క్లీన్ ఎనర్జీ కోసం జపాన్ సరికొత్త సాంకేతికతతో అద్భుతాన్ని ఆవిష్కరించింది. పారవేసే మురుగునీరు, సముద్రపు ఉప్పునీటిని కలిపి పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా విద్యుత్తును ఉత్పత్తి చేసే సరికొత్త విధానాన్ని విజయవంతంగా ప్రారంభించింది. జపాన్‌లోని ఫుకుయోకా నగరంలో ఉన్న మామిజుపియా సముద్రపు నీటి శుద్ధి కేంద్రంలో దేశంలోనే మొట్టమొదటి ఆస్మోటిక్ పవర్ ప్లాంట్ నడుస్తోంది. డెన్మార్క్ తర్వాత ప్రపంచంలోనే ఈ తరహా సదుపాయం ఉన్న రెండో ప్లాంట్ ఇదే.

Also Read : భారత్‌లో ఐరన్ డోమ్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రం: ఇజ్రాయెల్ రక్షణ సంస్థ ‘రాఫెల్’ చర్చలు!

అసలు ఈ బ్లూ ఎనర్జీ ఏంటంటే?

సాధారణంగా నదుల ద్వారా వచ్చే మంచినీరు సముద్రంలో కలిసే ప్రతిచోటా ఒక రకమైన శక్తి నిశ్శబ్దంగా ప్రకృతిలో కలిసిపోతుంది. మంచినీరు, ఉప్పునీరు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఉష్ణగతిక సూత్రం ప్రకారం ‘స్వేచ్ఛా శక్తి’ విడుదలవుతుంది. రెండు రకాల నీళ్ల మధ్య ఉండే లవణీయత, వ్యత్యాసం ఆధారంగా పుట్టే ఈ శక్తిని శాస్త్రవేత్తలు లవణీయత ప్రవణత శక్తి లేదా సరళంగా నీలి శక్తి (Blue Energy) అని పిలుస్తారు. బ్యాటరీలు పనిచేసే సూత్రం ఆధారంగానే ఇది కూడా పనిచేస్తుంది.

మొక్కల వేర్లు నేల నుండి నీటిని ఎలాగైతే పీల్చుకుని, మన శరీరంలోని కణాలు ఎలా తేమగా ఉంటాయో.. అదే ద్రవాభిసరణ ప్రక్రియ ఆధారంగా ఈ ప్లాంట్ పనిచేస్తుంది. ఇక్కడ మంచినీటిని, ఉప్పునీటిని ఒక ప్లాస్టిక్ లాంటి అర్ధపారగమ్య పొరకు ఇరువైపులా ఉంచుతారు. ఈ పొర కేవలం నీటి అణువులను మాత్రమే తన గుండా రానించి.. ఉప్పును నిరోధిస్తుంది. అప్పుడు సహజంగానే ఉప్పునీరు ఉన్న వైపునకు వేగంగా ప్రవహిస్తుంది.

ఈ ప్లాంట్‌లో ప్రెజర్-రిటార్డెడ్ ఆస్మోసిస్ అనే ప్రత్యేక పద్ధతిని ఉపయోగిస్తారు. నీరు పొరను దాటి ఉద్దేశపూర్వకంగా ఒత్తిడిలో ఉంచిన ఉప్పు వైపునకు వెళ్లడం వల్ల అక్కడ పీడన ప్రవాహం, ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది. ఈ పీడన నీటిని ఒక టర్బైన్ గుండా నెట్టడం ద్వారా అది జనరేటర్‌ను తిప్పుతుంది. ఇది సరిగ్గా చిన్న జలవిద్యుత్ ఆనకట్ట లాగా పనిచేస్తూ కరెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇంధనం దహనం కాదు. అలాగే కార్బన్ డయాక్సైడ్ కూడా విడుదల కాదు.

ఫుకుయోకాలోని మామిజుపియా అనేది ఒక డీశాలినేషన్ కేంద్రం. సాధారణ సముద్రపు నీటిలో 3.5 శాతం ఉప్పు ఉంటే.. ఇక్కడ శుద్ధి ప్రక్రియ తర్వాత మిగిలిపోయే గాఢమైన ఉప్పునీటిలో 8 శాతం ఉప్పు ఉంటుంది. అంటే సముద్రపు నీటి కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఉప్పు అన్నమాట. ఇక మంచినీటి కోసం వీరు సమీపంలోని మురుగునీటి శుద్ధి కేంద్రం నుండి వచ్చే నీటిని వాడుతున్నారు. రెండు నీటి మధ్య లవణాల వ్యత్యాసం ఎంత ఎక్కువగా ఉంటే.. నీటి ప్రవాహ ఒత్తిడి బలంగా ఉంటుంది. దీంతో విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.

Also Read : ఫైటర్ జెట్ల పహారాలో ఖమేనీ అంతిమయాత్ర: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ద మేఘాలు!

ఈ సాంకేతికతలో బొగ్గు, గ్యాస్‌, డీజిల్‌ వంటి ఇంధనాలు, కార్బన్ ఉద్గారాలు పూర్తిగా అసలు ఉండవు. విద్యుత్‌ ఉత్పత్తితో పాటు మురుగు నీటి నిర్వహణకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల రెండు సమస్యలకు ఒకేసారి పరిష్కారం దొరుకుతుంది. సౌర, పవన శక్తుల్లాగా ఇది వాతావరణంపై ఆధారపడదు. పగలు రాత్రి తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలూ నిరంతరాయంగా ఈ ప్లాంట్ పనిచేయగలదు.

ఏడాదికి ఈ ప్లాంట్ ద్వారా సుమారు 8,80,000 కిలోవాట్-గంటల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఇది దాదాపు 300 జపనీస్ కుటుంబాల అవసరాలను తీరుస్తుంది. అయితే దీన్ని ఇప్పుడే అందుబాటులోకి తీసుకురావడం లేదు. పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాత అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ టెక్నాలజీ కనుక అమలు చేస్తే.. ప్రపంచ విద్యుత్‌ అవసరాల్లో సుమారు 15 శాతం వరకు సమస్య తీరుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.