ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరగనున్న వార్షిక భారత్-ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. సముద్ర భద్రతా సహకారం బలోపేతం చేయడం, ఆసియాన్ సభ్య దేశాలతో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించడం ఈ టూర్ ప్రధాన లక్ష్యం. దీంతో పాటు ఫిలిప్పీన్స్ ఆతిథ్యమిస్తున్న 21వ ఈస్ట్ ఆసియా సమ్మిట్ (EAS)లోనూ మోడీ పాల్గొంటారు.

Also Read : పాక్ ఆర్మీకే చుక్కలు చూపిస్తున్న మాజీ కెప్టెన్.. బలూచ్ తిరుగుబాటుదారుల కొత్త బాస్ ఇతనే!

23వ భారత్-ఆసియాన్ సమ్మిట్ హైలైట్స్:

విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, ఈ సదస్సులో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (Comprehensive Strategic Partnership) పురోగతితో పాటు, ‘ASEAN-India Plan of Action 2026-2030’ అమలుపై కీలక చర్చలు జరగనున్నాయి. భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’, ఇండో-పసిఫిక్ విజన్‌లో ఆసియాన్ సంబంధాలు కీలక పిల్లర్ అని MEA స్పష్టం చేసింది. 2026 సంవత్సరాన్ని ‘ASEAN-India Year of Maritime Cooperation’గా జరుపుకుంటుండటం, అలాగే 2027లో ఇరుపక్షాల మధ్య 35 ఏళ్ల సంభాషణ సంబంధాలు పూర్తి కానుండటంతో ఈ పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఏడాది ఆసియాన్ సమ్మిట్‌ను “Navigating the Future” అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.

2005లో ప్రారంభమైన ఈస్ట్ ఆసియా సమ్మిట్, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ, భౌగోళిక రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చించేందుకు ప్రధాన వేదికగా నిలుస్తోంది. ఇందులో ఆసియాన్ దేశాలతో పాటు భారత్, అమెరికా, రష్యా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పాల్గొంటాయి.

మరోవైపు, ఫిలిప్పీన్స్‌లోని భారతీయ సమాజం ప్రధాని మోడీని కలిసేందుకు ఎంతో ఆసక్తిగా ఉందని MEA కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ తెలిపారు. ఇందుకోసం ప్రధాని షెడ్యూల్‌లో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వాణిజ్యం, పెట్టుబడులు, డిఫెన్స్ రంగాల్లో భారత్-ఆసియాన్ పరస్పర సహకారం ఇరుపక్షాలను మరింత బలోపేతం చేయనుంది.

Also Read : బ్రిటిష్ సిటిజన్‌గా లలిత్ మోదీ: ‘లండనే నా ఇల్లు..’ అంటూ ఎమోషనల్ పోస్ట్!