– RAVI PRAKASH

Nepal Floods: ఒక్కసారి ఊహించండి.. 300 అడుగుల ఎత్తునుంచి… నీరు, మంచు, రాళ్లు, బురద ఒక్కసారిగా కిందికి దూసుకొస్తే.. అది కూడా గంటకు 190 కిలోమీటర్ల వేగంతో! అంటే దాదాపు వందే భారత్ రైలు ప్రయాణ వేగం కంటే ఎక్కువ. అంత వేగంలో ఒక్కసారిగా వరద మీవైపు దూసుకొస్తే… ఏం జరుగుతుందో ఆలోచించేలోపే అంతా జరిగిపోతుంది.ఇప్పుడు అదే నీరు, మంచు, రాళ్లు, బురద.. అన్నీ కలిసి ఒక ఇరుకైన హిమాలయ లోయలోకి వేగంగా దూసుకొస్తున్నాయనుకోండి. ఆ దారిలో మీరు ఉన్నారనుకోండి.. ఏం చేస్తారు? ఎటువైపు వెళ్లాలి? ఎక్కడికి పరుగెత్తాలి? ఏం జరుగుతుందో ఆలోచించే లోపే… వరద మిమ్మల్ని చుట్టేస్తుంది. నేపాల్‌ విపత్తు ఇంత భయంకరంగా ఎందుకు మారింది? ఈ ఘటనపై వాతావరణ నిపుణుడు, శాస్త్ర ప్రచారకుడు మైక్ బెట్స్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సమగ్ర విశ్లేషణ చేశారు. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా మంచుకొండ (గ్లేషియర్) ఎలా కూలింది? ఇంత పెద్ద వరద ఎలా వచ్చింది? అసలు అక్కడ ఏం జరిగిందో.. దీని గురించి తెలుసుకుందాం..మంచుకొండ ఉన్న పర్వత పైభాగం గురించి మైక్ బైట్స్ తొలుత వివరించారు. అక్కడ మంచుకొండ ఎక్కడ ఉంది? అది ఎంత ఎత్తులో ఉంది? కొండ ఎంత నిటారుగా ఉంది? అక్కడి నుంచి నీరు, మంచు, రాళ్లు ఏ దారిలో కిందికి వచ్చాయి? ఇవన్నీ 3డి రూప చిత్రాల ద్వారా చూపిస్తూ మైక్ బెట్స్ విశ్లేషించారు.

Also Read : డార్క్ వెబ్‌లో ఉగ్ర కుట్ర.. అశ్లీల సైట్లు, సీక్రెట్ యాప్‌లతో పాక్ ISI డర్టీ గేమ్!

మంచుకొండ ఉన్న ప్రాంతం దాదాపు 5,200 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే సుమారు 17 వేల అడుగులు. ఉపగ్రహ చిత్రాల్లో చూస్తే మంచుకొండలోని ఒక పెద్ద భాగంతో పాటు, దాని చుట్టూ ఉన్న పర్వత ప్రాంతం కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాదాపు 1.2 కిలోమీటర్ల ఎత్తు నుంచి లోయలోకి జారిపడింది. అమెరికా భూవిజ్ఞాన సంస్థ (USGS) నివేదిక ప్రకారం ఇది చాలా వేగంగా జరిగిన కొండచరియల పతనం. అయితే అసలు ఇది మంచుతో కలిసి కొండచరియలు విరిగిపడిన ఘటనా? లేదా మంచుకొండ మొత్తం కూలిపోయిందా? అన్నది ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పెద్ద మొత్తంలో మంచు, రాళ్లు అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందికి పడితే అక్కడే ఆగిపోవు. వేగంగా మరింత కిందికి దూసుకొస్తాయి. రాళ్లను మంచు ఢీకొంటుంది. మంచును రాళ్లు ఢీకొంటాయి. దాంతో అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా మారిపోతాయి. ఆ తర్వాత అదంతా లోయ వైపు దూసుకెళ్తుంది. కూలిన మంచు, రాళ్లు, మట్టి ఎక్కడా చెదిరిపోకుండా ఒకే దారిలో కిందికి దూసుకెళ్లాయి. అలా కిందికి వస్తున్న కొద్దీ మరింత మంచు మరిన్ని రాళ్లు మట్టి నీరు అన్నీ అందులో కలుస్తూ వెళ్లాయి. అమెరికా భూవిజ్ఞాన సంస్థ కూడా ఇదే చెబుతోంది. కూలిన మంచులో కొంత భాగం వేగంగా కరిగింది. అందులో ఉన్న నీరు, మంచు మిగతా వ్యర్థాలతో (శిథిలాలతో) కలిసిపోయాయి. అదే సమయంలో కింద ఉన్న వాగులు, నదీ మార్గాల నుంచి కూడా మరింత నీరు, మట్టి, రాళ్లు కలిసిపోయాయి. దీంతో ఈ ప్రవాహం మరింత భారీగా, అత్యంత ప్రమాదకరంగా మారింది.

