ఒకప్పుడు పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేసి.. ఆ దేశ రక్షణ కోసం పోరాడిన వ్యక్తి.. ఇప్పుడు అదే దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రమాదకర వేర్పాటువాద సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయనే రెహమాన్ గుల్. పాకిస్థాన్‌ను నిరంతరం వణికిస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ కొత్త కమాండర్ ఇన్ చీఫ్‌గా రెహమాన్ గుల్‌ను నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సంస్థలో మురీద్ అనే మారుపేరుతో పిలిచే గుల్.. గతంలో బీఎల్‌ఏకు చెందిన అత్యంత ప్రమాదకరమైన మజీద్ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించాడు. ఆత్మాహుతి దాడులకు పాల్పడే ప్రత్యేక విభాగంగా ఈ మజీద్ బ్రిగేడ్‌కు పేరుంది.

ఆయన 1984 ఆగస్టులో బలూచిస్థాన్‌లోని నుష్కీ ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ మెంగల్ కుటుంబంలో జన్మించాడు. 2002వ సంవత్సరంలో ఆయన పాకిస్థాన్ సైన్యంలో చేరి.. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ప్రతిష్ఠాత్మక ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో సేవలందించాడు. ఆ సమయంలో వజీరిస్థాన్ ప్రాంతంలో పాకిస్థాన్ తాలిబన్లకు వ్యతిరేకంగా జరిగిన అనేక కీలక సైనిక కార్యకలాపాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. అయితే 2010వ సంవత్సరంలో అనూహ్యంగా పాక్ సైన్యాన్ని విడిచిపెట్టి అదే ఏడాది బలూచ్ లిబరేషన్ ఆర్మీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Also Read : బంగ్లాదేశ్‌లో మళ్లీ హైటెన్షన్: హసీనా రీ-ఎంట్రీతో అవామీ లీగ్ యాక్టీవ్!

పాకిస్థాన్ సైన్యంలో ఉన్నత హోదాలో పనిచేసిన వ్యక్తి తిరుగుబాటు సంస్థలో ఎందుకు చేరాడనే దానిపై అమెరికాకు చెందిన జేమ్స్‌టౌన్ ఫౌండేషన్ 2025లో ఒక ప్రత్యేక నివేదికను ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం గుల్ పాక్ ఆర్మీలో పనిచేస్తున్న సమయంలో సొంత ప్రాంతమైన బలూచిస్థాన్ ప్రజలపై ప్రభుత్వం, సైన్యం సాగిస్తున్న అణచివేత చర్యలు ఆయనను తీవ్రంగా కలిచివేశాయి. తన జాతి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఆయన తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలే ఆయనను పాక్ సైన్యాన్ని వీడి, తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకునేలా ప్రేరేపించాయి.

గుల్ కుటుంబానికి మొదటి నుంచీ బలమైన రాజకీయ, సైనిక నేపథ్యం ఉంది. ఆయన తల్లి వైపు బంధువుల్లో 1970వ దశకంలో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ నేత లవాంగ్ ఖాన్ మెంగల్, అలాగే ప్రఖ్యాత బలూచ్ కవి, రాజకీయ నాయకుడు గుల్ ఖాన్ నసీర్ వంటి వారు ఉన్నారు. గుల్ ఒకవైపు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధం పట్టగా.. ఆయన సోదరుడు సరబ్ ఖాన్ బలూచ్ మాత్రం ఇప్పటికీ పాకిస్థాన్ సైన్యంలోనే పనిచేస్తున్నట్లు అక్కడి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది.

బీఎల్‌ఏలో చేరిన తర్వాత రెహమాన్ గుల్ తన సైనిక అనుభవంతో అంచెలంచెలుగా ఎదిగాడు. మొదట ఖరాన్, కలాత్ వంటి కీలక ప్రాంతాల్లో సంస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాడు. ఆ తర్వాత ఆత్మాహుతి దాడులు నిర్వహించే మజీద్ బ్రిగేడ్‌కు నాయకుడిగా మారి పాక్ భద్రతా దళాలకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ఇటీవల నవంబర్ 3వ తేదీన బీఎల్‌ఏ మాజీ చీఫ్ బషీర్ జెబ్ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సంస్థ సీనియర్ కమాండ్ కౌన్సిల్ సమావేశమై రెహమాన్ గుల్‌ను తమ కొత్త కమాండర్ ఇన్ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జీయాంద్ బలూచ్ తాజాగా వెల్లడించాడు.

Also Read : భారత భూభాగంలోకి చైనా యుద్ధవిమానం.. సిక్కింలో హై అలర్ట్!