BCCI : వయసు విషయంలో తప్పుడు వివరాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో బెంగాల్‌ లెగ్‌ స్పిన్నర్‌ రోహిత్‌ యాదవ్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది. ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టుతో జరగబోయే సిరీస్‌కు భారత అండర్‌-19 జట్టులో ఎంపికైన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది. యూపీకి చెందిన రోహిత్‌ యాదవ్‌ ఇటీవల జూలైలో భారత అండర్‌-19 జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. అక్కడ ఆరు వికెట్లు తీసి, చివరి టెస్ట్‌లో భారత్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు రోహిత్‌పై రెండేళ్ల నిషేధం విధించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నెలలో రాజ్‌కోట్‌, అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టుతో జరిగే వన్డేలు, మల్టీ-డే మ్యాచ్‌లకు కూడా అతను ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు ఆ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లేదు.

Also Read : జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం!

అతని ఆధార్‌ వివరాల్లో కూడా తేడాలు కనిపించాయి. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం వద్ద రిజిస్టర్‌ చేసినప్పుడు పుట్టిన సంవత్సరం 2007గా ఉంది. ఆ తర్వాత 2017, 2020లో ఆధార్‌ వివరాలను మార్చినప్పుడు 2006గా నమోదైంది. 2021లో మళ్లీ 2009గా మార్చినట్లు గుర్తించారు. ఈ తేడాలను ముందే గుర్తించిన బెంగాల్‌ క్రికెట్‌ సంఘం రోహిత్‌ను తమ జూనియర్‌ జట్లకు దూరంగా పెట్టింది. ఆ తర్వాత ఈ విషయం బీసీసీఐకి కూడా తెలిపింది. ఇప్పుడు బీసీసీఐ రోహిత్‌ దేశవాళీ క్రికెట్‌లో రెండేళ్ల పాటు ఆడకుండా నిషేధించింది. ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు కూడా తెలియజేసింది.

రోహిత్‌ ఒక్కరిపైనే కాదు.. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం మొత్తం 62 మంది ఆటగాళ్ల పత్రాలు, వయసు వివరాలను పరిశీలించింది. వివరాల్లో తేడాలు ఉన్న 62 మందిని 2026-27, 2027-28 సీజన్లలో ఏ టోర్నమెంట్‌లోనూ రిజిస్టర్‌ చేసుకోవడానికి లేదా బదిలీ చేయడానికి అనర్హులుగా ప్రకటించింది. ఈ జాబితాలో భారత అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన రవి కుమార్‌ కూడా ఉన్నాడు. అలాగే మూడు ఫస్ట్‌ క్లాస్‌, రెండు లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడిన లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ విశాల్‌ భట్టి కూడా ఉన్నాడు. 2022లో భారత్‌ అండర్‌-19 ప్రపంచకప్‌ గెలవడంలో రవి కుమార్‌ కీలకంగా ఉన్నాడు. అయితే బెంగాల్‌ క్రికెట్‌ సంఘం రికార్డుల్లో అతని వయసుకు సంబంధించి 45 నెలల తేడా ఉన్నట్లు గుర్తించారు.

Also Read : రాత్రి మిగిలిన రైస్ ఉదయాన్నే వేడి చేసి తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. మీరు హాస్పిటల్ బెడ్ రెడీ చేసుకున్నట్లే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.