
Konda Surekha : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత విషయంలో పీసీసీ కొండా సురేఖ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరగా సురేఖ ఈ రోజు టిపిసిసి క్రమశిక్షణా కమిటీకి వివరణ ఇస్తూ లేఖ రాసింది. తన వివరణతో కూడిన లేఖను టిపిసిసి క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారు.
Also Read : 22Aపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి సంచలన ఆదేశాలు!

టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుకు సంబంధించి అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం తన వివరణతో లేఖను కమిటి ఛైర్మన్ మల్లు రవికి పంపించారు. లేఖలో క్రమశిక్షణా కమిటీకి మంత్రి తన వివరణ ద్వారా స్పష్టతనిచ్చారు. ఆ లేఖలో ఏముందంటే..
ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారని లేఖలో మంత్రి తెలిపారు. తన స్వస్థలమైన గీసుకొండతో తన కూతురు సుస్మితా పటేల్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని సురేఖ వివరించారు.
Also Read : రూపారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్…’బాబు’ అనే పిలుపే వారిని పట్టించింది!
ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి అభిప్రాయపడ్డారు. కుటుంబ బాంధవ్యం ఉన్న కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని మంత్రి సురేఖ లేఖలో అభిప్రాయపడ్డారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని ఆమె వివరించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ లేఖలో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించి, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీకి గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.