మొదట మంచుకొండ, పర్వతంలో కొంత భాగం కూలిపోయింది. అలా కిందికి వచ్చిన మంచు, రాళ్లు, మట్టి నీటితో కలిసి భారీ వరదలా మారిపోయాయి. అది కేవలం నీరు కాదు నీటితో పాటు రాళ్లు, బండరాళ్లు, మట్టి, మంచు దారిలో ఎదురైన ప్రతీదాన్ని కలుపుకుని కిందికి భారీ ప్రవాహంగా దూసుకెళ్లింది. వాస్తవానికి హిమాలయాల్లోని లోయలు ఇరుకుగా ఉంటాయి. కొండ వాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ వరద ఎక్కడా చెదిరిపోకుండా ఒకే దారిలో వేగంగా కిందికి దూసుకెళ్లింది. మైక్ బెట్స్ అంచనా ప్రకారం కొన్ని ప్రాంతాల్లో నీళ్లు, రాళ్లు, మట్టి కలిసి వచ్చిన వరద దాదాపు 300 అడుగుల ఎత్తుకు చేరి ఉండొచ్చు. అంతేకాదు ఈ వరద గంటకు 100 మైళ్ల వేగంతో అంటే దాదాపు 190 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి ఉండొచ్చు. గంటకు 190 కిలోమీటర్ల వేగంతో వరద దూసుకొస్తే.. ఊహించడానికే భయంగా ఉంది. అంటే వందే భారత్ రైలు కంటే వేగం! అంతటి వేగంతో నీళ్లు, మంచు, రాళ్లు, బురద అన్నీ కలిసి మీ గ్రామం వైపు దూసుకొస్తే తప్పించుకునే అవకాశం ఎంత ఉంటుంది? చాలా తక్కువ. నది మెల్లగా పొంగి పొర్లడం కాదు. నీళ్లు, మంచు, రాళ్లు, బురద అన్నీ కలిసి ఒక్కసారిగా లోయలోకి దూసుకొచ్చాయి. ఇక మైక్ బెట్స్‌ విశ్లేషణలో మరో కీలకమైన విషయం ఉంది. అదే సమయం.

Also Read : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందంటే?

