
ఏలియన్స్, ఎగిరే సాసర్లు అనగానే సాధారణంగా ప్రతి ఒక్కరి దృష్టి అంతరిక్షం లేదా ఆకాశం వైపే వెళ్తుంది. అయితే ప్రముఖ నటుడు, పారానార్మల్ పరిశోధకుడు జాక్ ఓస్బోర్న్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గ్రహాంతరవాసులు సుదూర గ్రహాల నుంచి ఆకాశం ద్వారా రావడం లేదని.. మన భూమిపై ఉన్న మహాసముద్రాల లోతుల్లోనే నివాసం ఉంటున్నారని వ్యాఖ్యలు చేశారు.
గతంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో సహా పలువురు ప్రపంచ నాయకులు, విదేశాంగ ప్రతినిధులు ఏలియన్స్ ఉనికిపై చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు దారితీశాయి. పెంటగాన్, అమెరికా మిలటరీ నివేదికల్లో రికార్డైన ఆధారాలు, విమాన పైలట్లు నివేదించిన దృశ్యాలు వాతావరణ సైంటిస్టుల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. డోనాల్డ్ ట్రంప్ కూడా తన ఇంటర్వ్యూలలో మాట్లాడేటప్పుడు గ్రహాంతరవాసులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు నివేదికలలో ఉన్నాయని తెలిపారు.
జాక్ ఓస్బోర్న్ మాట్లాడుతూ.. మనం ఇకపై కేవలం ఆకాశంలో ఎగిరే UFOల పైనే కాకుండా సముద్రాల్లో సంచరించే USOల (Unidentified Submerged Objects) పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. భూమిపై ఉన్న మహాసముద్రాల అడుగుభాగం 80 శాతానికి పైగా మానవాళికి ఇంకా తెలియని రహస్యంగానే ఉంది. అంతరిక్షం కంటే సముద్ర గర్భాన్ని మనం తక్కువగా అన్వేషించాం.
సముద్రాల అడుగున భౌతిక శాస్త్ర నియమాలకు అందనంత వేగంతో కదిలే పరికరాలు లేదా శబ్దవేగాన్ని మించి ప్రయాణించే నీటి అడుగున తిరిగే వస్తువులు తరచుగా నేవీ రాడార్లకు చిక్కుతున్నాయి. నీటిలో ఎలాంటి అలజడి సృష్టించకుండా అత్యంత వేగంగా పయనించే ఈ సబ్‌మర్సిబుల్స్ భూమిపై ఉన్న మానవ సాంకేతికతకు సాధ్యం కానివని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే భూమి ఉపరితలం కంటే సముద్రాల లోతుల్లోనే ఏలియన్ల రహస్య స్థావరాలు ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది.
అంతరిక్షంలో వేల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించి రావడం కంటే మన గ్రహంలోని మహాసముద్రాల లోతుల్లో దాగి ఉండి మానవాళిని పరిశోధించడం ఏలియన్లకు చాలా సులువని పారానార్మల్ నిపుణులు భావిస్తున్నారు. సముద్ర గర్భంలో ఉండే తీవ్రమైన ఒత్తిడి, చీకటి, మానవ కంటికి అందని వాతావరణం వారికి ఇది ఒక దాగుడుగా ఉంటుంది. అయితే నిజంగానే సముద్రం కింద ఉన్నాయా? లేకపోతే కేవలం ఉహా మాత్రమేనా? అనేది శాస్త్రవేత్తలు ఇంకా తెలపాల్సి ఉంది.








