POK : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో స్థానిక ప్రజల తిరుగుబాటు ఉధృత రూపం దాల్చింది. పాక్ ఆర్మీ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా అక్కడి అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జనం రోడ్లపైకి వస్తుండటంతో.. వారిని అణచివేయడం పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి తలకు మించిన భారంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రజా విప్లవాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాక్ ప్రభుత్వ రహస్య పత్రం అక్కడి దారుణ పరిస్థితులను బట్టబయలు చేసింది. పీఓకే హోం శాఖ ఇస్లామాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వానికి అత్యవసరంగా రక్షణ పంపాలంటూ లేఖ రాసింది. ఈ లేఖ ప్రకారం.. పీఓకేలో తక్షణమే 4 వేల మంది అదనపు ఫెడరల్ కాన్‌స్టేబులరీ జవాన్లను, అలాగే పాకిస్తాన్ రేంజర్స్‌కు చెందిన 7 పూర్తి వింగులను రంగంలోకి దించాలని కోరింది.

Also Read : ఇరాన్‌ను బాంబులతో లేపేయండి… ట్రంప్ సంచలన ఆదేశాలు!

అయితే ఈ అభ్యర్థనలో అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. రాబోయే ఈ బలగాల్లో సగం మందిని అధునాతన ఆయుధాలు, భారీ మందుగుండు సామగ్రితో నేరుగా యుద్ధానికి వచ్చినట్టు రావాలని ఆదేశించారు. మిగిలిన సగం మందిని అల్లర్లను అణచివేసే యాంటీ-రైట్ గేర్‌తో సిద్ధంగా ఉండమని కోరారు. అంటే ఈ ప్రజా ఉద్యమాన్ని తుపాకులు, బాంబులతో పూర్తిగా తొక్కేయాలని పాక్ ఆర్మీ ప్లాన్ చేస్తోంది.

జులై 8, 2026 నాటి ఈ లీకైన డాక్యుమెంట్‌లో.. అవామీ యాక్షన్ కమిటీ చేస్తున్న ఆందోళనల వల్ల తాము తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని పాక్ యంత్రాంగం స్వయంగా ఒప్పుకుంది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు నలుగురు పాక్ భద్రతా సిబ్బంది చనిపోగా, 174 మంది తీవ్రంగా గాయపడ్డారని, పీఓకేలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిందని ఆ కాగితంలో పేర్కొన్నారు.

మరోవైపు, పీఓకే స్థానిక పోలీసులకు, పాకిస్తాన్ కేంద్ర భద్రతా సంస్థ అయిన పాకిస్తాన్ రేంజర్స్‌కు మధ్య గొడవలు మొదలయ్యాయి. స్థానిక నిరసనకారులపై విరుచుకుపడాలంటూ పాక్ రేంజర్స్ ఇస్తున్న ఆదేశాలను పీఓకే పోలీసులు ఇక్కడి స్థానికులపై ఉన్న ప్రేమతో తిరస్కరిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య నమ్మకం పూర్తిగా దెబ్బతినడం, సంయుక్త ఆపరేషన్ల సమయంలో ఒకరితో ఒకరు గొడవ పడుతుండటం పాక్ ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

Also Read : ఖర్చు లేకుండా కరెంట్ తయారీ.. జపాన్ అద్భుతం.. ఎలాగో తెలుసా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.