ఎన్‌టీవీ వ్యవస్థాపకుడు తుమ్మల నరేంద్ర చౌదరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ కేసు నమోదైంది. జేఎచ్‌ఐసీ (Jubilee Hills International Centre) ఎన్నికల్లో నకిలీ పత్రాలు, సంతకాలతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని మాజీ అధ్యక్షుడు సురేందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో మరో ఐదుగురిని కూడా నిందితులుగా చేర్చినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై తుమ్మల నరేంద్ర చౌదరి స్పందించాల్సి ఉంది.

ప్రాథమిక విచారణ అనంతరం, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకట రమణ (Cr.No. 478/2026; సెక్షన్లు 316(2), 318(4), 336(3), 340(2) r/w 3(5) BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తుమ్మల నరేంద్ర చౌదరి, A1 వసంత కుమార్ (అధ్యక్షుడు), A2 టి. ప్రద్యుమ్న కుమార్ రెడ్డి (ఉపాధ్యక్షుడు), A3 సి. జగద్దారావు, A4 ఎం. జనార్దన్ రెడ్డి, A5 ఎ. సురేష్ రెడ్డిలు ఉన్నట్లు సమాచారం.

ఈ నకిలీ పత్రాల ద్వారా  రిజిస్ట్రార్‌ను తప్పుదోవ పట్టించడమే కాకుండా, క్లబ్ సాఫ్ట్‌వేర్‌ను వాడుకుని ఓటర్ల జాబితాను తారుమారు చేశారని ఆరోపించారు. అర్హులైన వారిని పోటీ చేయకుండా బెదిరించారని, 15 మందితో కూడిన కొత్త కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యక్తిగత కోర్టు కేసుల ఖర్చుల కోసం క్లబ్‌కు చెందిన రూ. 75 లక్షల నిధులను ఉపయోగించారని FIRలో నమోదు చేశారు.