
చైనాలో రోజురోజుకీ పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య తగ్గిపోతుండటంతో అక్కడి ప్రభుత్వాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో చైనా స్థానిక అధికారులు కొత్తగా ఉండే వింతైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివాహ నమోదు ప్రక్రియను యువతకు వీలైనంత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రసూతి ఆసుపత్రులు, బ్యాంకులు, నైట్‌క్లబ్‌లు, విమానాశ్రయాలు వంటి అసాధారణ ప్రదేశాలలో వివాహ నమోదు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది.
Also Read : ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలి.. అమెరికా, ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవాలి : మొజ్తబా ఖమేనీ
ఇటీవల క్విక్సీ పండుగ సందర్భంగా షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని లింజి జిల్లాలో ఉన్న ఒక మాతృ శిశు ఆరోగ్య ఆసుపత్రి ప్రత్యేక వివాహ నమోదు కౌంటర్‌ను ప్రారంభించింది. జంటలు ఆసుపత్రికి వచ్చి అక్కడికక్కడే చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవచ్చని ప్రకటించింది. దీనివల్ల నూతన వధూవరులకు ఇది ఒక ‘వన్-స్టాప్ షాప్’లా ఉపయోగపడుతుంది. ఒకే భవనంలో వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవడంతో పాటు పెళ్లికి ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, గర్భధారణకు సంబంధించిన వైద్య సలహాలు పొందడం వంటివన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.
కేవలం ఆసుపత్రులే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ వింత ప్రదేశాలలో కూడా ఈ కేంద్రాలు వెలుస్తున్నాయి. గతేడాది టియాంజిన్‌లోని చైనా పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ శాఖ వివాహ నమోదు సేవలను ప్రారంభించి వార్తల్లో నిలిచింది. గ్వాంగ్జౌ విమానాశ్రయం సుందరమైన లొకేషన్లో పెళ్లి సర్టిఫికెట్లు జారీ చేస్తుండగా షాంఘైలోని ఒక నైట్‌క్లబ్ మ్యూజిక్ ఫెస్టివల్లో భాగంగా వివాహ వేడుకలను నిర్వహించింది. ఇవే కాకుండా మెట్రో స్టేషన్లు, పార్కులు, చారిత్రక దేవాలయాల వద్ద కూడా అధికారులు రిజిస్ట్రీ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
చైనా ఎదుర్కొంటున్న తీవ్రమైన జనాభా సంక్షోభమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోవడం, యువ కార్మిక శక్తి తగ్గిపోతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది. అందుకే యువతను త్వరగా పెళ్లిళ్లు చేసుకుని, కుటుంబాలను ప్రారంభించేలా ప్రోత్సహించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. వివాహ పత్రాల ప్రక్రియను ఈజీ చేయడంతో గతేడాది తాత్కాలికంగా పెళ్లిళ్లు పెరిగినప్పటికీ.. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో మళ్లీ వివాహాల నమోదు 7.5% తగ్గాయి.
అధికారుల వినూత్న చర్యలపై సోషల్ మీడియాలో భారీగా విమర్శలు, చమక్కులు వెల్లువెత్తుతున్నాయి. “పెళ్లిళ్లు చేసుకోవడానికి సరైన స్థలం దొరక్క యువత ఆగిపోతున్నారా ఏంటి?” అని ఒక నెటిజన్ ప్రశ్నించగా.. “పౌర వ్యవహారాల శాఖ విడాకుల కేంద్రాలను ఎవరెస్ట్ పర్వతం పైన పెడితే మంచిది” అని మరొకరు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read : 3 రోజుల పాటు వరద శిథిలాల కింద.. ప్రాణాలతో బయటపడ్డ 6 ఏళ్ల బాలిక