అసలు భయపెట్టే విషయం ఏంటంటే.. ఈ మొత్తం ప్రమాదం క్షణాల్లో జరిగిపోయింది. అమెరికా భూవిజ్ఞాన సంస్థ ప్రకారం.. నేపాల్‌లో ఉదయం 8 గంటల 37 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో మొదట భూకంపం అనుకున్నారు. కానీ తర్వాత చేసిన పరిశోధనలో ఆ ప్రకంపనలు భూకంపానివి కాదని తేలింది. మంచుకొండ కూలిపోవడం, దాని వల్ల మంచు, రాళ్లు, మట్టి భారీగా కిందికి దూసుకురావడం వల్లే ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ భారీ ప్రవాహం ల్హెండే ఖోలా, భోటే కోషి, త్రిశూలి నదుల వైపు దూసుకెళ్లింది. అమెరికా భూవిజ్ఞాన సంస్థ అంచనా ప్రకారం ఈ వరద, కొట్టుకొచ్చిన శిథిలాలుదాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించాయి. మంచుకొండ కూలిన తర్వాతవరద కిందికి చేరుకోవడానికి ఎంత సమయం పట్టింది? ప్రజలకు తమ ప్రాణాలు రక్షించుకునే సమయం కూడా ఆ ప్రళయం ఇవ్వలేదు. ఈ విపత్తు క్షణాల్లో ఊళ్లమీదకు దూసుకొచ్చిందో అర్థమవుతుంది. కానీ ఇక్కడే మరో పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. ఇంత భారీ వరదకు ఇంత నీరు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ నీరు ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలంటే ఈ ఘటన వెనుక ఉన్న అసలు శాస్త్రీయ కారణాలేంటో ఒక్కసారి అర్థంచేసుకోవాలి.

ఒక మంచుకొండ కూలిపోతే ఇంత పెద్ద వరద ఎలా వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే! అసలు మంచు, రాళ్లు, నీరు కలిసి ఎలా భారీ ప్రవాహంగా మారాయో ఇప్పుడు చూద్దాం. మంచుకొండ గత కొన్ని సంవత్సరాలుగా చాలా మారిపోయింది. వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ నేపాల్‌లోని మంచుకొండలు కూడా వేగంగా కరుగుతున్నాయి. మైక్ బెట్స్‌ చెప్పిన ప్రకారం యాలా మంచుకొండ కూడా గత కొన్నేళ్లుగా క్రమంగా కరిగిపోతోంది. ఇక, మరో ముఖ్యమైన విషయం మంచు. తెల్లటి మంచు సూర్యరశ్మిలో ఎక్కువ భాగాన్ని తిరిగి పరావర్తనం చేస్తుంది.దీన్నే శాస్త్రవేత్తలు సూర్యకాంతి పరావర్తన శక్తి (ఆల్బెడో) అంటారు. కానీ ఉష్ణోగ్రతలు పెరిగి మంచు కరిగిపోతే కింద ఉన్న మంచు, రాళ్లు, మట్టి బయటకు కనిపిస్తాయి. ఇలాంటి నల్లటి,చీకటి ఉపరితలాలు సూర్యుడి వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. అంటే మరింత వేడి. ఈ అధిక వేడి వల్ల మంచు కరగడం కూడా వేగంగా జరిగే అవకాశం ఉంటుంది.

కానీ మంచు కరగడం ఒక్కటే ఇలాంటి విపత్తుకు కారణం కాదు. ఇక్కడ మంచుకొండ లోపలి నిర్మాణం, అది ఎలార్పడింది అన్నది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ మంచుకొండపై కనిపిస్తున్న చారలను (గీతలను) ఒకసారి చూడండి. మైక్ బెట్స్‌ కూడా ఈ చారలను చూపిస్తూ మంచుకొండలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో అది ఎందుకు ప్రమాదకరంగా మారవచ్చో చెప్పారు. ఈ ప్రాంతం అస్థిరంగా మారడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కొండ వాలు ఎక్కువగా ఉండటం మళ్లీ మళ్లీ జరిగే గడ్డ కట్టడం,కరిగే చక్రాలు, చిన్న చిన్న ప్రకంపనలు, మంచుకొండ నిర్మాణంలో మార్పులు, ఇవన్నీ కలిసి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చే అవకాశం ఉంది. మంచుకొండ నుంచి కింద ఉన్న నది వరకు ఒక సహజమైన దారి ఉంది. అందుకే మంచుకొండ కూలినప్పుడు మంచు, రాళ్లు, మట్టి ఎక్కడా చెదరిపోకుండా ఆ దారిలోనే కిందికి దూసుకెళ్లాయి. ఇక కొండ వాలు ఎక్కువగా ఉండటంతో గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) కారణంగా వాటి వేగం మరింత పెరిగింది. మంచుకొండ నుంచి నది వరకు కొండ చాలా నిటారుగా ఉంది. కొద్ది మైళ్ల దూరంలోనే వేల అడుగుల ఎత్తు తేడా ఉంది. అంటే పై నుంచి కిందికి పడుతున్న మంచు, రాళ్లు, మట్టి.. వేగం పుంజుకుంటూ మరింత బలంగా కిందికి దూసుకొస్తాయి. ఇదే కారణంగా వరద కూడా అంత వేగంగా కిందికి దూసుకొచ్చింది.

