
Punjab : పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో ఒక ఆర్మీ జవాన్ తన భార్యను కొట్టి చంపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నేరాన్ని కప్పిపుచ్చేందుకు సహకరించిన ఇద్దరు బంధువులపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడైన భార్తను అరెస్ట్ చేశారు.
హోషియార్‌పూర్ జిల్లా హజీపూర్ సమీపంలోని సునేహ్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్న అమర్‌జీత్ సింగ్, సెలవుపై ఇంటికి వచ్చిన రాత్రే (ఆగస్టు 13) తన భార్య రమాపై దాడి చేసి దారుణంగా కొట్టి చంపేశాడు.
భార్య చనిపోయిన తర్వాత అమర్‌జీత్ సింగ్ నాటకమాడాడు. ఆమె మేడపై నుంచి కింద పడిపోయిందని, హజీపూర్‌లోని ఆసుపత్రిలో చేర్పించామని ఉదయం 4 గంటల ప్రాంతంలో బాధితురాలి ఇంట్లో వారికి సమాచారం అందించాడు. ఆసుపత్రికి వచ్చి చూసేసరికి రమా అప్పటికే మృతి చెంది ఉంది. అయితే ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండటంతో, మేడపై నుంచి పడలేదని.. కొట్టి చంపేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లయినప్పటి నుంచి రమాను శారీరకంగా వేధిస్తున్నారని తెలిపారు. ఈ దంపతులకు 8 ఏళ్ల కొడుకుతో పాటు ఒక కూతురు ఉన్నారు.
బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అమర్‌జీత్ సింగ్‌తో పాటు అతనికి సహకరించిన బాబాయి కుల్దీప్, పిన్ని సోనియాలపై కేసు నమోదు చేశారు. అమర్‌జీత్ సింగ్‌ను కస్టడీలోకి తీసుకోగా, పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, ఆమె సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సంఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.









