Donald Trump:  అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల కోసం ట్రంప్ ప్రభుత్వం కఠినమైన కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు తమ డిగ్రీ పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండటానికి వీలుండేది, కానీ ఇకపై గరిష్టంగా నాలుగు ఏళ్లు మాత్రమే ఉండేలా నిబంధనలు మార్చారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే, ప్రత్యేకంగా ఫెడరల్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, యూనివర్సిటీలు లేదా కాలేజీలు మార్చుకోవడానికి ప్రోగ్రామ్స్ మార్చుకోవడానికి కూడా ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నారు. ఇంతకుముందు వీసా గడువును పొడిగించే అధికారం విద్యాసంస్థలకే ఉండేది, కానీ ఇకపై ఆ అధికారం వారికి ఉండదు. ఈ నిబంధనలు సెప్టెంబర్ నుండి అమలులోకి వస్తాయి.

ఈ కొత్త నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం గురించి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వివరిస్తూ, వీసా నిబంధనలను దుర్వినియోగం చేయకుండా అరికట్టడానికి, జాతీయ భద్రతను పటిష్టం చేయడానికి ఈ మార్పులు అవసరమని పేర్కొంది. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా విదేశీ విద్యార్థులు నిరవధికంగా అమెరికాలో ఉంటూ, తమ వీసా గడువును పెంచుకోవడానికి అనవసరంగా కోర్సుల్లో చేరుతూ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

Also Read : ఆ జలసంధి క్లోజ్.. ఆకాశాన్ని తాకనున్న పెట్రోల్ ధరలు.. పాకిస్థాన్‌కు బిగ్ షాక్!

సాధారణంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు నాలుగు ఏళ్లలో పూర్తవుతాయి, కానీ డాక్టరేట్ వంటి పీజీ స్థాయి కోర్సులకు ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా సైన్స్ , టెక్నాలజీ విభాగాల్లో పరిశోధనలు చేసే వారికి చదువు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే, పరిశోధనలకు నిధులు తగ్గడం లేదా వ్యక్తిగత కారణాల వల్ల కూడా చదువు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాంటి వారికి ఈ కొత్త నిబంధనలు ఇబ్బందికరంగా మారనున్నాయి. అంతేకాకుండా, చదువు పూర్తయిన తర్వాత అమెరికా వదిలి వెళ్లడానికి లేదా వేరే వీసాకు మారడానికి గతంలో ఉన్న 60 రోజుల గడువును 30 రోజులకు తగ్గించారు.

ఈ కొత్త నిబంధనలపై విద్యాసంస్థలు, అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం అనవసరమని, ఇది అంతర్జాతీయ విద్యార్థులలో అనిశ్చితిని, భయాన్ని పెంచుతుందని నాఫ్సా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫాంటా ఆవ్ విమర్శించారు. ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించాలని, ఇమ్మిగ్రేషన్‌పై ఆంక్షలు విధించాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. కొన్ని ప్రముఖ కాలేజీల్లో విదేశీ విద్యార్థులపై పరిమితులు విధించాలని, అలాగే అమెరికా విదేశాంగ విధానాన్ని విమర్శించే విద్యార్థుల వీసాలను రద్దు చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.

Also Read : బలూచిస్తాన్‌లో పాక్ సైన్యంపై బీఎల్ఏ భారీ దాడి: 45 మంది సైనికులు మృతి

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.