ఇది ఇక కేవలం మంచుకొండ కూలిన ఘటన కాదు. కిందికి దూసుకొస్తున్న మంచు, రాళ్లు.. ఒకదానికొకటి ఢీకొని ముక్కలవుతున్నాయి. రాళ్లు పగిలిపోతున్నాయి.. మంచు చెల్లాచెదురవుతోంది.. అందులో నీరు, మట్టి కూడా కలుస్తున్నాయి. అలా మొత్తం కలిసి భారీ బురద ప్రవాహంగా మారిపోతుంది. అందుకే ఈ వరద ఇంత విధ్వంసం సృష్టించింది. ఎందుకంటే ఇందులో కేవలం నీరు మాత్రమే లేదు. నీటితో పాటు బండరాళ్లు, మట్టి, మంచు, చెట్లు,సిమెంట్ నిర్మాణాలు దారిలో ఎదురైన ప్రతిదీ కొట్టుకొచ్చింది. అంటే నీటితో పాటు కొండలోని కొంత భాగం కిందికి దూసుకొచ్చింది. ఇక హిమాలయాల్లో మరో కీలకమైన విషయం ఉంది. కొండ వాలు. మైక్ బెట్స్‌ ఇక్కడి కొండ వాలును మిసిసిపీ నదితో పోల్చారు. మిసిసిపీ నది మిన్నియాపోలిస్ నుంచి న్యూ ఓర్లియన్స్ వరకు దాదాపు 1,700 మైళ్లు ప్రయాణిస్తుంది. అంత దూరం ప్రయాణించినా మొత్తం ఎత్తు తేడా సుమారు 750 అడుగులే. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా వేరు. చైనా-నేపాల్‌ సరిహద్దు వైపు 13 మైళ్లలోనే 10 వేల అడుగులకు పైగా ఎత్తు తేడా ఉంది అని మైక్ బెట్స్‌ చెబుతున్నారు. అంటే కేవలం 13 మైళ్లలోనే 10వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి దిగాల్సి ఉంటుంది. అందుకే పై నుంచి కిందికి వస్తున్న మంచు, రాళ్లు, నీరు వేగం పెంచుకుని దూసుకొచ్చాయి. అందుకే వరద అంత వేగంగా వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి లోయ దిగువన మీరు ఉన్నట్టు ఊహించుకోండి. మీ ముందున్న నది మెల్లగా పొంగడం కాదు వేల అడుగుల ఎత్తు నుంచి నీరు, మంచు, రాళ్లు, మట్టి కలిసి.. ఒకే దారిలో వేగంగా కిందికి దూసుకొస్తున్నాయి. అది చివరికి నదిలోకి చేరుతుంది. ఇక్కడి నుంచే మరో ప్రమాదం మొదలవుతుంది. ఇప్పటివరకు కొండలోంచి దూసుకొచ్చిన ఆ ప్రవాహానికి నదే కొత్త దారి అవుతుంది. నదిలోకి చేరిన తర్వాత కూడానీళ్లు, రాళ్లు, మట్టి, మంచు అన్నీ కలిసి మరింత దూరం వరకు కిందికి దూసుకెళ్తాయి.

