
బంగ్లాదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇండియా రెండు షరతులతో షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో మాజీ ప్రధాని స్వదేశానికి తిరిగొస్తానని ప్రకటించడంతో ఆ దేశంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. 2024 ఆగస్టులో ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న ‘అవామీ లీగ్’(Awami League) కార్యకర్తలు ఇప్పుడు మళ్లీ యాక్టివేట్ అయ్యారు. డిసెంబర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బంగ్లాదేశ్‌లో అడుగుపెడతానని హసీనా స్పష్టం చేయడంతో, ఆమె మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రస్తుత ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. రెహ్మాన్ కూడా బంగ్లాదేశ్‌లో పరిస్థితులను చక్కబెట్టలేకపోతున్నారు. సిచువేషన్ ఇలాగే కొనసాగితే అవామీ లీగ్‌కు రెహ్మాన్ తగ్గుకుంటాడా అనేది ప్రశ్నార్థంకంగా మారుతుంది.
గోపాల్‌గంజ్‌లో హింసాత్మక నిరసనలు:
హసీనా సొంత జిల్లా అయిన గోపాల్‌గంజ్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. వందలాది మంది కార్యకర్తలు కత్తులు, ఈటెలతో నిరసనలకు దిగి పోలీసు బారికేడ్లను ధ్వంసం చేశారు. సాయుధ పోలీసు వాహనానికి, అవుట్‌పోస్టుకు నిప్పంటించడమే కాకుండా, ప్రభుత్వ ఆస్తులు, స్మారక చిహ్నాలను ధ్వంసం చేశారు. మూతపడిన పార్టీ జిల్లా ఆఫీసును బలవంతంగా తెరిచారు. అంతకుముందు తుంగిపారాలో అధికార BNP కార్యాలయాలకు నిప్పు పెట్టడంతో ఇరు వర్గాల మధ్య టెన్షన్ పీక్స్‌కు చేరింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం 6 ప్లాటూన్ల BGB బలగాలను, 1,350 మంది పోలీసులను రంగంలోకి దించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీలను సైతం బదిలీ చేసింది.
2026 ఫిబ్రవరి ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని BNP ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, రాజకీయ, శాంతిభద్రతల సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోవడంలో విఫలమవుతోందనే విమర్శలకు ప్రధాన కారణాలు ఇవి:
Also Read : బ్రిటిష్ సిటిజన్‌గా లలిత్ మోదీ: ‘లండనే నా ఇల్లు..’ అంటూ ఎమోషనల్ పోస్ట్!
ఆర్థిక సంక్షోభం & ద్రవ్యోల్బణం
నిత్యావసరాల ధరలు: 2024 తిరుగుబాటు తర్వాత కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో ప్రభుత్వం ఆశించిన వేగంతో పనిచేయలేకపోతోంది. అధిక ద్రవ్యోల్బణం వల్ల సామాన్యులపై భారం పెరిగి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
విద్యుత్, గ్యాస్ కొరత: దేశవ్యాప్తంగా తీవ్రమైన విద్యుత్ కోతలు, గ్యాస్ కొరత ఏర్పడటంతో అనేక వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చింది.
బ్యాంకింగ్ రంగం & రుణాలు: బ్యాంకింగ్ రంగంలో పేరుకుపోయిన భారీ మొండి బకాయిలు, విదేశీ మారక నిల్వల ఒత్తిడి, IMF షరతుల వల్ల సబ్సిడీలలో కోత విధించడం ప్రజల్లో అసంతృప్తిని పెంచింది.
గార్మెంట్ రంగంలో కార్మికుల తిరుగుబాటు
బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన గార్మెంట్ (వస్త్ర) పరిశ్రమలో వేతనాల పెంపు కోసం లక్షలాది మంది కార్మికులు ఆందోళనలకు దిగారు.
అక్టోబర్ నాటికి కొత్త కనీస వేతన బోర్డును ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడంతో నవంబర్ మొదటి వారంలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. వందలాది ఫ్యాక్టరీలు మూతపడటం, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం, హైవేల దిగ్బంధంతో శాంతిభద్రతలు అదుపుతప్పాయి.
శాంతిభద్రతల వైఫల్యం & తీవ్రవాద ముప్పు
అదుపుతప్పుతున్న హింస: పోలీసు వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో బలపడకపోవడంతో దేశంలో మూక దాడులు, దోపిడీలు, రాజకీయ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి.
అతివాదుల విజృంభణ: మధ్యంతర ప్రభుత్వ హయాంలో విడుదలైన కొందరు తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు మళ్లీ యాక్టివ్ కావడం, మీడియా సంస్థలపై దాడులు జరగడం ప్రభుత్వ పాలనా సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. బీఎన్పీ కార్యకర్తలే కర్రలతో రోడ్లపైకి వచ్చి ప్రతిపక్షాలను అడ్డుకోవడం విమర్శలకు దారితీసింది.
Also Read : ఏం జరుగుతోంది.. రోజుకో సంక్షోభం.. అగ్రరాజ్యంపై ఏ దేశం కుట్ర?
Gen Z అంచనాలను అందుకోలేకపోవడం
2024లో హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన విద్యార్థులు, యువత ఆశించిన స్థాయిలో వ్యవస్థాగత సంస్కరణలు, అవినీతి నియంత్రణ, కొత్త ఉద్యోగాల కల్పన జరగడం లేదనే అసహనం వారిలో పెరుగుతోంది. పాత తరహా రాజకీయాలే మళ్లీ కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పాస్‌పోర్ట్ అప్లికేషన్, భారత్‌పై ఒత్తిడి:
ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా, స్వదేశానికి వచ్చేందుకు న్యాయపరమైన అడుగులు వేస్తున్నారు. కొత్త పాస్‌పోర్ట్, నేషనల్ ఐడీ కార్డు (NID) జారీ చేయాలంటూ లండన్‌కు చెందిన ‘మ్యాట్రిక్స్ ఛాంబర్స్’ న్యాయ సంస్థ ద్వారా బంగ్లాదేశ్ హైకమిషన్‌కు దరఖాస్తు పంపారు. అయితే, ఆమెకు డాక్యుమెంట్స్ ఇచ్చే అర్హత ఉందా లేదా అన్నది పరిశీలిస్తున్నామని బంగ్లా హోంమంత్రి తెలిపారు. మరోవైపు, దేశంలో ఆమెకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో, అప్పగింత ఒప్పందం కింద హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌పై ఒత్తిడి పెంచుతోంది. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిందని చెబుతోంది. 2026 ఫిబ్రవరి ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీకి దూరంగా ఉండగా, బీఎన్పీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు హసీనా రీ-ఎంట్రీ ప్లాన్, ఆమెపై ఉన్న మరణశిక్ష, భారత్ తీసుకోబోయే తుది నిర్ణయంపైనే బంగ్లాదేశ్ భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి.









