
Hindu Temple : పాకిస్థాన్‌లో 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఓ హిందూ ఆలయం కూల్చివేత వివాదానికి దారి తీసింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని సిరాజ్ గ్రామంలో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగానే కూల్చేశారని మైనారిటీ సంఘాలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. పక్కనే ఉన్న మదర్సా కోసం ఆలయ స్థలాన్ని ఉపయోగించుకునేందుకే ఈ పని జరిగిందని వారు చెబుతున్నారు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. భారీ వర్షాల కారణంగానే ఆలయం కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు.
లాహోర్‌కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరాజ్ గ్రామంలో ఈ ఆలయం ఉండేది. ఈ ఆలయం దాదాపు 100 నుంచి 125 ఏళ్ల నాటిదని అధికారులు చెబుతున్నారు. సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం ఆగస్టు 21న కూల్చివేయబడింది. ఘటన తర్వాత దీనిపై దర్యాప్తు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆలయాన్ని తిరిగి నిర్మించాలని డిమాండ్లు వస్తున్నాయి.
Also Read : కెనడాలో చదవాలనుకునే విద్యార్థులకు షాక్.. సెప్టెంబర్ 1 నుంచి రూల్స్ ఛేంజ్!
పాకిస్థాన్ మసీహా మిల్లత్ పార్టీ (PMMP), స్థానికులు, హిందూ సంఘాల ప్రతినిధులు మాత్రం ఆలయాన్ని కొందరు మతపరమైన తీవ్రవాద భావాలు ఉన్న వ్యక్తులు కావాలనే కూల్చివేశారని ఆరోపిస్తున్నారు. ఆలయం ఉన్న స్థలాన్ని సమీపంలోని మదర్సాకు సంబంధించిన కార్యకలాపాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం జరిగిందని వారు చెబుతున్నారు.
అయితే హిందూ సంఘాల ఆరోపణలకు పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతున్న కారణం పూర్తిగా భిన్నంగా ఉంది. భారీ వర్షాల కారణంగానే పురాతన ఆలయ నిర్మాణం కూలిపోయిందని ETPB సీనియర్ అధికారి రానా ఇఫ్తిఖార్ తెలిపారు. అయితే ఆలయం 100 నుంచి 125 ఏళ్లకు పైగా పాతదేనని ఆయన కూడా ధృవీకరించారు. తమ రికార్డుల్లో ఆలయానికి ప్రత్యేకమైన పేరు నమోదు కాలేదని, కానీ అది చాలా పురాతనమైన ఆలయమని చెప్పారు.
ఆలయానికి పక్కన ఉన్న భూమిని సెమినరీ ఏర్పాటు కోసం లీజుకు ఇచ్చిన విషయం నిజమేనని ఇఫ్తిఖార్ తెలిపారు. అయితే ఆలయం ఉన్న భూమిని మాత్రం ఎవరికీ లీజుకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆలయాన్ని తిరిగి నిర్మించాలా లేదా అనే విషయంపై ETPB ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.
ఈ పురాతన ఆలయం కూల్చివేతతో పాకిస్థాన్‌లోని హిందూ మైనారిటీల మతపరమైన ప్రదేశాల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రార్థనా స్థలాలను, వాటికి సంబంధించిన ఆస్తులను రక్షించేందుకు ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : చైనాలో న్యూ కల్చర్.. ఆసుపత్రులు, బ్యాంకులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లిళ్లు.. కారణం తెలిస్తే షాక్!









