ్చిన యజమానులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ హాస్టళ్ల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటించేందుకు నిర్వాహకులకు 3 నెలల పాటు గడువు ఇస్తున్నట్లుగా కమిషనర్ వెల్లడించారు. జనవరి నుంచి హాస్టల్స్‌లో విస్తృత తనిఖీలు చేపట్టి సౌకర్యాలు లేని హాస్టల్స్‌ను మూసివేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

Also Read : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కేటీఆర్‌, హరీశ్‌రావులపై లైంగిక వేధింపుల కేసు

పురాతన భవనాలు : నగరంలోని పలు ప్రాంతాల్లో అనేక ఏండ్ల నుంచి హాస్టల్స్‌ నిర్వహిస్తున్న వారున్నారు. అయితే పాత భవనాలకు రంగులు అద్దుతూ చిన్నచిన్న మరమత్తులు చేస్తూ వాటిని తిరిగి ఉపయోగిస్తున్న భవనాలు అనేకం ఉన్నాయి. ఆ భవనాల కాలపరిమితి ముగిసినప్పటికీ వాటిని తొలగించకుండా యువత ప్రాణాలతో చలగాటం ఆడుతున్న నిర్వహాకులు చాలా మందే ఉన్నారు. అలాంటి ప్రమాదకర భవనాలు నగరంలో అనేకం దర్శన మిస్తాయి. అంతేకాదు ఇరుకు దారులు, ఇరుకు గదులు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేని భవనాలు నగరంలో కోకొల్లలుగా ఉన్నాయి.

భవనం నిర్మాణ పటిష్టత : హాస్టల్స్‌ నిర్వహకులు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబంధిత అధికారులు ఆ భవనాన్ని సందర్శించి అన్ని సరిగా ఉన్నపుడే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, వారు అవేం చేయడం లేదు. సదరు నిర్వహకులు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి కాగితాలమీదే అనుమతి ఇచ్చేస్తున్నారు. అవి పటిష్టమైన భవనాలా కాదా, అన్ని అనుమతులు ఉన్నాయా లేవా? అనేది పట్టించుకోవడం లేదు. ప్రమాదకరంగా ఉన్న భవనాల్లో హాస్టళ్లు నిర్వహిస్తున్నట్లయితే ఆ హాస్టల్స్‌ను వెంటనే సురక్షితమైన భవనాలకు తరలించాలని హైడ్రా అధికారులు ఆదేశించారు. సంబంధిత అధికారులు భవనం నిర్మాణ పటిష్టతను పరిశీలించిన తర్వాతే హాస్టల్ నిర్వహణకు అనుమతించాలని హైడ్రా స్పష్టం చేసింది.

ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ : ఇటీవల జరిగిన పలు అగ్ని ప్రమాద సంఘటనలు చూస్తే ఆయా భవనాల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేవన్నది స్పష్టం. అందుకే హాస్టల్స్‌ నిర్వహించే భవనాల్లో అగ్ని ప్రమాదం వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు విద్యార్థులు సులభంగా బయటపడేలా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను ఏర్పాటు చేయాలని, హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే తగిన పార్కింగ్ సౌకర్యం కూడా ఉండాలని పేర్కొన్నారు.

డబ్బుకోసం పణంగా ప్రాణాలు: హాస్టల్స్‌లో ఉండేవారు సైతం తక్కువ ఫీజులు ఉన్నాయనే ఉద్దేశంతో నిబంధనలు లేని హాస్టల్స్‌లో చేరవద్దని అధికారులు సూచిస్తున్నారు. తక్కువ ఫీజుల కోసం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టొద్దని హైడ్రా హాస్టల్ నిర్వాహకులకు సూచించింది. డబ్బు కోసం భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టకూడదని వారిని హెచ్చరించింది. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారించడమే తమ లక్ష్యమని హైడ్రా స్పష్టం చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకర భవనాల్లో హాస్టళ్లు నడిపేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read : గణేశ్‌ విగ్రహం పెడుతున్నారా? ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరి.. ఇలా చేయండి…

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.