
USA : అమెరికాలో ఉంటున్న తెలుగువారిని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల వల్ల పలువురు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుండగా.. తాజాగా మరో హృదయవిదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ లో జూలై 5న జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన తెలుగు విద్యార్థిని ప్రసన్న అట్లూరి అక్కడికక్కడే మరణించారు. ఇటీవలె ఆమె పేస్ యూనివర్సిటీ నుండి చదువు పూర్తి చేసుకుని, అమెరికాలో ఇప్పుడిప్పుడే తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించే క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరగడం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది.
ఆమెరికా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రసన్న వెళ్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో కారు అత్యంత వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. అవతలి కారు డ్రైవర్ ట్రాఫిక్ రెడ్ సిగ్నల్‌ను లెక్కచేయకుండా, నిర్లక్ష్యంగా దూసుకురావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రసన్న తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆమె అక్కడే కన్నుమూశారు. అవతలి డ్రైవర్ చేసిన చిన్న నిర్లక్ష్యం యువతి ప్రాణాన్ని బలితీసుకుంది.
ఈ హఠాత్పరిణామంతో ప్రసన్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కళ్లముందే ఎదిగి, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కూతురు ఇలా శవమై తిరిగి వస్తుందని తెలిసి వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రస్తుతం ప్రసన్న స్నేహితులు, అక్కడి తెలుగు సంఘాల ప్రతినిధులు కలిసి ఆమె భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాల్లో చదువుకుంటూ, కెరీర్ నిర్మించుకునే క్రమంలో అంతర్జాతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఊహించని ప్రమాదాలకు ఈ తాజా ఘటన మరో విషాద నిదర్శనంగా నిలిచింది.









