Donald Trump : వీసా నిబంధనలను కఠినతరం చేయడంపై తీవ్రంగా దృష్టిసారించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అంతర్జాతీయ విద్యార్థులకు మరో గట్టి షాక్‌ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అనంతరం, అక్కడే ఉంటూ ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ విద్యార్థుల నుంచి ఏకంగా లక్ష డాలర్ల (సుమారు రూ.95 లక్షలు) రుసుమును వసూలు చేసే అంశాన్ని ఆయన ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో హెచ్‌1-బి వీసాలపై కూడా లక్ష డాలర్ల రుసుము విధించాలని ట్రంప్ సర్కారు ప్రతిపాదించగా, బోస్టన్‌లోని ఫెడరల్ కోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేసి బ్రేక్ వేసింది. విదేశీ ఉద్యోగులపై కంపెనీల ఆధారపడే విధానాన్ని తగ్గించి, అమెరికన్ పౌరులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది వారి ఉద్దేశం. ఆ ప్రయత్నానికి న్యాయపరమైన ఆటంకం కలగడంతో, ఇప్పుడు చదువు పూర్తయ్యాక పనిచేసే విద్యార్థుల వ్యవస్థలైన ‘ఓపీటీ’ నిబంధనలను టార్గెట్ చేస్తూ కొత్త నిబంధన తీసుకొచ్చే ప్రణాళికలు రచిస్తున్నారు.

విదేశీ విద్యార్థులు ఎఫ్‌-1 వీసాపై అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక, అదే వీసా పొడిగింపుపై 1 నుండి 3 ఏళ్ల పాటు చదువుకు సంబంధించిన రంగాల్లో పనిచేసేందుకు ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ (ఓపీటీ)’ అనుమతినిస్తుంది. సాధారణ కోర్సులకు 12 నెలలు, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) కోర్సులకు అదనంగా మరో 24 నెలల పొడిగింపు లభిస్తుంది. 2024 నాటి లెక్కల ప్రకారం అమెరికాలో దాదాపు 4.19 లక్షల మంది విదేశీయులు ఈ ఓపీటీ కిందే ఉపాధి పొందుతున్నారు.

ఓపీటీ వీసాలపై లక్ష డాలర్ల రుసుము ప్రతిపాదనను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ తెలిపింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని డీహెచ్‌ఎస్‌ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికా ఆవల ఉండి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తుల నుంచి కూడా లక్ష డాలర్ల బాండ్‌ (అమెరికా పౌరులయ్యాక తిరిగి ఇచ్చేలా) తీసుకునే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

Also Read : ప్రపంచానికి మరో పెనుముప్పు: ‘సజీవ నోస్ట్రాడామస్’ అథోస్ సలోమ్ సంచలన హెచ్చరికలు

ఒకవేళ ఈ నూతన విధివిధానాలు గనక కార్యరూపం దాల్చితే, అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత చట్టబద్ధంగా పనిచేయాలనుకునే ప్రతి విదేశీ విద్యార్థి ఈ భారీ మొత్తం సమకూర్చుకోవాల్సి వస్తుంది. అయితే ఈ లక్ష డాలర్ల భారాన్ని నేరుగా విద్యార్థులే చెల్లించాలా, వారిని ఉద్యోగంలోకి తీసుకునే యజమాన్య సంస్థలు భరించాలా లేక చదువు చెప్పిన విశ్వవిద్యాలయాలే కట్టాలా అనే విషయంపై డీహెచ్‌ఎస్‌ నుంచి ఎలాంటి స్పష్టతా లేదు.

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ‘ఓపెన్‌ డోర్స్‌’ నివేదిక ప్రకారం, 2024-2025 విద్యాసంవత్సరంలో అమెరికాలో 3.63 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు చేరగా, ప్రతీ ముగ్గురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయుడే ఉన్నట్లు తేలింది. మన దేశ విద్యార్థులలో దాదాపు 40 శాతం మంది గ్రాడ్యుయేషన్ తర్వాత తప్పనిసరిగా ఈ ఓపీటీ ప్రోగ్రామ్‌నే ఎంచుకుంటున్నారు.

అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో అధికులు భారీ విద్యా రుణాలపైనే ఆధారపడి అక్కడ అడుగుపెడుతుంటారు. ఇప్పటికే అక్కడ పెరుగుతున్న జీవన వ్యయాలు వారి బడ్జెట్‌కు తీవ్ర భారంగా మారాయి. ఇప్పుడు దానికి తోడు ఉద్యోగం చేయడానికి కూడా మరో రూ.95 లక్షల ఫీజు మోపితే, వారి అమెరికా కలలు పూర్తిగా చెదిరిపోయే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఈ కఠిన నిబంధన అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులు అమెరికాను కాదని కెనడా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి ప్రత్యామ్నాయ దేశాలను ఎంచుకునే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు. అంతేగాక, ఇన్నాళ్లూ విపరీతమైన ఆదరణ పొందిన స్టెమ్‌ (STEM) కోర్సులను ఎంచుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా బాగా తగ్గిపోతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రతిపాదన కేవలం విద్యార్థులకే కాక అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు కూడా కోలుకోలేని దెబ్బ కానుంది. విదేశీ విద్యార్థుల చెల్లించే భారీ ట్యూషన్ ఫీజులపైనే అనేక యూఎస్ యూనివర్సిటీలు ప్రధానంగా ఆధారపడతాయి. కొత్త రుసుముల భయంతో అంతర్జాతీయ ప్రవేశాలు తగ్గిపోతే, ఆయా యూనివర్సిటీల ఆదాయం క్షీణించి ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒకవేళ డీహెచ్‌ఎస్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా అమల్లోకి తెస్తే లేదా ఓపీటీ సౌకర్యాన్ని భారంగా మారిస్తే, విద్యార్థులు చదువు ముగిసిన వెంటనే అమెరికాను వీడి స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉన్న ఈ ప్రతిపాదనపై ట్రంప్ సర్కారు తుది నిర్ణయం ఏ విధంగా ఉంటుందోనని, రాబోయే రోజుల్లో ఇచ్చే అధికారిక ప్రకటన కోసం లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Also Read : స్పెయిన్‌లోకి దూసుకొచ్చిన మొరాకో వలసదారులు.. సముద్ర మార్గం గుండా ఎంటర్

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.