
KTR : కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి దాదాపు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా కిందకు పోతోందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంపులను ఆన్ చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ ఒక పెద్ద యజ్ఞంలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఒప్పించి ఈ ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. కేసీఆర్ కేవలం నాలుగేళ్లలోనే 141 టీఎంసీల కెపాసిటీతో ఈ ప్రాజెక్టును కట్టారని, దీనివల్ల రంగారెడ్డి, మహబూబ్‌నగర్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నీళ్లు ఇవ్వొచ్చని గుర్తుచేశారు. కేసీఆర్‌కు కేవలం వారం రోజులు ఈ ప్రాజెక్టును అప్పగించండి.. నీళ్లు ఎలా ఎత్తిపోయాలో చూపిస్తాం అని కేటీఆర్ సవాల్ విసిరారు.
Also Read: TSLPRB : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..ఏకంగా 7,437 పోస్టులకు అనుమతి
రైతులంతా కన్నెపల్లికి వచ్చి చూసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన కోరారు. ఇప్పుడు పంటలకే కాదు, హైదరాబాద్‌లో తాగడానికి కూడా నీళ్ల ఇబ్బంది వస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పంపులు ఆన్ చేయకపోతే.. 60 వేల మందితో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడించి, మేమే స్వయంగా పంపులను ఆన్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను పూర్తిగా నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ఏది ముట్టుకుంటే అది నాశనమైపోతుందని ఎద్దేవా చేశారు. కేవలం డబ్బులు దోచుకోవడానికే వారు ప్రాజెక్టులు కట్టారని మండిపడ్డారు. దాదాపు రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెడితే, అందులో కాళేశ్వరం తప్ప చూపించడానికి ఏమీ లేదన్నారు. ప్రాజెక్టులను మొదటి నుంచే సరిగ్గా కట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని, తప్పులన్నీ వాళ్లే చేసి ఇప్పుడు పంపులు ఆన్ చేయాలంటూ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు.
Also Read : రక్తమోడిన రోడ్లు… నలుగురు మృతి.. పలువురికి గాయాలు