కొద్ది నిమిషాల్లోనే వరద కిందికి చేరింది. అంటే కొండపై మొదలైన ఈ విపత్తు కింద ఉన్న గ్రామాలకు ఇంత వేగంగా ఎలా చేరింది? దానికి ప్రధాన కారణాలు కొండ వాలు, భారీ ఎత్తు, సహజమైన కాలువ దారి, నీరు, పెద్ద మొత్తంలో మంచు, రాళ్లు, మట్టి…. ఇవన్నీ కలిసి వరదను మరింత వేగంగా కిందికి నెట్టాయి. కానీ ఇక్కడ మరో పెద్ద ప్రశ్న ఉంది. ఇది కేవలం భారీ వర్షం వల్ల వచ్చిన వరద కాదు. అలాగే మంచు కొండ సరస్సు తెగిపోవడం వల్ల వచ్చే సాధారణ వరద కూడా కాదు. మరి నదిలోకి ఇంత భారీ ప్రవాహం ఎలా చేరింది? భారీ వరద నదిలోకి చేరిన తర్వాత కూడా ఇంత దూరం వరకు ఎలా దూసుకెళ్లింది? మంచుకొండ నుంచి కూలిన మంచు, రాళ్లు, మట్టి నదిలోకి చేరాయి. అక్కడి నుంచే అసలు ప్రమాదం మొదలైంది. ఆ భారీ ప్రవాహాన్ని నదే మరింత దూరం కిందికి తీసుకెళ్లింది. అంటే కొండపై మొదలైన విపత్తు నది వెంట వేగంగా ముందుకు కదిలింది. ఈ భారీ ప్రవాహం ఒక ఇరుకైన హిమాలయ లోయలోకి వెళ్లింది. ఇక్కడే మరో సమస్య వచ్చింది. లోయ ఇరుకుగా ఉండటంతో నీళ్లు, రాళ్లు, మట్టి పక్కలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. అందుకే అవన్నీ ఒకే దారిలో మరింత వేగంగా కిందికి దూసుకెళ్లాయి. దీంతో నీటి మట్టం పెరిగింది. మంచు, రాళ్లు, మట్టి కూడా భారీగా పేరుకుపోయాయి. మైక్ బెట్స్‌ చెప్పిన ప్రకారం హెలికాప్టర్‌ నుంచి తీసిన దృశ్యాల్లో కొన్ని ప్రాంతాల్లో మట్టి, రాళ్ల కుప్ప దాదాపు 300 అడుగుల ఎత్తు ఉన్నట్టు కనిపించింది.

300 అడుగులు. ఒక్కసారి ఆ ఎత్తును ఊహించుకోండి. దాదాపు 30 అంతస్తుల భవనం ఎత్తు. కానీ అది ఒక భవనం కాదు. నీరు, మట్టి, రాళ్లు, శిథిలాలు అన్నీ కలిసి కదులుతున్న భారీ సముదాయం. ఇక ఈ మొత్తం ఘటనలో అత్యంత కీలకమైన సాక్ష్యం ఒకటి ఉంది. చైనా-నేపాల్‌ సరిహద్దులో ఉన్న నిఘా కెమెరా. మంచుకొండ కూలిపోవడం ఎప్పుడు నమోదైందో మనకు తెలుసు. ఆ కెమెరాలో వరద శిథిలాలు భవనాన్ని మొదట ఎప్పుడు ఢీకొట్టాయో కూడా తెలుసు. మైక్ బెట్స్ లెక్కల ప్రకారం.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కేవలం 7 నిమిషాల 40 సెకండ్లు. 7 నిమిషాల 40 సెకండ్లు అంతే! వేల అడుగుల ఎత్తులో మొదలైన విపత్తు ఎనిమిది నిమిషాలు కూడా కాకముందే సరిహద్దుకు చేరుకుంది. మైక్ బెట్స్ అంచనా ప్రకారం ఆ భాగంలో సగటు వేగం గంటకు సుమారు 105 మైళ్లు. అంటే గంటకు దాదాపు 170 కిలోమీటర్లు. ఆ తర్వాత ఇది 190 కిలోమీటర్లుగా తేలింది. దాదాపు వందే భారత్ రైలు ప్రయాణ వేగం!

