
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ నియామకాలకు సిద్ధమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 11 వేల నుంచి 12 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు SBI చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. క్లరికల్, ఆఫీసర్ స్థాయిల్లో ఈ నియామకాలు ఉండనున్నాయి.
ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 2.45 లక్షలకు పైగా ఉందని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో SBI ఏకంగా 25,633 మందిని నియమించింది. ఇందులో 4,640 మంది అధికారులు, 19,340 మంది అసోసియేట్లు, 1,653 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఐటీ విభాగంలో ఎక్కువ నియామకాలు అవసరం లేదని చైర్మన్ తెలిపారు.
Also Read : ఢిల్లీలో దారుణం.. చూస్తుండగానే కుప్పకూలిన భవనం!
ఉద్యోగాల భర్తీతో పాటు బ్యాంక్ కొత్త బ్రాంచ్‌లను కూడా పెంచాలని చూస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 200 నుంచి 250 కొత్త బ్రాంచ్‌లను నెట్‌వర్క్‌లో చేర్చాలని SBI లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త కాలనీలు, వ్యాపార ప్రాంతాల్లో బ్యాంకు సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని చైర్మన్ చెప్పారు.
ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదిత ఐపీఓలో SBI గ్రూప్ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించనుంది. SBI 0.65 శాతం, SBI క్యాపిటల్ మార్కెట్స్ 0.35 శాతం వరకు వాటాను విక్రయించే అవకాశం ఉంది. అంటే మొత్తం కలిపి దాదాపు 1 శాతం వాటాను విక్రయించనున్నారు. NSEలో SBIకి ప్రస్తుతం 3.23 శాతం, SBI క్యాపిటల్ మార్కెట్స్‌కు 4.33 శాతం వాటా ఉంది.
NSE ఐపీఓ విలువ దాదాపు రూ.30 వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఇది వస్తే దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇతర SBI అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయించే ఆలోచన లేదని చైర్మన్ స్పష్టం చేశారు. మొత్తంగా ఉద్యోగాల భర్తీ, కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటు ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించేందుకు SBI సిద్ధమవుతోంది.
Also Read : ఇండియా GDP అసలు నిజం ఏంటి?









