
Sweet natural gas : అమెరికాతో యుద్ధంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్‌కు భారీ ఊరట లభించినట్లయింది. ఆ దేశంలోని దక్షిణ ఫార్స్ ప్రావిన్స్‌లో 7.5 ట్రిలియన్ ఘనపుటడుగులకు పైగా సహజవాయు నిల్వలు బయటపడినట్లు ఆ దేశ చమురు శాఖ మంత్రి మొహ్సెన్ పక్నెజాద్ వెల్లడించటడం విశేషం. ఇందులో 72, 73 శాతం వరకు గ్యాస్‌ను వెలికితీయవచ్చని అంచానా వేస్తున్నారు. అంటే దాదాపు 5.7 ట్రిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా, ప్రస్తుతం గుర్తించిన గ్యాస్ ‘స్వీట్ గ్యాస్’ కావడం విశేషం. అంటే ఇందులో హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి మలినాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల శుద్ధి, ఉత్పత్తి వ్యయాలు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ ఇప్పటికే దాదాపు 34 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయు నిల్వలతో రష్యా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. తాజా ఆవిష్కరణతో ఆ దేశ ఇంధన సంపద మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, కొత్త క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు భారీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమవుతాయి. యుద్ధం, ఆంక్షలు, అమెరికా దిగ్బంధనం నేపథ్యంలో వాటిని సమకూర్చుకోవడం ఇరాన్‌కు అంత సులువైన అవకాశం కాదనే చెప్పాలి. అమెరికా ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో ఈ గ్యాస్‌ను ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసి లాభాలు గడించడం ఇరాన్‌కు ముందున్న సవాల్ అని చెప్పవచ్చు.
ఆట చివరికొచ్చింది.. ఇరాన్‌కు ఆర్థిక వినాశనమే: అమెరికా
ఇదిలా ఉండగా ఇరాన్‌ను ఒంటరిచేయడమే లక్ష్యంగా అమెరికా ఆ దేశంపై ఆర్థిక యుద్ధానికి సిద్ధమైంది. టెహ్రాన్‌కు సాయం చేసే దేశాలపై కఠిన ఆంక్షలు విధించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ పరిణామాల వేళ అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్చేసిన ప్రకటన కీలకంగా మారింది. ఇరాన్‌తో ఆట చివరికొచ్చిందన్నారు. ఇక ఆ దేశానికి ఆర్థిక వినాశనం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘‘ఇరాన్ (Iran) సైనిక సామర్థ్యాలపై మేం గట్టి దెబ్బకొట్టాం. ఆ దేశ సైనిక ఫ్యాక్టరీలను 100శాతం విధ్వంసం చేశాం. అణు కార్యక్రమాన్ని సమాధి చేశాం. ఇక ఆట చివరికొచ్చింది. ఏ శత్రువుపైనా ఇప్పటివరకు చేపట్టని అతిపెద్ద ఆర్థిక యుద్ధాన్ని ప్రారంభించబోతున్నాం. భద్రతా హామీల ముసుగులో ఇన్నాళ్లూ ఇరాన్ బెదిరింపులు చేస్తూ తన మనుగడ సాగించింది. అమెరికా తమనేమీ చేయలేదని భావించింది. కానీ, ఇప్పుడు ట్రంప్ హయాంలో ఆ శకం ముగిసింది. టెహ్రాన్‌ను ఒంటరి చేసేవరకు.. ఆ నిరంకుశ పాలనను నిలబెడుతున్న ప్రతి ఆర్థిక జీవనాధారాన్ని తెంచడమే మా లక్ష్యం’’ అని స్కాట్ బెసెంట్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. అమెరికా హెచ్చరించినట్లు ఈ ఆర్థిక యుద్ధం సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్కాట్ బెసెంట్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దీనిపై ఇరాన్ కూడా అదే రీతిలో స్పందంచింది. అగ్రరాజ్య ఆర్థిక యుద్ధంలో గల్ఫ్ దేశాలు చేరితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ‘‘ఈ ఆర్థిక యుద్ధం మొదలైతే.. పర్షియన్ గల్ఫ్ నుంచి గానీ, హర్మూజ్ జలసంధి మీదుగా గానీ ఒక్క చుక్క చమురు కూడా దాటదని హెచ్చరించింది. అమెరికా చేపట్టే ఈ ఆర్థిక యుద్ధంలో ఏ దేశమైనా భాగస్వామి అయినా.. లేదా ఇరాన్ ప్రజలకు వ్యతిరేకంగా అగ్రరాజ్యానికి సహకరించినా.. వారిని మేం శత్రువులుగానే పరిగణించాల్సి వస్తుంది’’ అని ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ మొహసెన్ రజాయ్ తీవ్రంగా హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. హర్మూజ్‌లో ప్రస్తుతం నౌకలు రెండు మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఒకటి ఇరాన్ సూచించిన మార్గం కాగా.. మరొకటి అమెరికా భద్రత కల్పిస్తోన్న ఒమన్ రూట్. ఈ మార్గాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న టెహ్రాన్.. తాజాగా నౌకలకు కీలక వార్నింగ్ ఇచ్చింది. తమ ఆదేశాలు పట్టించుకోకుండా.. హర్మూజ్‌లో ప్రయాణ నిబంధనలను ఉల్లంఘించే నౌకలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. వీటికి సహకరించే నౌకలపైనా కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ పరిణామాలన్నింటితో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారేలా కనిపిస్తున్నాయి.