ఇప్పుడు ఈ భారీ వరద ఇళ్లను, భవనాలను ఢీకొన్నప్పుడు అది భవనాన్ని మెల్లగా నెట్టుకుంటూ వెళ్లలేదు ఒక్కసారిగా చాలా బలంగా ఢీకొట్టింది. ఎందుకంటే ఆ ప్రవాహంలో కేవలం నీళ్లు మాత్రమే లేవు. బండరాళ్లు, చెట్లు, లోహాలు, కాంక్రీట్, వాహనాలు. దారిలో కొట్టుకొచ్చిన ప్రతిదీ ఆ ప్రవాహంతో పాటు వేగంగా వచ్చాయి. అందుకే అవి కూడా చాలా ప్రమాదకరంగా మారాయి. ఈ వరద కేవలం నీటితో విధ్వంసం చేయలేదు. కొండపై ఉన్న మంచు, రాళ్లు, మట్టి అన్నింటినీ తనతో పాటు కిందికి తీసుకొచ్చింది. ఇక ఆ భారీ ప్రవాహం నదికి ఎదురుగా ఉన్న ఒడ్డును ఢీకొట్టింది. ఆ దెబ్బకు నీళ్లు, రాళ్లు కొంత భాగం వెనక్కి వెళ్లినట్టు కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ప్రవాహంతో కలిసి కిందికి వెళ్లిపోయాయి. దీన్ని బట్టి ఆ వరద ఎంత శక్తితో దూసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే సరిహద్దు వరకే ఈ విధ్వంసం ఆగలేదు. వరద ఇంకా కిందికి వెళ్తూనే ఉంది. కొంత దూరం వెళ్లాక లోయ వెడల్పు పెరిగింది. కొండ వాలు తగ్గింది. దాంతో వరద వేగం క్రమంగా తగ్గింది. అలాగే మొదట్లో ఉన్న 300 అడుగుల ఎత్తైన ప్రవాహం కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ విధ్వంసం మాత్రం కొనసాగుతూ వచ్చింది. మంచు కొండ కూలిన ప్రాంతం నేత ప్రాంతానికి దాదాపు 45 మైళ్ల దూరంలో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి నీటి ఎత్తు తగ్గింది. వేగం కూడా తగ్గింది.

వంతెనలు, భవనాలు , శిథిలాలు వంతెనలు కనిపించకుండా పోయాయి. భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని పూర్తిగా కూలిపోయాయి. మౌలిక సదుపాయాలు మొత్తం కొట్టుకుపోయాయి. హిమాలయాలతో ఇదే పెద్ద ప్రమాదం. కొండపై మొదలైన ఘటన నదిలోకి చేరిన తర్వాత చాలా దూరం వరకు ప్రయాణిస్తుంది. దాంతో కొండకు చాలా దూరంలో ఉన్న గ్రామాలు, పట్టణాలు కూడా ప్రభావితం అవుతాయి. అమెరికా భూవిజ్ఞాన సంస్థ అంచనా ప్రకారం ఈ ప్రవాహం, వరద దాదాపు 100 కిలోమీటర్లు దిగువ ప్రాంతాల వరకు ప్రయాణించింది. అయితే ఇది మేఘావృత కుండపోత వర్షం (క్లౌడ్ బరస్టా) కాదు. ఇది సాధారణ మంచు సరస్సు తెగిపడటమే (GLOF)? ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మొదట మంచుకొండ పర్వత భాగం కుప్పకూలింది. ఆ తర్వాత మంచు, రాళ్లు ఒక్కసారిగా కిందికి జారిపోయాయి. అవి కిందికి వస్తూ నీళ్లు, మట్టి, మరిన్ని రాళ్లతో కలిసిపోయాయి. చివరిగా, ఇదంతా భారీ వరదగా మారింది. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే మంచుకొండ అసలు ఎందుకు కూలిపోయింది? మైక్ బెట్స్ కొన్ని సంభవించే కారణాలను చూపిస్తున్నారు. వాతావరణ వేడి పెరగడం మంచుకొండలు వెనక్కి తగ్గడం గడ్డకట్టడం,కరిగే చక్రాలు, మంచుకొండ నిర్మాణం, పర్వత పర్యావరణంలో అస్థిరత ఇవన్నీ కలిసి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చి ఉండొచ్చు.

అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా చెప్పాలి. వాతావరణ మార్పు ఒక్కటే ఈ విపత్తుకు కారణమని ఇప్పుడే చెప్పలేం. అసలు ఏ కారణంగా మంచుకొండ కూలింది? ఏది ప్రేరేపకం (ట్రిగ్గర్) అయింది? అన్నది శాస్త్రవేత్తలు ఇంకా పరిశీలిస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాంతో మంచుకొండలు కరుగుతూ క్రమంగా తగ్గుతున్నాయి. అంతేకాదు ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న మంచు, రాళ్లు, నేల ఎంత బలంగా ఉన్నాయి? అన్నదానిపై కూడా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే నేపాల్‌లో జరిగిన ఈ ఘటన మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతోంది. ఒక చోట మొదలైన చిన్న ఘటన వరుసగా మరిన్ని ప్రమాదాలకు దారి తీయొచ్చు. ముందుగా మంచుకొండ కూలింది.

ఆ తర్వాత మంచు, రాళ్లు కిందికి దూసుకొచ్చాయి. అవి నదిలోకి చేరాయి. నది ఆ ప్రవాహానికి కొత్త దారిగా మారింది. నీళ్లు, మంచు, రాళ్లు, మట్టి అన్నీ కలిసి ఇంకా వేగంగా కిందికి వెళ్లాయి. కొద్ది నిమిషాల్లోనే చాలా దూరంలో ఉన్న గ్రామాలు కూడా ప్రమాదంలో పడ్డాయి. మైక్ బెట్స్‌ చూపించిన కాలక్రమం (టైమ్‌లైన్) చూస్తే ఈ మొత్తం సిరీస్ ఎంత వేగంగా జరిగిందో ఊహించడమే కష్టం. పర్వతం కూలిపోయింది. ఏడు నిమిషాల్లో ప్రళయం. ఇదే నేపాల్‌ విపత్తు కథ. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఇలాంటి విపత్తు మళ్లీ జరగొచ్చా? హిమాలయాల్లో వేలాది మంచుకొండలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కొండ వాలు కూడా చాలా ఎక్కువగా ఉంది. వాటి కింద నదుల వెంట చాలా మంది నివసిస్తున్నారు. అందుకే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే ఉపగ్రహ నిఘా (శాటిలైట్ మానిటరింగ్) అవసరం. ఎత్తైన ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ప్రమాదం వస్తే వెంటనే ప్రజలను హెచ్చరించే ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు కూడా అవసరం. అలాగే హిమాలయాల్లో వస్తున్న మార్పుల వల్ల ముందు ముందు ఇలాంటి ప్రమాదాలు ఎలా ఉండొచ్చో కూడా మనం బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే కొండ కదలడం మొదలైనప్పుడు మనకు కొన్ని నిమిషాలే ఉండొచ్చు. ఆ ప్రళయం కళ్ల ముందు కనిపించే సమయానికి అప్పటికే ప్రమాదం ముంగిట్లో ఉండొచ్చు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.