
పెద్దవాళయ్యాక బొమ్మలతో పని ఏంటని కొందరు అనుకుంటారు. కానీ నేటి యువత ఆ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఉద్యోగ ఒత్తిళ్ల నుంచి కాస్త రిలీఫ్ కోసం తమ చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ బతికించుకోవడానికి జెన్ జెడ్, మిలీనియల్స్ సరికొత్త దారి ఎంచుకున్నారు. ఇప్పుడు 20, 30 ఏళ్ల వయస్సున్న యువతీయువకులు తమ ఇళ్లలో లెగో సెట్లు అమరుస్తున్నారు. అలాగే బార్బీ బొమ్మలను సేకరిస్తున్నారు. పోకీమాన్ కార్డులతో ఆడుకుంటున్నారు. పెద్దవారైనప్పటికీ పిల్లల వలె బొమ్మలతో గడుపుతున్న ఈ సరికొత్త ప్రపంచాన్ని పరిశ్రమలో కిడల్ట్స్ అని పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కిడల్ట్ ట్రెండ్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో చూద్దాం.
Also Read : భారత రాడార్లకు చిక్కినా మారని చైనా బుద్ధి.. వార్నింగ్ గాలికి వదిలేసి.. గగనతలంలో 25 నిమిషాలు?
కిడల్ట్ ట్రెండ్ అంటే?
కిడల్ట్ అనే పదం ఈనాడు పుట్టుకొచ్చింది కాదు. ఇది 1980ల నాటికే వాడుకలో ఉంది. 1985న ఆగష్టు 11న దీని కోసం కొన్ని వార్తా పత్రికలు ప్రచురించాయి. అయితే ఆ రోజుల్లో దీనికి వేరే అర్థం ఉండేది. అప్పట్లో పిల్లల్లా ప్రవర్తించే కొద్దిమంది పెద్దలను మాత్రమే అలా పిలిచేవారు. కాని నేటి ఆధునిక కాలంలో కిడల్ట్ అంటే అర్థం పూర్తిగా మారిపోయింది. ఉద్దేశపూర్వకంగా తన బాల్యపు జ్ఞాపకాలను, వస్తువులను తన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుని తన స్వంత కష్టార్జితంతో వాటిని కొనుగోలు చేసే పరిపక్వత ఉన్న పెద్దవాడిని నేడు కిడల్ట్ అంటున్నారు. ఈ ట్రెండ్‌ను ప్రధానంగా ముందుకు నడిపిస్తున్నది జెన్ జెడ్, మిలీనియల్స్ తరాలే. వీరు తమ చిన్నతనంలో లెగో, పోకీమాన్, హ్యారీ పాటర్ వంటి వాటితో ఆడుకుంటూ పెరిగారు. ఇప్పుడు తమ వద్ద స్వంత సంపాదన ఉండటంతో మళ్లీ ఆ రోజులను కొనుగోలు చేసి ఆస్వాదిస్తున్నారు.
ఈ ట్రెండ్ కేవలం ఒక సరదా కాలక్షేపంతో ఆగిపోలేదు. ఇది ప్రపంచ బొమ్మల పరిశ్రమ స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తున్న ఒక శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మారుతోంది. అమెరికన్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ సర్కానా అందించిన గణాంకాల ప్రకారం కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో దాదాపు 65 శాతం మంది పెద్దలు ఒకే సంవత్సరంలో బొమ్మల కోసం 100 నుంచి 500 డాలర్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తేలింది. 18 ఏళ్లు పైబడిన వారి బొమ్మల కొనుగోళ్లు ఏకంగా 5.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అదే సమయంలో పిల్లల బొమ్మల అమ్మకాలు మాత్రం క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ బొమ్మల పరిశ్రమలో 15 ఏళ్లు పైబడిన వినియోగదారులే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వర్గంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ప్రతి ఐదు బొమ్మలలో ఒకటి పెద్దవారే కొనుగోలు చేయడం విశేషం. భారతదేశంలో కూడా ఈ ట్రెండ్ వేగంగా పుంజుకుంటోంది. పెద్దల చేతుల్లో ఉన్న కొనుగోలు శక్తి పెరగడంతో ప్రీమియం వస్తువుల మార్కెట్ విపరీతంగా పెరిగింది.
లెగో, బిల్డింగ్ సెట్లు
ఇది కిడల్ట్ మార్కెట్లో నంబర్ వన్ విభాగం. లెగో పువ్వులు, పూలగుతులు, చలనచిత్ర నమూనాల సెట్లను పెద్దలు ఎంతో ఓపికగా కూరుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. భారతదేశానికి చెందిన 28 ఏళ్ల ఐటీ నిపుణుడు దివ్యాంశు రాయ్ వంటి వారు లెగో మెక్లారెన్ కార్లు, 1,000 ముక్కల ఓడల మోడళ్లను ఎంతో ఇష్టంగా సేకరిస్తున్నారు.
