Roopa Reddy Case : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి లో ఉన్న నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య రాష్ర్టంలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా కేసును నల్గొండ జిల్లా పోలీసులు అత్యంత ఫకడ్భందిగా ఛేదించారు. కాగా,ఈ దారుణ హత్యకు పాల్పడింది.. అదే పాఠశాలలో పదవతరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులని పోలీసులు తేల్చారు. రూపారెడ్డిని 27సార్లు కత్తితో పొడిచి ప్రాణం తీసిన నిందితుల్ని కేవలం ఒకే ఒక్క క్లూ ఆధారంగా పోలీసులు ఛేదించడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి నల్గొండ ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ మీడియాకు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రూపారెడ్డి హత్య జరగడానికి కొద్దిసేపటి ముందు తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఆ సమయంలోనే హంతకులు ఇంట్లోకి ప్రవేశించారు. ఆ శబ్ధానికి ఎవరైనా స్కూల్‌ పిల్లలు వచ్చారేమోననే ఉద్దేశంతో రూపారెడ్డి ఫోన్ కట్ చేయకుండానే ‘బాబు’ అని పిలిచారు. ఆ తర్వాత ఆమె ఫోన్ కట్ అయిపోయింది. ఈ విషయాన్ని రూపారెడ్డి చిన్నమ్మ పోలీసుల ఎంక్వయిరీలో వెల్లడించారు. ఈ కోణంలో విచారించిన పోలీసులకు రూపారెడ్డికి పాఠశాల విద్యార్థులను ‘బాబు’అని పిలవడం అలవాటు అని తేలింది. దీంతో పోలీసులు విద్యార్థుల కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అలా అసలు నిందితులు సొంత స్కూల్ విద్యార్థులేనని తేలింది.

Also Read : కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం: 9 మంది బంగ్లాదేశీయులు మృతి!

మంచి చెప్పడమే తప్పైంది

కాగా రూపారెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న విద్యార్థులు ఇద్దరూ నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటున్నట్లు తేలింది. కేవలం 16 సంవత్సరాల వయసున్న వీరు జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. అంతేకాక హాస్టల్‌లో నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్లు వాడుతూ ఒకసారి ప్రిన్సిపాల్ రూపారెడ్డికి దొరికారు. అంతేకాకుండా, వీరు సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ‘తేలికగా డబ్బు సంపాదించడం ఎలా?’ అని వెతుకుతున్న విషయాన్ని రూపారెడ్డి గుర్తించారు… ఈ విషమమై ఆమె వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలోనే గట్టిగా మందలించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఆ విద్యార్థులిద్దరూ ప్రిన్సిపాల్‌పై తీవ్ర కక్ష పెంచుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

యూట్యూబ్‌లో గాలించి.. ప్లాన్‌ చేసి

ఒకవైపు ప్రిన్సిపల్‌ పై కోపంతో పాటు, డబ్బు కూడా అవసరం పడటంతో ప్రిన్సిపాల్ రూపారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని విద్యార్థులిద్దరూ అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో ఆమెను చంపితే పగతీరడంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు కూడ వస్తుందని భావించారు.ఈ క్రమంలో ఆమెను హత్య చేసిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి? అనే విషయాలపై సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో వారం రోజుల పాటు తీవ్రంగా అన్వేషించారు. టెక్నికల్‌ గా దొరకకుండా ఉండేందుకు రూపారెడ్డి ఇంటిని పక్కాగా రెక్కి నిర్వహించారు. అనుకున్న ప్లాన్‌ ప్రకారం కొండమల్లేపల్లిలోనే ఒక కత్తి, చేతి గ్లౌజులు కొనుగోలు చేశారు.

Also Read : సెలవుపై ఇంటికొచ్చి.. పంజాబ్‌లో ఆర్మీ జవాన్ దారుణం!

రక్తపు మరకల నోట్లతో…

అనుకున్న ప్లాన్‌ ప్రకారం రూపారెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉందన్న విషయాన్ని వారు నిర్ధారించుకున్నాక వారు ఆమె ఇంటికి చేరుకున్నారు. వారిలో ఒకరు ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద నిలబడి ఎవరైనా వస్తున్నారా లేదా అని నిఘా పెట్టగా .. మరొకరు ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించినట్లు ఎస్పీ తెలిపారు. ఫోన్‌ లో మాట్లాడుతున్న రూపారెడ్డిపై కత్తితో దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచి హతమార్చాడు. హత్య అనంతరం వారి ఇంట్లో ఉన్న రూ. 1.54 లక్షల నగదుతో పాటు, ఆధారాలు దొరకకుండా ఉండేందుకు రూపారెడ్డి మొబైల్‌ ఫోన్‌ను తీసుకుని నిందితులు పారిపోయారు. విచారణలో భాగంగా పోలీసులు పలువురు అనుమానితులను ప్రశ్నించారు వారిలో ఇద్దరు మైనర్ విద్యార్థుల ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా నిజం బయటపడింది. వారి వద్ద నుంచి హత్య సమయంలో రక్తపు మరకలు అంటుకున్న రూ. 1.54 లక్షల నగదుతో పాటు, రూపారెడ్డి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, హత్య జరిగిన తర్వాత నిందితులు ఇద్దరూ ఎలాంటి ఆధారాలు లభించకకుండా ప్లాన్ చేయడంతో పోలీసులు 50 మందికి పైగా అనుమానితులను విచారించారు. చివరకు, రూపారెడ్డి భర్తను కూడా అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, ఎరుపు రంగు షర్ట్ ధరించిన ఒక మైనర్ బాలుడు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించడం, రూపారెడ్డి చిన్నమ్మ చెప్పిన క్లూ ఆదారంగా పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తన స్నేహితుడితో కలిసి చేసిన ఈ ఘోర హత్యోదంతాన్ని పూర్తి వివరాలతో ఆ విద్యార్థి ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఆ విద్యార్థులను అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. కాగా గౌరవించాల్సిన గురువును కేవలం పదవతరగతి విద్యార్థులే ఇంత ఘోరంగా చంపడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.