
Living Nostradamus : తనను తాను ‘సజీవ నోస్ట్రాడామస్’ (Living Nostradamus)గా అభివర్ణించుకునే బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ పారాసైకాలజిస్ట్ అథోస్ సలోమ్ ప్రపంచ భవిష్యత్తుపై మరోసారి తీవ్ర ఆందోళనకరమైన హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో మానవాళి తీవ్రమైన భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలను, కొత్త ప్రాంతీయ యుద్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అంచనా వేశారు. 2026 సంవత్సరానికి సంబంధించి తాను గతంలో వెలువరించిన పది ప్రధాన జోస్యాలలో ఇప్పటికే రెండు నిజమయ్యాయని ఆయన పేర్కొనడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
సలోమ్ వెల్లడించిన కథనం ప్రకారం.. గతంలో ఆయన చేసిన అంచనాల్లో ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో భారీ అస్థిరత ఏర్పడుతుందని, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకుంటాయని చెప్పిన విషయం నిజమైంది. దీనితో పాటు, ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతగా నిలిచే జట్టు జెర్సీ రంగులు అగ్నిని (ఫైర్) పోలి ఉంటాయని, ఆ రేసులో స్పెయిన్ ముందంజలో ఉంటుందని తాను ముందుగానే సరిగ్గా విశ్లేషించానని ఆయన గుర్తుచేశారు.
ప్రపంచ భద్రతకు రాబోయే అతిపెద్ద ప్రమాదాల్లో ఆర్కిటిక్ ప్రాంతం ప్రధానమైనదని సలోమ్ స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల వల్ల ఆర్కిటిక్ వలయంలో మంచు వేగంగా కరిగిపోతుండటంతో అక్కడ కొత్త నౌకా రవాణా మార్గాలు,అపారమైన సహజ ఇంధన వనరులు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ వ్యూహాత్మక ప్రాంతం,అక్కడి వనరులను ఆక్రమించుకోవడానికి రష్యా,నాటో (NATO) సభ్యదేశాల మధ్య భయంకరమైన ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్కిటిక్ వ్యూహాత్మక ప్రాంతాలపై ఆధిపత్యం సాధించేందుకు రష్యా ఇప్పటికే అక్కడ తన సరికొత్త క్షిపణి వ్యవస్థలను, సైనిక బలగాలను ముమ్మరంగా తరలిస్తోందని సలోమ్ హెచ్చరించారు. ప్రపంచ అగ్రరాజ్యాలు, నాటో బలగాలు సైతం పోటీ పడుతుండటంతో ఆర్కిటిక్ మంచు మైదానాలు త్వరలోనే రష్యా-పాశ్చాత్య దేశాల మధ్య ప్రత్యక్ష సాయుధ ఘర్షణకు (Direct Conflict) వేదికగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు.
Also Read : అమెరికాలోని విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్.. ఉద్యోగం చేయాలంటే రూ.95 లక్షల ఫీజు కట్టాల్సిందే…
కేవలం ఆర్కిటిక్ మాత్రమే గాక, ఆఫ్రికాలోని ‘సాహెల్’ (Sahel) ప్రాంతంపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉత్తర నైగర్ ప్రాంతంలో ఉగ్రవాద మూకల ప్రాబల్యం విపరీతంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. అక్కడ నుండి పాశ్చాత్య దేశాల సైనిక దళాలు వెనుదిరిగిన తర్వాత, ఆ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న పలు బలమైన దేశాల మధ్య పరోక్ష ఘర్షణలు (Proxy Wars) మొదలవుతాయని సలోమ్ అంచనా వేశారు.
ప్రపంచ భద్రతా బెదిరింపులను విశ్లేషిస్తూ, మానవాళి మూడో ప్రపంచ యుద్ధానికి అత్యంత సమీపంలో ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న వివాదాస్పద పరిస్థితులతో పాటు అమెరికా-చైనాల మధ్య నడుస్తున్న సైబర్ గూఢచర్యం (Cyber Espionage),అధునాతన ఏఐ/సాంకేతిక ఆయుధ పోటీ వంటివి ప్రపంచాన్ని ఒకేసారి సాంప్రదాయక,డిజిటల్ యుద్ధంలోకి నెట్టివేస్తాయని హెచ్చరించారు.
తాను కేవలం సాధారణ భవిష్యవేత్తను మాత్రమే కానని, శాస్త్రీయ దృక్పథం కలిగిన పారాసైకాలజిస్ట్‌నని సలోమ్ స్పష్టం చేశారు. భవిష్యత్ సంఘటనలను ముందే ఊహించడానికి తాను ప్రతీకాత్మక విశ్లేషణ (Symbolic Analysis), దీర్ఘకాలిక నమూనాల పరిశీలన (Long-term pattern recognition),పురాతన ‘కబల్లా’ (Kabbalah) అధ్యయనాలను సమగ్రంగా ఉపయోగిస్తానని చెప్పారు. అయితే ప్రపంచంలోని ఏ అంచనా పద్ధతి కూడా 100 శాతం ఖచ్చితమైనది కాదని, ఇవన్నీ కేవలం సంభవించే అవకాశాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయని ఆయన అంగీకరించారు.
గతంలో ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని, అలాగే బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మరణాన్ని కూడా సలోమ్ ముందే అంచనా వేశారని అంతర్జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం ఉంది. వర్తమాన ప్రపంచంలో పెరుగుతున్న సైబర్ దాడులు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గూఢచర్యం, క్లిష్టమైన భౌగోళిక పూరింపులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయకుండా ప్రపంచ నాయకులు ముందస్తు దౌత్య మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ఈ కథనం ద్వారా స్పష్టమవుతోంది.
Also Read : స్పెయిన్‌లోకి దూసుకొచ్చిన మొరాకో వలసదారులు.. సముద్ర మార్గం గుండా ఎంటర్