లబుబు, ప్లషీస్
పాప్ మార్ట్ సంస్థకు చెందిన ది మాన్స్టర్స్ బ్రాండ్‌కు చెందిన లబుబు బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించాయి. ఈ క్యూట్ బొమ్మలను డిజైనర్ హ్యాండ్ బ్యాగ్‌లకు తగిలించుకోవడం, వాటితో ప్రయాణించడం నేడు యూత్‌లో ఒక బిగ్ ఫ్యాషన్ స్టేట్మెంట్ అయ్యింది.
పోకీమాన్, ట్రేడింగ్ కార్డులు
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది పోకీమాన్ కార్డులు అమ్ముడవుతున్నాయి. అరుదైన కార్డుల కోసం పెద్దలు వేల డాలర్లు చెల్లించడానికి వెనుకాడటం లేదు. ప్రసిద్ధ రాపర్ లాజిక్ ఒక అరుదైన చారిజార్డ్ కార్డు కోసం ఏకంగా 220,000 డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నారు.
బోర్డ్ గేమ్స్, పజిల్ కేఫ్‌లు
చెన్నై లాంటి నగరాల్లో యువత కేఫ్‌లలో గుమిగూడి సంక్లిష్టమైన బోర్డ్ గేమ్స్ ఆడుతున్నారు. 2,000 పైగా ముక్కలు ఉండే పజిళ్లను పూర్తి చేయడానికి రెండు వారాల పాటు సమయం కేటాయిస్తున్నారు.
ఫ్యాన్ కలెక్షన్ వస్తువులు
మార్వెల్, డిసి కామిక్స్, హ్యారీ పాటర్, స్ట్రేంజర్ థింగ్స్, యానిమే సిరీస్‌లకు సంబంధించిన ప్రత్యేకమైన యాక్షన్ ఫిగర్లను పెద్దలు తమ గదుల్లో అలంకరించుకుంటున్నారు.
Also Read : ఆసియాన్ సదస్సులో భారత్ ప్రధాన లక్ష్యాలివే
ఈ ట్రెండ్ వెనుక ఉన్న అసలైన కారణాలు?
దీనిని వెనుక ఒక బలమైన కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. చెస్టర్ విశ్వవిద్యాలయ లెక్చరర్ డాక్టర్ జూలీ కిర్క్హామ్ వీటిని పరివర్తన వస్తువులు అని పిలుస్తారు. ఇవి మనకు ఒంటరితనం నుంచి విముక్తినిచ్చి, భద్రతా భావాన్ని కలిగిస్తాయి. ఆఫీస్ ఒత్తిడిలో ఉన్నప్పుడు చిన్ననాటి బొమ్మను తాకడం వల్ల మెదడుకు ప్రశాంతత లభిస్తుంది. సర్కానా సర్వే ప్రకారం 47 శాతం మంది పెద్దలు బొమ్మలతో గడపడం తమ మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిదని అభిప్రాయపడ్డారు. లెగో సంస్థ నిర్వహించిన అధ్యయనంలో 90 శాతం మంది పెద్దలు ఇవి తమ ఆందోళనలను, ఒత్తిడిని తగ్గించాయని వెల్లడించారు.
ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్, యూట్యూబ్ షార్ట్స్‌లో తాము కొన్న కొత్త బొమ్మల అన్బాక్సింగ్ వీడియోలను పోస్ట్ చేయడం నేడు ట్రెండ్ అయింది. వాటికి వచ్చే లైక్స్, కామెంట్లు మెదడులో ఆనందాన్ని పంచే డోపమైన్ హార్మోన్‌ను విడుదల చేస్తాయి. మన దేశంలో చిన్నతనంలో ఆర్థిక పరిస్థితులు లేదా చదువుల ఒత్తిడి కారణంగా కోరుకున్న బొమ్మలు దొరకని వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తమ స్వంత సంపాదన వచ్చాక, ఆనాటి అసంపూర్ణ బాల్యాన్ని ఈ రూపంలో తీర్చుకుంటూ మానసిక సంతృప్తిని పొందుతున్నారు. చెన్నైకి చెందిన 24 ఏళ్ల సిద్ధార్థ్ నిచాని ఏర్పాటు చేసిన డైకాస్ట్ కార్ల క్లబ్ దీనికి ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.
ఈ మార్పును గమనించిన ప్రముఖ తయారీ సంస్థలు ఇప్పుడు తమ వ్యూహాలను పూర్తిగా మార్చేశాయి. లెగో సంస్థ తన అధికారిక వెబ్సైట్లో ఏకంగా పెద్దల కోసం ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. పెద్దల అభిరుచులు, సృజనాత్మకతకు తగ్గట్టుగా హై-ఎండ్ సెట్లను డిజైన్ చేస్తోంది. అలాగే పిల్లలకు మాత్రమే పరిమితమైన కిండర్ జాయ్ వంటి బ్రాండ్లు ఇప్పుడు పెద్దలను ఆకట్టుకునేలా బ్యాగ్ ట్యాగ్లు, డెస్క్ యాక్సెసరీస్‌ను తయారు చేస్తున్నాయి.









